Govind Pansare
-
గౌరీ హంతకుడు పరశురామ్ వాగ్మారే
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను పరశురామ్ వాగ్మారే అనే దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల్లో వాగ్మారే ఒకడన్నారు. హేతువాదులు గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గీల హత్యకు వాడిన తుపాకీనే లంకేశ్‌ను చంపేందుకు దుండగులు వినియోగించారని స్పష్టం చేశారు. తుపాకీతో కాల్చినప్పుడు బుల్లెట్ వెనుకభాగంలో ఏర్పడ్డ ఒకేరకమైన గుర్తుల ఆధారంగా దీన్ని నిర్ధారించామన్నారు. ఈ హత్యలకు వాడిన తుపాకీని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. లంకేశ్ హత్యకు నిందితులు ఆరు నెలల నుంచి ఏడాది పాటు పథకం రచించారన్నారు. కన్నడ రచయిత కేఎస్ భగవాన్, ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్‌ల హత్యకూ ఈ గ్యాంగ్ రెక్కీ పూర్తి చేసిందనీ, ఇంతలోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. లంకేశ్, కల్బుర్గీ, పన్సారేల హత్య వెనుక అతిపెద్ద గ్యాంగ్ ఉందనీ, దాదాపు 60 మందితో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించిఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్‌చేసిన ప్రవీణ్ అలియాస్ సుజిత్ కుమార్ హిందూ జాగృతి సమితి, సనాతన సంస్థ వంటి అతివాద హిందుత్వ సంస్థల నుంచి ఈ గ్యాంగ్ సభ్యుల్ని ఎంపిక చేశాడన్నారు. ప్రవీణ్ ఏర్పాటుచేసిన గ్యాంగ్‌కు ఎలాంటి పేరు పెట్టలేదన్నారు. కర్నాడ్‌తో పాటు హిందుత్వ ఎజెండాను వ్యతిరేకిస్తున్న రచయిత బి.టి.లలిత నాయక్, హేతువాది సి.డి.ద్వారకనాథ్, నిడుమామిడి మఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామీజీని హతమార్చేందుకు వీరు తయారుచేసిన హిట్‌లిస్ట్ పోలీసుల తనిఖీల్లో లభ్యమైందన్నారు. బెంగళూరులోని స్వగృహంలో లంకేశ్‌ను గతేడాది సెప్టెంబర్ 5న దుండుగులు తుపాకీతో కాల్చిచంపారు. -
ఒకే తరహాలో ముగ్గురి హత్య..
సాక్షి, బనశంకరి: సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, మానవ హక్కుల పోరాటయోధుడు గోవింద్పన్సారే హత్యకు వినియోగించిన రివాల్వర్‌నే గౌరీలంకేశ్ హత్యకు వినియోగించినట్లు ల్యాబొరేటరీ పరిశోధనల్లో రుజువైంది. కలుబురిగి, పన్సారే హత్యకు స్వదేశంలో తయారైన 7.65 ఎంఎం.రివాల్వర్ ద్వారా కాల్పులు జరిపి హత్యకు పాల్పడ్డారు. బెంగళూరు రాజరాజేశ్వరినగరలో తన ఇంటి వద్ద గౌరీని కూడా అదే రివాల్వర్‌కు బలయ్యారు. ముగ్గురు ఒకే తరహాలో హత్యకు గురికావడంతో హంతకులు ఒకే సంస్థకు చెందిన వారు కావొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న రాజరాజేశ్వరి నగరలో గౌరి హత్యకు గురయ్యారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బుల్లెట్లను హైదరాబాద్, బెంగళూరుల్లోని ల్యాబ్‌కు పంపించారు. నివేదికలో గతంలో సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, గోవింద్పన్సారేపై కాల్పులు జరిపిన రివాల్వర్తోనే గౌరిపై కూడా కాల్పులు జరిపినట్లు పరిశోధనలో తేలింది. -
సమీర్ గైక్వాడ్‌కు బెయిల్ నిరాకరణ
