‘పార్లమెంటు’ను సాగనివ్వండి
అఖిలపక్ష భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: అభిప్రాయ భేదాలెన్ని ఉన్నప్పటికీ పార్లమెంటు సమావేశాలను జరగనివ్వాలని.. ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా విపక్షాలు చేపట్టిన ఆందోళనల వల్ల శీతాకాల పార్లమెంటు సమావేశాలు వృథా అయిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలను ఫలప్రదం చేసేందుకు ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ మినహా అన్ని ప్రధాన పార్టీలు హాజరైన ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని కోరారు. చిట్‌ఫండ్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో తమ ఎంపీలను అరెస్టు చేసినందుకు, నోట్ల రద్దుకు నిరసనగా తృణమూల్ ఈ సమావేశానికి గైర్హాజరైంది.
నోట్ల రద్దుకు నిరసనగా బడ్జెట్ సమావేశాల్లో మొదటి రెండు రోజులు తాము గైర్హాజరు కానున్నట్లు లోక్‌సభలో తృణమూల్ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీ చెప్పారు. సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాని కోరారని ఆయన తెలిపారు. దీనికి అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిపై ప్రభావం చూపేందుకే ముందస్తుగా బడ్జెట్ సమావేశాలు పెట్టారన్న విపక్షాల ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. దీనిపై సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం ఇప్పటికే తీర్పునిచ్చాయని అన్నారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా, దేశం అభివృద్ధి చెందేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ముందస్తు సమావేశాలు సరికాదు: ఆజాద్
సమావేశానికి ముందు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలు ముందుకు జరపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి 2012లో తలెత్తినపుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున యూపీఏ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసిందని గుర్తుచేశారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రా లకు సంబంధించి బడ్జెట్‌లో వరాలు ప్రకటిం చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రెండో దశ బడ్జెట్ సమావేశాలకు ముందు కూడా మరో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
నోట్ల రద్దుపై చర్చ సాగాలి: ఏచూరి
పెద్దనోట్ల రద్దుపై తొలి దశ బడ్జెట్ సమావేశాల్లోనే రెండు రోజులపాటు చర్చ సాగించాలని ప్రభుత్వాన్ని తాము కోరినట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ పెట్టడం అశాస్త్రీయమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సమావేశాల్లోనే పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.