ప్రధాని అవుతానన్నవారంతా ఓడిపోయారు: ఏచూరి
హైదరాబాద్: కాబోయే ప్రధానిని తానేనని ప్రచారం చేసుకున్న వారంతా ఎన్నికల్లో ఓడిపోయారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమన్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన ఏచూరి.. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ‘‘1977లో ఇందిరాగాంధీ ఎన్నికలకు ముందే తానే కాబోయే ప్రధానినంటూ గంభీరాలు పలికితే, ఫలితాల్లో పరాభవం తప్పలేదు. 2004లో భారత్ వెలిగిపోతుందంటూ ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమి పరిస్థితి కూడా అంతే.
2004లో ఎన్డీయేకు 370 స్థానాలు వస్తాయంటూ మీడియా కోడై కూసినా ప్రజల తీర్పు అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చింది. ఇప్పుడు కూడా తానే కాబోయే ప్రధాని అంటూ కార్పొరేట్ మీడియా చేత ప్రచారం చేయించుకుంటున్న నరేంద్రమోడీకి అదే భంగపాటు తప్పదు’’ అని పేర్కొన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కాబోయే ప్రధాని ఎవరనేది ముందే చెప్పలేమన్నారు. దేశంలో మోడీ హవా లేదని, అదంతా కేవలం కార్పొరేట్ మీడియా సృష్టించిన కల్పితమని ఏచూరి వ్యాఖ్యానించారు. ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు తేడా లేదన్నారు.
రాష్ట్రంలో టీడీపీ కనుమరుగే: రాఘవులు
రాబోయే కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. టీడీపీ-బీజేపీ జోడీ చారిత్రక అపచారమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో చక్రం తిప్పానంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఇక కేంద్రంలో చెంచాగిరి చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.