'ముందు వాళ్లింట్లో బ్లాక్ మనీ వెతుక్కోవాలి'
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై సీపీఎం నిప్పులు చెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయినప్పటి నుంచి తొలిసారి బహిరంగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై మాజీ ముఖ్యమంత్రి, సీపీఏం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనంపై మాట్లాడే నైతిక హక్కు అసలు టీఎంసీకి లేదని అన్నారు. ఆ పార్టీ మొత్తం సామాజిక వ్యతిరేక శక్తులతో నిండి ఉందని, వారిలో ఒకరే నేడు అరెస్టయ్యారని ఆయన టీఎంసీ నేత సుదీప్ అరెస్టుపై వ్యాఖ్యానించారు.
'టీఎంసీ టాప్ టూ బాటమ్ అవినీతే. మమతా ప్రభుత్వం నిండా సామాజిక వ్యతిరేక శక్తులే ఉన్నారు. వారిలో ఒకరు నేడు అరెస్టయ్యారు. అందుకే ఆ పార్టీకి నల్లధనం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నల్లడబ్బు ఎక్కడో ఉందని చెప్పడం మానేసి ఆ పార్టీ నేతలు వాళ్లింట్లో ఉన్న నల్లడబ్బును వెతుక్కుంటే మంచిది. ఇద్దరు ఎంపీలను అరెస్టు చేసినంత మాత్రానా బెనర్జీ అంతగా అరవాల్సిన పనిలేదు. వారంతా కుంభకోణాల్లో ఉన్నవారని అందరికీ తెలుసు. సీబీఐ కూడా చిన్నవారిని వదిలేసి పెద్దవారిని అరెస్టు చేయాల్సింది' అంటూ పరోక్షంగా మమతనుద్దేశించి భట్టాచార్య వ్యాఖ్యానించారు.