హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ఆర్టీసీ కల్యాణ మంటపంలో మంగళవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేశారు. తర్వాత సీపీఐ, సీపీఐ(ఎంఎల్,) ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, ఎస్‌యూసీఐ (సీ) నేతల సౌహార్ద సందేశాలు, కార్యదర్శి నివేదిక ఉంటాయి.
19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకుంటారు. అదే రోజు మలక్‌పేట టీవీ టవర్ నుంచి సభ జరిగే సరూర్‌నగర్ స్టేడియం దాకా 20 వేల మంది రెడ్‌షర్ట్ వలంటీర్లతో కవాతు జరుగుతుంది. సభకు జాతీయ నేతలు హాజరవుతారు. సభలు జరిగే ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు ఎర్రజెండాలు, తోరణాలు, పోస్టర్లతో ఇప్పటికే ఎరుపెక్కాయి. తెలంగాణ సంస్కృతి, సాయుధ పోరాటం తదితరాలు ప్రతిబింబించే కళారూపాలనూ ఏర్పాటు చేశారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) దీపాంకర భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ శివశంకరన్, ఆర్‌ఎస్పీ మనోజ్ భట్టాచార్య, ఎస్‌యూసీఐ(సీ) దీపక్ భట్టాచార్య, సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు, తెలుగు రాష్ట్రానికి చెందిన వామపక్షనేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయ తీర్మానంతో పాటు 25 అంశాలపై చర్చలు సాగనున్నాయి. ఈ నెల 22 సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభతో సీపీఎం జాతీయ మహాసభలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment