సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకు మతోన్మాదం పెరిగి పోతుందని, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలలో పాల్గొన్న సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకి ఉపాధి అవకాశాలు దొరకడం లేదన్నారు. లక్షల కోట్లను కార్పొరేట్లకు దోచిపెడుతూ.. దళితులు, ముస్లింలను టార్గెట్ చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశ ఐక్యతకు ఇది పెద్ద దెబ్బ అన్నారు. మతోన్మాద శక్తులను అరికట్టి, వాటిని అడ్డుకునే శక్తి వామపక్షాలకే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ విధానాలు తెచ్చే సత్తా వామపక్ష పార్టీలకు ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాలకు 22వ జాతీయ మహాసభలు దిశా నిర్దేశం చేస్తాయని సీతారాం ఏచూరి వివరించారు.
దేశంలో 73 శాతం సంపద కేవలం ఒక శాతం కుటుంబాల చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. దేశంలో మేధావులు, ప్రొఫెసర్‌లు, జర్నలిస్ట్‌లు సహా సామాన్యులు హత్యకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు నేడు నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొన్న సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆరెస్సెస్, బీజేపీలు.. రాజ్‌భవన్‌లని అధికార కేంద్రాలుగా వాడుకుంటుందని, గోవా, మణిపూర్‌లలో ఇదే నిరూపన అయిందన్నారు. ప్రస్తుత సమయంలో వామపక్ష పార్టీల ఐక్యత ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, కార్యకర్తల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి పోరాటాలకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ప్రారంభం కాగా.. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకోనున్నారు. ఈ నెల 22 సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment