ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రాష్ట్రపతిగానా?
- రామ్‌నాథ్ మత సంస్థలో ప్రముఖ నాయకుడన్న సీపీఎం
- ఇది రాజకీయ సంఘర్షణ.. పోటీపై 22న నిర్ణయం: ఏచూరి
- మద్దతు ఇవ్వబోమని తేల్చిన సీపీఐ
న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కొక్కటిగా గళం విప్పుతున్నాయి. మద్దతుపై ఇప్పుడే చెప్పబోమని కాంగ్రెస్ ప్రకటించిన కొద్ది సేపటికే, మరో ప్రధాన ప్రతిపక్షం సీపీఎం.. కోవింద్‌ను మతసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తిగా అభిర్ణించింది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమనే సంకేతాలు ఇచ్చారు.
‘రామ్‌నాథ్.. ఆర్ఎస్‌ఎస్ దళిత శాఖకు చెందిన నేతగా ప్రసిద్ధి. అలాంటాయనను ‘రాజకీయేతరుడి’గా భావించలేం. అయినా ఇది(రాష్ట్రపతి ఎన్నిక) పూర్తిగా రాజకీయ సంఘర్షణే. కాబట్టి పోటీ తప్పకపోవచ్చు. మన దేశంలో ఒకేఒక్కసారి తప్ప అన్నిసార్లూ రాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు జరిగాయి. జూన్ 22న విపక్ష పార్టీల సమావేశం జరగనుంది. రామ్‌నాథ్ కోవింద్‌పై పోటీ అభ్యర్థిని నిలపాలా లేదా అనేదానిపై ఆ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది’ అని సీతారాం ఏచూరి అన్నారు.
సీపీఐ సైతం వ్యతిరేకమే
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌పై సీపీఐ సైతం వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తికి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.