ఇదేమిటి కామ్రేడ్!
విషయం, సమయం, సందర్భం అనేవి ఏవీ చూసుకోకుండా ఒకేవిధంగా మాట్లాడే వారిని చూసి ‘‘పెళ్లికీ, తద్దినానికీ ఒకటే మంత్రమా’’ అంటూ పక్కనున్న వారు విసుక్కోవడం అప్పుడప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తుంటుంది. ఒక వామపక్షనేత మాటలు, ప్రకటనలు వింటుంటే ఒక్కోసారి ఇదే సామెత స్ఫురణకు వస్తుందని ఆ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటుంటారు.
సర్కార్‌పై ఘాటైన విమర్శలు చేసినా, ముఖ్యమైన సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖలు, వినతులు సమర్పించినా, విలేకరుల సమావేశాల్లో మాట్లాడినా తప్పనిసరిగా ఆయన ఒక డిమాండ్‌తో ముగిస్తూ ఉంటారు. సమస్య ఎంత జఠిలమైనదైనా, అంతగా ప్రాధాన్యత లేనిదైనా ఆయన అదే డిమాండ్‌ను చేయడం పరిపాటిగా మారిందని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. తీవ్రమైన ఈ సమస్యపై సీఎం వెంటనే స్పందించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ వర్గాల సమస్యలను పరిష్కరించాలనీ, ఆర్టీసి కార్మికుల సమ్మెను విరమింపజేయాలి అంటూ దీనికోసం వెంటనే అఖిలపక్షసమావేశాన్ని ఏర్పాటుచేయాలనీ డిమాండ్ చేసేస్తుంటారు.
ఆయన ప్రస్తావించే చిన్నా, పెద్దా సమస్యలన్నింటిపై ప్రభుత్వం ఆల్‌పార్టీ మీటింగ్ జరపడం సాధ్యమేనా అని మిగతా పార్టీల నాయకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తుంటారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆయా సమస్యలపై వినతిపత్రాలను సమర్పించేందుకు రాజకీయపక్షాల నాయకులకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, అందువల్ల కనీసం అఖిలపక్షభేటీలను నిర్వహిస్తేనైనా ఆయా సమస్యలను స్వయంగా ప్రస్తావించవచ్చునని తరచుగా ఆ కమ్యూనిస్టునేత ఈ డిమాండ్ చేస్తూ ఉండవచ్చునని మరోనేత ముక్తాయింపునివ్వడం విశేషం.