రాజకీయ లబ్ధి కోసమే ‘తెలంగాణ’: బుద్ధదేవ్ భట్టాచార్య
కోల్‌కతా: స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలత ప్రకటించిందని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తాము తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ‘తెలంగాణపై కాంగ్రెస్ ఇవాళ పార్లమెంటులో సైతం తీవ్ర వ్యతిరేకత చవి చూసింది.
దీనంతటికీ అంత అవసరమేమొచ్చిందన్నదే మా ప్రశ్న’ అని అన్నారు. తెలంగాణ కారణంగా డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోనూ గూర్ఖాలాండ్ ఉద్యమం మళ్లీ భగ్గుమంటోందని, తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సూత్రాన్నే పాటించామని, కాంగ్రెస్ అందుకు భిన్నంగా కొత్తగా రాష్ట్రాలను విభజిస్తోందని విమర్శించారు. పార్లమెంటులో ‘తెలంగాణ’ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా విభజన ఉద్యమాలు జోరందుకుంటాయన్నారు. డార్జిలింగ్ ప్రస్తుత పరిస్థితికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారు బాధ్యత వహించాలన్నారు. కాగా, అవినీతిపరులకు, పెత్తందార్లకు తమ పార్టీలో ఎలాంటి చోటు లేదని బుద్ధదేవ్ అన్నారు.