
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను తయారు చేయాలని సీపీఎం చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది. గత మూడేళ్లుగా వివిధ ఆందోళన కార్యక్రమాల్లో భుజం, భుజం కలిపి పాల్గొన్న ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని సీపీఎం భావిస్తోంది. దీనికోసం వివిధ కుల సంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు వామపక్షాలు, కొన్ని ఇతర పార్టీలతోనూ చర్చించి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)కు రూపకల్పన చేసింది. ఎంసీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్పీ, బీఎస్పీ, ఎంబీటీ, లోక్‌సత్తా తదితర 28 పార్టీలు బీఎల్‌ఎఫ్‌లో చేరాయి. అయితే మరో ప్రధాన వామపక్ష పార్టీ సీపీఐ ఈ వేదికకు దూరంగా ఉంటామని, తామే లౌకిక, ప్రజాతంత్ర వామపక్ష కూటమిని తయారు చేస్తున్నామని ప్రకటించింది. దీనికి తోడు సీపీఐ ఎం–ఎల్ (న్యూ డెమొక్రసీ) సైతం బీఎల్‌ఎఫ్‌లో చేరే విషయాన్ని ఇంకా స్పష్టం చేయకపోవడంతో ఆ పార్టీ కూడా ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్టేనని భావిస్తున్నారు.
వాస్తవానికి ఈ నెల 25వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఎల్‌ఎఫ్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ అంబేడ్కర్ ఈ సభకు హాజరవుతున్నారని గురువారం ప్రకటించారు. కాగా, ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే సీపీఐ రాత్రికి రాత్రి తాము కూడా ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో బహుజన వామపక్ష కూటమికి ఆదిలోనే హంసపాదు పడినట్లు తెలుస్తోంది.
ముందు నుంచీ అంతే: ముందు నుంచీ సీపీఎం, సీపీఐ మధ్య పొసగడం లేదని, ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు ఆమోదించే పరిస్థితులు లేవని, ఈ తరుణంలో వామపక్షాల ఐక్యత సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో రెండు పార్టీలూ ఆయా ఎన్నికల్లో సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. ఖమ్మం, మధిర, భద్రాచలం, మిర్యాలగూడెం, నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం, తదితర నియోజకవర్గాలకు గతంలో సీపీఎం ప్రాతినిధ్యం వహించింది.
ప్రస్తుతం ఆ పార్టీ చేతిలో ఒక్క భద్రాచలం మాత్రమే మిగిలింది. కాగా, బెల్లంపల్లి, పరకాల, మహబూబాబాద్, మునుగోడు, దేవరకొండ, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో సీపీఐ ప్రాతినిధ్యం వహించింది. గత ఎన్నికల్లో దేవరకొండ నుంచి సీపీఐ గెలిచినా, ఆ పార్టీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం ఒక్క సీటు కూడా ఆ పార్టీ చేతిలో లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఈ రెండు పార్టీలూ ఉనికి కోసం పోరాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment