ఆరెస్సెస్ పుట్టిల్లు నాగపూర్ నుంచి నేరుగా ఇక్కడికే
హైదరాబాద్: జైభీమ్ లాల్ సలామ్ అని చెప్పటానికే తాను ఇక్కడికి వచ్చానని, ఆరెస్సెస్ పుట్టిల్లు నాగపూర్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చానని సీపీఎం ప్రదాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆదివారం సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సారథ్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర 154 రోజుల పాటు 4200 కిలో మీటర్లు సాగింది.
మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో సీతారాం ఏచూరితో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమ్మినేని వీరభద్రం, ప్రజాగాయకుడు గద్దర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, మాజీ సీఎస్ కాకి మాధవ రావు, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొ.హారగోపాల్, కంచె ఐలయ్య, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విమలక్క తదితరులు పాల్గొన్నారు.
సభలో ఏచూరి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అనే స్లోగన్ మీదనే ఇక వామపక్షాల ప్రజా ఉద్యమాలు ఉంటాయని తెలిపారు. ముస్లింలను, దళితులని వ్యతిరేకించే వ్యక్తి యోగి ఆదిత్యనాధ్.. అలాంటి వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా నియమించారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్లానింగ్ కమిటీని రద్దు చేయటం వల్ల ఎంతో నష్టం జరిగిందన్నారు. ఆరెస్సెస్ గోరక్షక దళాలు దళితులపై వ్యతిరేకంగా మారి దాడులకు దిగుతున్నారని అన్నారు. సామాజిక న్యాయానికి సీపీఎం కట్టుబడి ఉన్నదని తెలిపారు. మోదీ మీద ఒత్తిడి పెంచి.. ప్రజా ఉద్యమాన్ని బలపరుస్తామని తెలిపారు. కేసీఆర్‌కి హెచ్చరిక చేస్తున్నా.. ప్రజా సమస్యలను పరిష్కరించండి.. లేదంటే పునరేకీకరిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి చిక్కిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలే మన ఆయుధాలన్నారు. హామీలు నెరవేర్చకుండా కాలయాపన, అబద్ధాలాడుతున్న కేసీఆర్ తల ఎన్ని సార్లు నరుక్కోవాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రా లేక యావత్ తెలంగాణాకా? అని సూటిగా అడిగారు. అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు ఒక గొంతుకలా మారాలని కోరారు. కేసీఆర్ ఎంత అక్కసు వెళ్ల గక్కినా పాదయాత్ర విజయవంతం అయ్యిందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేలకు ముక్కు రాసి పాదయాత్ర చేయాలని ముఖ్యమంత్రి హేళన చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ నీకిదే సవాల్ ఇప్పుడు ఎవరు ముక్కు నేలకు రాయాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమనేతలు ప్రొ.జయశంకర్, ప్రొ. కోదండరామ్‌లను మరచిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మరచిపోవడం వింతేమీకాదని అద్దంకి దయాకర్ విమర్శించారు. కుటుంబ పాలనపై సమాజిక యుద్ధం ఇక్కడి నుంచి మొదలైందని అన్నారు.