ముంబై: హేతువాది, కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యకేసులో అరెస్టయిన సనాతన్ సంస్థ సభ్యుడు సమీర్ గైక్వాడ్ బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేరంతో అతని ప్రమేయానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఆధారం ఉందని పేర్కొంది. పన్సారేను చంపినట్టు గైక్వాడ్ ఓ మహిళకు ఫోన్లో చెప్పినట్లుగా ఉన్న ఆడియో సంభాషణను కోర్టు ప్రస్తావించింది. ‘గైక్వాడ్‌కు పన్సారేతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. అయితే సైద్ధాంతిక విభేదాలున్నాయి. అందుకే ఆయన హత్యకు గురయ్యారు’ అని స్టసిస్ సీవీ భదాంగ్ పేర్కొన్నారు. పథకం ప్రకారం హత్య జరిగిందని పోలీసులు సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గత ఏడాది ఫిబ్రవరిలో కొల్హాపూర్‌లో మార్నింగ్ వాక్కు వెళ్లిన పన్సారే దంపతులను దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. -
'సనాతన్ సంస్థ' సభ్యుడే సూత్రధారి!
కొల్హాపూర్/ న్యూఢిల్లీ: హేతువాది గోవింద్ పన్సారే హత్యకు 'సనాతన్ సంస్థ' సభ్యుడు రుద్ర పాటిల్ సూత్రధారి అని దర్యాప్తు సంస్థ సిట్ భావిస్తోంది. అతనితోపాటు మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పన్సారే హత్యకు గురయ్యారు. గతవారం సనాతన్ సంస్థ సభ్యుడు గైక్వాడ్‌ను సిట్ అరెస్టు చేసింది. ముంబైకి చెందిన ఒకరిని, కర్ణాటకకు చెందిన మరో ఇద్దరిని ప్రశ్నించింది. గైక్వాడ్, ఇతరులు వెల్లడించిన వివరాల ఆధారంగా రుద్ర పాటిల్, సారంగ్ అకోల్కర్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు వెల్లడైందని పోలీసు అధికారి వెల్లడించారు. -
వాస్తవికవాది, కమ్యూనిస్టు యోధుడు పన్సారే..
మురికితనం, కరుకుతనం ఆ సుకుమార హృదయాన్ని నిలువెల్లా గాయం చేస్తే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకు వెళ్లిపోయాడు గోవింద్ పన్సారే. అనేకానేక అస్థిత్వ ఉద్యమాలకు, అణగారిన వర్గాల పోరాటాలకు నెలవైన మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో జరిగిన రెండో హత్య ఇది. హేతువాద ఉద్యమకారుడైన డాక్టర్ నరేంద్ర దబోల్కర్‌ను 2013 ఆగస్టులో పన్సారే మాదిరే మితవాద మతతత్వ శక్తులు పొట్టనబెట్టుకున్నాయి. నిందితుల్ని వదలబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దుండగుల ఆచూకీ చెప్పిన వారికి 5 లక్షలు ఇస్తామని, నిందితుల వేట కొనసాగుతోందని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. గత అనుభవాల దృష్ట్యా పోలీసు మాటల్ని విశ్వసించలేమని వామపక్షాలు కుండబద్దలు కొట్టాయి. ఈ నెల 16న 82 ఏళ్ల పన్సారే, ఆయన భార్య ఉమ కొల్హాపూర్‌లోని తమ ఇంటికి సమీపంలో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండ గులు కాల్పులు జరిపి పారిపోయారు. తూటా దెబ్బలకు గిలగిల్లాడిన ఆ దంపతులకు కొల్హాపూర్ ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పన్సారేను ముంబాయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి హెలికాఫ్టర్‌లో తరలించారు. ఆయన అప్పటికే చనిపోయారు. కమ్యూ నిస్టులు, ప్రగతిశీలురు తల్లడిల్లారు. కార్మిక లోకం భగ్గుమంది. సామా జిక ఉద్యమకారులు దిగ్భ్రాంతి చెందారు. 1933 నవంబర్ 26న అహ్మద్‌నగర్ జిల్లా కొల్హాపూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. ఐదుగురి సంతానంలో చివరివాడైన పన్సారేకు చిన్నతనంలోనే కష్టాలు ఎదుర య్యాయి, వారసత్వంగా వచ్చిన ఐదెకరాల ఆస్తిని వడ్డీ వ్యాపారులు లాగేసుకోవడంతో ప్రాథమిక విద్యకు సైతం ఇబ్బందిపడ్డారు. చదువు ఖర్చు కోసం ఇంటింటికీ తిరిగి న్యూస్‌పేపర్లు వేశారు. కొల్హాపూర్ మున్సిపల్ స్కూల్లో ప్యూన్‌గా పని చేశారు. బీఏ పూర్తయిన తర్వాత మున్సిపల్ స్కూలు టీచర్‌గా చేశారు. ప్రజా సమస్యలకు న్యాయ చట్రంలోనే పరిష్కారం కనుక్కోవాలన్న కాంక్షతో లాయర్ పట్టాపుచ్చుకుని కొల్హాపూర్ కోర్టులో ప్రాక్టీసు మొదలు పెట్టారు. 1964లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. తాను డబ్బు జబ్బుకు ఎన్నడూ గురికాలేదు. బడుగు, బలహీనవర్గాల సంక్షే మం, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ మరువలేదు. కమ్యూనిస్టు పార్టీ చీలికకు కొద్ది ముందు సీపీఐలో చేరిన పన్సారే తుది శ్వాస విడిచే వరకు అందులోనే కొనసాగారు. పార్టీలో పిడివాదులకు వ్యతిరేకంగా తన అభి ప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేవారు. అది మరాఠా భాషా ఉద్య మమైనా, గోవా స్వాతంత్య్ర పోరాటమైనా, మరాఠా రాజు ఛత్రపతి శివాజీని కొందరు స్వంతం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు వ్యతిరేక ఉద్యమాన్ని నడిపినా, జాతీయ రహదారులపై టోల్గేట్ వసూళ్ల వ్యతిరేక ఆందోళనైనా... అంతే చిత్తశుద్ధితో అంకిత భావంతో నడిపారు. పట్టుదల, దూరదృష్ట్టికి మారుపేరు. మంచి కార్మిక నాయ కుడు, వక్త, రచయిత. 21కి పైగా పుస్తకాలు రచించారు. అందులో ఖ్యాతి గాంచిందీ, వివిధ భాషల్లోకి అనువాదమైందీ, లక్షన్నర ప్రతులు అమ్ముడైందీ- ‘శివాజీ ఎవరు?’ అనే పుస్తకం. ఛత్రపతి శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదని తేల్చిచెప్పిన పుస్తకం అది. పదేళ్ల కిందట లాయరైన తన ఏకైక కుమారుడు 35 వయస్సులో చనిపోయినప్పుడు మూడోనాడే రోడ్డెక్కి కార్మికుల ఆందోళనలో పాల్గొన్న ధీశాలి. ఇటీవలి కాలంలో ఆయన చేపట్టిన టోల్‌ట్యాక్స్ వ్యతిరేక ఉద్యమం స్వల్పకాలంలోనే రాష్ట్రమంతటా వ్యాపించింది. ఆయన లెక్కలో టోల్‌ట్యాక్స్ అనేది అన్యాయం, అక్రమమే కాక రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురి పించే పెద్ద వనరు. అందుకే ఆయన ఓ పక్క ప్రజా పోరాటాన్ని నడుపు తూనే మరోపక్క న్యాయ పోరాటాన్ని చేపట్టారు. ఇదే సమయంలో ఆయన.. గాంధీని హత్య చేసిన గాడ్సేని కీర్తిస్తున్న వారినీ వదిలి పెట్టలేదు. ఇది సైతం కొన్ని శక్తులకు కంటగింపుగా మారింది. బహుశా ఈ శక్తులే పన్సారేను పొట్టనబెట్టుకున్నాయన్నది ప్రజల అభిప్రాయం. ఆయన్ను భౌతికంగా లేకుండా చేయవచ్చు గానీ అణగారిన వర్గాల హక్కులకు, అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని చెరిపేయలేరు. మరుగుపరచలేరు. ఆయనకు ఇదే నా నివాళి. (గోవింద్ పన్సారే హత్యకు నిరసనగా నేటి ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్లో సంతాపసభ జరుగనుంది) ఎ.అమరయ్య మొబైల్ : 9912199494 -
కామ్రేడ్ పాన్‌సరేకు లాల్‌సలాం!
