వాస్తవికవాది, కమ్యూనిస్టు యోధుడు పన్సారే..
మురికితనం, కరుకుతనం ఆ సుకుమార హృదయాన్ని నిలువెల్లా గాయం చేస్తే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకు వెళ్లిపోయాడు గోవింద్ పన్సారే. అనేకానేక అస్థిత్వ ఉద్యమాలకు, అణగారిన వర్గాల పోరాటాలకు నెలవైన మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో జరిగిన రెండో హత్య ఇది. హేతువాద ఉద్యమకారుడైన డాక్టర్ నరేంద్ర దబోల్కర్‌ను 2013 ఆగస్టులో పన్సారే మాదిరే మితవాద మతతత్వ శక్తులు పొట్టనబెట్టుకున్నాయి. నిందితుల్ని వదలబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దుండగుల ఆచూకీ చెప్పిన వారికి 5 లక్షలు ఇస్తామని, నిందితుల వేట కొనసాగుతోందని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది.
గత అనుభవాల దృష్ట్యా పోలీసు మాటల్ని విశ్వసించలేమని వామపక్షాలు కుండబద్దలు కొట్టాయి. ఈ నెల 16న 82 ఏళ్ల పన్సారే, ఆయన భార్య ఉమ కొల్హాపూర్‌లోని తమ ఇంటికి సమీపంలో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండ గులు కాల్పులు జరిపి పారిపోయారు. తూటా దెబ్బలకు గిలగిల్లాడిన ఆ దంపతులకు కొల్హాపూర్ ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పన్సారేను ముంబాయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి హెలికాఫ్టర్‌లో తరలించారు. ఆయన అప్పటికే చనిపోయారు. కమ్యూ నిస్టులు, ప్రగతిశీలురు తల్లడిల్లారు. కార్మిక లోకం భగ్గుమంది. సామా జిక ఉద్యమకారులు దిగ్భ్రాంతి చెందారు.
1933 నవంబర్ 26న అహ్మద్‌నగర్ జిల్లా కొల్హాపూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు.
ఐదుగురి సంతానంలో చివరివాడైన పన్సారేకు చిన్నతనంలోనే కష్టాలు ఎదుర య్యాయి, వారసత్వంగా వచ్చిన ఐదెకరాల ఆస్తిని వడ్డీ వ్యాపారులు లాగేసుకోవడంతో ప్రాథమిక విద్యకు సైతం ఇబ్బందిపడ్డారు. చదువు ఖర్చు కోసం ఇంటింటికీ తిరిగి న్యూస్‌పేపర్లు వేశారు. కొల్హాపూర్ మున్సిపల్ స్కూల్లో ప్యూన్‌గా పని చేశారు. బీఏ పూర్తయిన తర్వాత మున్సిపల్ స్కూలు టీచర్‌గా చేశారు. ప్రజా సమస్యలకు న్యాయ చట్రంలోనే పరిష్కారం కనుక్కోవాలన్న కాంక్షతో లాయర్ పట్టాపుచ్చుకుని కొల్హాపూర్ కోర్టులో ప్రాక్టీసు మొదలు పెట్టారు.
1964లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. తాను డబ్బు జబ్బుకు ఎన్నడూ గురికాలేదు. బడుగు, బలహీనవర్గాల సంక్షే మం, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ మరువలేదు. కమ్యూనిస్టు పార్టీ చీలికకు కొద్ది ముందు సీపీఐలో చేరిన పన్సారే తుది శ్వాస విడిచే వరకు అందులోనే కొనసాగారు. పార్టీలో పిడివాదులకు వ్యతిరేకంగా తన అభి ప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేవారు. అది మరాఠా భాషా ఉద్య మమైనా, గోవా స్వాతంత్య్ర పోరాటమైనా, మరాఠా రాజు ఛత్రపతి శివాజీని కొందరు స్వంతం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు వ్యతిరేక ఉద్యమాన్ని నడిపినా, జాతీయ రహదారులపై టోల్‌గేట్ వసూళ్ల వ్యతిరేక ఆందోళనైనా... అంతే చిత్తశుద్ధితో అంకిత భావంతో నడిపారు.
పట్టుదల, దూరదృష్ట్టికి మారుపేరు. మంచి కార్మిక నాయ కుడు, వక్త, రచయిత. 21కి పైగా పుస్తకాలు రచించారు. అందులో ఖ్యాతి గాంచిందీ, వివిధ భాషల్లోకి అనువాదమైందీ, లక్షన్నర ప్రతులు అమ్ముడైందీ- ‘శివాజీ ఎవరు?’ అనే పుస్తకం. ఛత్రపతి శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదని తేల్చిచెప్పిన పుస్తకం అది. పదేళ్ల కిందట లాయరైన తన ఏకైక కుమారుడు 35 వయస్సులో చనిపోయినప్పుడు మూడోనాడే రోడ్డెక్కి కార్మికుల ఆందోళనలో పాల్గొన్న ధీశాలి. ఇటీవలి కాలంలో ఆయన చేపట్టిన టోల్‌ట్యాక్స్ వ్యతిరేక ఉద్యమం స్వల్పకాలంలోనే రాష్ట్రమంతటా వ్యాపించింది.
ఆయన లెక్కలో టోల్‌ట్యాక్స్ అనేది అన్యాయం, అక్రమమే కాక రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురి పించే పెద్ద వనరు. అందుకే ఆయన ఓ పక్క ప్రజా పోరాటాన్ని నడుపు తూనే మరోపక్క న్యాయ పోరాటాన్ని చేపట్టారు. ఇదే సమయంలో ఆయన.. గాంధీని హత్య చేసిన గాడ్సేని కీర్తిస్తున్న వారినీ వదిలి పెట్టలేదు. ఇది సైతం కొన్ని శక్తులకు కంటగింపుగా మారింది. బహుశా ఈ శక్తులే పన్సారేను పొట్టనబెట్టుకున్నాయన్నది ప్రజల అభిప్రాయం. ఆయన్ను భౌతికంగా లేకుండా చేయవచ్చు గానీ అణగారిన వర్గాల హక్కులకు, అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని చెరిపేయలేరు. మరుగుపరచలేరు. ఆయనకు ఇదే నా నివాళి.
(గోవింద్ పన్సారే హత్యకు నిరసనగా నేటి ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో సంతాపసభ జరుగనుంది)
ఎ.అమరయ్య మొబైల్ : 9912199494