మోదీ పాలన వైఫల్యాలమయం: ఏచూరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. అన్నిరంగాల్లో దేశం దిగజారిందని, మోదీ పాలనంతా వైఫల్యాలమయమని దుయ్యబట్టారు. ధనిక వర్గానికి భారీగా లాభాలు పెరిగే చర్యలు తీసుకోవడం, పేదలకు ఉపాధి అవకాశాలు తగ్గి, భారాలు ఎక్కువై దారిద్య్రం పెరగడం ద్వారా ధనిక, పేద భారత్‌లుగా దేశ విభజన స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీ ఆచరణకు నోచుకోలేదన్నారు.
గురువారం ఇక్కడ ఎంబీ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వలెక్కల ప్రకారమే దేశంలో 12 వేలమంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలకు వ్యతిరేకం గా ప్రజాస్వామ్యశక్తులు, వామపక్షాలు, సామాజిక సంఘాలు కలసి ప్రజా ఉద్య మాల నిర్మాణానికి కృషి చేయాలని సీపీఎం నిర్ణయించిందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలపా లనే విషయంలో బీజేపీ ప్రభుత్వం స్పష్టతనివ్వకపోగా ప్రతిపక్షాలతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టలేదన్నారు. సీపీఐ, సీపీఎం ఏకీకరణ ప్రస్తుత ఎజెండాలో లేదన్నారు.
సామాజిక న్యాయం పార్టీలో అమలుకావడం లేదని ఒక విలేకరి ప్రశ్నించగా ‘నా గోత్రాన్ని తీసుకుని పనిచేస్తారా లేక నేను ఆచరణలో పాటిస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా’ అని ఏచూరి ఎదురు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వివిధపార్టీలు, సామాజిక తరగతు లతో ఐక్య ఉద్యమం చేపట్టాలని సీపీఎం నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సినీనటుడు పవన్ కల్యాణ్‌ను స్నేహపూర్వకంగానే కలి సినా, రాజకీయ పరిస్థితులు, పరిణామాల పైనా చర్చించామన్నారు. జనసేన విధా నాలు వెల్లడయ్యాక మళ్లీ చర్చించి వైఖరిని నిర్ణయిస్తామని చెప్పారు.