'ఐదేళ్లలో మా పార్టీ అందులో విలీనం'
హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో సీపీఐతో సీపీఎం విలీనం అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన 1964 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఈ కారణమే విలీనానికి దారి తీస్తుందని ఆయన వెల్లడించారు. సయోధ్యతో కలిసి ఉంటేనే మనుగడ సాధించగలమని, లేకుంటే రెండింటికీ ఇబ్బందులు తప్పవన్నారు. ఒకే లక్ష్యంతో, సారూప్యతతో పోరాటాలు సాగిస్తున్న రెండు పార్టీలు వేర్వేరుగా ఉండి ఉద్యమాలు కొనసాగించటం నేడు కష్టతరంగా మారిందన్నారు.
‘మేం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రాత్రికిరాత్రే పరిస్థితి మారుతుందని చెప్పటం లేదు. కానీ, ఫలితం మాత్రం ఉండి తీరుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ నిబద్ధత వంటి విషయాల్లో రెండు పార్టీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఏకీకరణ విషయంలో మాత్రం ముఖాముఖి చర్చలు జరుగలేదన్నారు. రెండు పార్టీల్లోనూ విలీనంపై కొంత సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ సీసీఎం నాయకత్వం తమ పార్టీతో చర్చించలేదన్నారు.
అయితే, సీపీఎంయే ఏకీకరణకు ముందుకు రావటం లేదని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో రెండు పార్టీల ఉన్నత స్థాయి సమావేశాలు ఉన్న దృష్ట్యా విలీనం విషయం అప్పుడే ప్రస్తావనకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుని రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో విలీన ప్రక్రియ పూర్తి చేసుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.