‘వెనకబడిన ఐటీ రంగం.. కుదేలైన ఉపాధి’
హైదరాబాద్: మూడేళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పాలనలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధికల్పన కూడా మరుగున పడిందని, ఐటీ రంగం వెనకబడిందని తెలిపారు. గోసంరక్షకుల సంఘాలను నిషేధించాలని డిమాండ్ చేశాయి. గోసంరక్షణ సంఘాల పేరుతో ప్రైవేటు సైన్యాలు జరుపుతున్న అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు.
సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత సరిహద్దుల వెలుపల సైనికుల మరణాలు పెరిగాయని, అంతర్గతంగా మావోయిస్టుల సమస్య కూడా పెరిగిందన్నారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా బీజేపీ అనుసరిస్తున్న విధానం విఫలమైందన్నారు. కులాలు, మతాల మధ్య ఉద్రిక్తతలు పెంచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందుతున్నారని ఘాటుగా విమర్శించారు.
లౌకికశక్తులతో కలిసి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీలు, సంఘాలతో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని సీపీఎం నిర్ణయించిందని తెలిపారు. కుంభకోణాల్లో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందేని.. చిదంబరం, లాలూపై కేసుల విషయంలో చూస్తే రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్నట్టు కనిపిస్తోందన్నారు. దేశంలో ముస్లింలను మినహాయిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా ప్రచారం చేయడం శోచనీయమని సీతారాం ఏచూరి అన్నారు.