పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ నేటి(గురువారం) ఉదయం కలకత్తాలో కన్నుమూశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.
బుద్ధదేవ్ భట్టాచార్య 1944, మార్చి 9న జన్మించారు. 2000లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన ఆయన 2011 వరకు సీఎంగా కొనసాగారు. జాదవ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. వరుసగా 24 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన తన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనీష్ గుప్తా చేతిలో ఓడిపోయారు. సీనియర్ సీపీఐ(ఎం) నేత బుద్ధదేవ్ భట్టాచార్య జ్యోతిబసు క్యాబినెట్‌లో దాదాపు 18 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. హోం మంత్రిత్వ శాఖతో సహా అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.
1977లో తొలిసారిగా కోసిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1982 ఎన్నికల్లో భట్టాచార్య ఓడిపోయినా పార్టీలో ఆయన స్థాయి పెరిగింది. 1987లో జాదవ్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీని తర్వాత అతను జాదవ్‌పూర్ నుండి ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు.
జ్యోతిబసు హయాంలో డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జ్యోతిబసు వారసునిగా నిలిచారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా బంగ్లా కొనేందుకు నిరాకరించారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగి 18 ఏళ్లు మంత్రిగా, 11 ఏళ్లు సీఎంగా ఉన్నా ఆయనకు సొంత బంగ్లా, కారు లేదు. ఆయన తన జీతాన్ని కూడా పార్టీ ఫండ్‌కి అందజేసేవారు. బుద్ధదేవ్ భట్టాచార్య మంత్రిగా, సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబసభ్యులు ప్రజారవాణాలో మాత్రమే ప్రయాణించేవారు.
Comments
Please login to add a commentAdd a comment