వేలాది మంది అశ్రునయనాల మధ్య కమ్యూనిస్టు నేతకు అంతిమ వీడ్కోలు సాక్షి, ముంబై/కొల్హాపూర్: ప్రముఖ హేతువాది, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, టోల్ పన్ను వ్యతిరేక ఉద్యమకారుడు గోవింద్ పాన్‌సరేకు వేలాది మంది తమ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 16న కొల్హాపూర్‌లో దుండగుల కాల్పులకు గురైన పాన్సరే శుక్రవారం అర్థరాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. మెరుగైన చికిత్స కోసం 82 ఏళ్ల పాన్సరేను కొల్హాపూర్ నుంచి శుక్రవారం ఉదయం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం అధికం కావడంతో మరణించారని జేజే గ్రూప్ ఆస్పత్రుల డీన్ టీపీ లహానే ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం మధ్యాహ్నం తిరిగి కొల్హాపూర్ తీసుకొచ్చారు. పాన్సరే హత్యను అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. నిస్వార్థపరుడైన పాన్సరేను హత్య చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పేర్కొన్నారు. ఈ నేరానికి పాల్పడిన దుండగులను శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు ఆయన మంత్రివర్గ సహచరులు, బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, ఆర్పీఐ పార్టీల నేతలు ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. పాన్సరే హత్యకు నిరసనగా, ఆయన హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు సీపీఐ సమా అన్ని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐ, ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని బీఆర్పీబీఎం పార్టీలు మద్దతు పలికాయి. ఓ ప్రగతిశీల నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందని, పేదలకు న్యాయం చేకూర్చేందుకు ఆయన చేసిన పోరాటాన్ని రాష్ట్రం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొన్నారు. పాన్సరే హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. ఎర్ర సముద్రాన్ని తలపించిన కొల్హాపూర్ కామ్రేడ్ పాన్‌సరేకు లాల్ సలాం అన్న నినాదాలతో కొల్హాపూర్ శనివారం హోరెత్తిపోయింది. పాన్సరే అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది ప్రజలతో కొల్హాపూర్ పట్టణం ఎర్రసముద్రాన్ని తలపించింది.పంచగంగ నదీ తీరంలో పాన్సరే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కమ్యునిస్ట్ నాయకులు, కార్యకర్తలతో ఆ పరిసరాలు ఎరుపెక్కాయి. ‘రెడ్ సెల్యూట్ టూ పాన్సరే’, ‘లాల్ సలాం - పాన్సరే అమర్హ్రే’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దసరా చౌక్‌లో అంతిమ దర్శనం కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. వేలాది మంది ఆయనను చివరిసారిగా చూసి నివాళులు అర్పించారు. సాయంత్రం మూడు గంటల తర్వాత పంచగంగ నదీతీరం వైపు అంతిమయాత్రను ప్రారంభించారు. నదీ తీరంలో పాన్సరే భౌతికకాయనికి ఆయన కోడలు మనమళ్ల చేతులమీదుగా దహన సంస్కారం పూర్తిచేశారు. విమానాశ్రయంలోనే ఒక గంటపాటు భౌతికకాయం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోవింద్ పాన్సరే భౌతికకాయం ఒక గంటపాటు విమానాశ్రయంలో ఉండిపోయింది. పాన్సరే మరణానంతరం శనివారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకగంట ఆలస్యంగా కొల్హాపూర్‌కు బయలుదేరాల్సి వచ్చిందని శాసన మండలి సభ్యుడు కపిల్ పాటిల్ ఆరోపించారు. ఒక్క అధికారి కూడా ఎయిర్పోర్ట్ వద్దకి రాలేదన్నారు. ఉదయం 10.20 గంటలకు తాము పాన్సరే భౌతిక కాయాన్ని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చామని, కానీ 11..54 గంటలకు కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానం బయల్దేరిందని చెప్పారు. దీంతో తాము 12.55 గంటలకు కొల్హాపూర్ చేరుకున్నామన్నారు. కాల్పులు జరిపింది మరాఠీ భాషీయులే సాక్షి, ముంబై: గోవింద్ పాన్సరే దంపతులపై కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని భావిస్తున్నారు. గోవింద్ పాన్సరే సతీమణీ ఉమా పాన్సరే పోలీసులకు అందించిన వివరాల మేరకు కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని వెల్లడైంది. కోల్హపూర్‌లో చికిత్స పొందుతున్న ఆమె దర్యాప్తు అధికారితో మాట్లాడారు. ఈ నెల 16న తామిద్దరం వాహ్యాళికి వెళ్లిన ప్పుడు తమకు ఎదురైన దుండగులు ‘మోరే యెతే కుటే రహతాత్..? (మోరే ఎక్కడ ఉంటారు..?)’ అని ప్రశ్నించారు. అనంతరం సుమారు 15 నుంచి 17 నిమిషాలకు తాము ఇంటివైపు వెళ్లే సమయంలో మళ్లీ వారిద్దరు మోటర్‌సైకిల్ వచ్చి కాల్పులు జరిపారు’ అని ఆమె పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దుండగులు ముందుగా తన భర్త గోవింద్ పై కాల్పులు జరిపారని, ఆయనకు అడ్డుగా వెళ్లిన తనపై కూడా కాల్పులు జరిపారని చెప్పారు. -
గోవింద్ పన్సారే కన్నుమూత
ముంబై : దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే శుక్రవారం కన్నుమూశారు. మహారాష్ట్రలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గోవింద్ పన్సారే దంపతులు సోమవారం కోల్హాపూర్ లో మార్నింగ్ వాక్ కు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. పన్సారే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. -
'రాష్ట్రంలో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు'
ముంబై: మహారాష్ట్రలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించాయని శివసేన ఆరోపించింది. సీపీఐ పార్టీ సీనియర్ నేత గోవింద్ పన్సారేపై కాల్పుల ఘటనను ఆ శివసేన ఖండించింది. పట్టపగలు చోటు చేసుకున్న ఈ ఘటనకు ఎవరు బాధ్యలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో నేరగాళ్లు, ఖూనీ కోరులు బోర విడిచి తిరుగుతున్నారని ఆరోపించింది. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని విమర్శించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖుడు నరేంద్ర దబోల్కర్ దారుణ హత్యకు గురయ్యారని గుర్తు చేసింది. నాటికి నేటికి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ మాత్రం మారలేదని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ హితానికి చేస్తున్న కృషిని శివసేన ఈ సందర్భంగా అభినందనీయమని శివసేన పేర్కొంది. మంగళవారం శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ మేరకు పేర్కొంది. మహారాష్ర్టలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే దంపతులపై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మోటార్ సైకిల్ వచ్చిన దుండగులు ఆయన నివాసం సమీపంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. శివాజీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా ఆగంతుకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు.అయితే పన్సారే చత్రపతి శివాజీపై ఓ బుక్‌లెట్‌ను ప్రచురించారు. అది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.