మీడియాతో మాట్లాడుతున్న సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు
అనంతపురం న్యూసిటీ: కేంద్రంలో నాలుగేళ్ల పాలనలో ఆర్థిక, సాంఘిక తదితర అన్ని రంగాల్లో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. సోమవారం అనంతపురంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దించడానికే వచ్చే ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పి కూడా అమలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా తామే ప్రభుత్వం నడపాలని బీజేపీ యత్నిస్తోందని, అందుకు గోవా, మణిపూర్ ఎన్నికల్లే నిదర్శనమన్నారు.
ఈ అనైతిక విధానాన్ని తిప్పికొట్టేందుకు కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీయేతర పార్టీలు ఒకే వేదికపై కలిశాయన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎన్నడూలేని విధంగా దెబ్బతిన్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపాయన్నారు. నల్లధనం విదేశాల్లో నుంచి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్న ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారన్నారు.
ఇటీవల స్విస్ బ్యాంకులో రూ.7 వేల కోట్ల భారతీయుల సంపద జమయ్యిందని, ఈ డబ్బు బ్యాంకుల్లో వేసుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఏవిధంగా అనుమతిచ్చిందో చెప్పాలన్నారు. నాలుగేళ్ల ఎన్‌డీఏ దుష్పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశ వ్యాప్త ప్రచారానికి సీపీఐ శ్రీకారం చుట్టనుందన్నారు. బీజేపీ ముందస్తు ఎన్నికలు చేపట్టాలని ప్రచారం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య హక్కులకు నష్టం అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment