చంద్రబాబు రాజకీయ అవకాశవాది: సీతారాం ఏచూరి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పక్క రాజకీయ అవకాశవాదని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి అభివర్ణించారు. మంగళవారం న్యూఢిల్లీలో సాక్షి విలేకరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి మాట్లాడారు. గుజరాత్ అల్లర్లకు బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మూల కారణమని చంద్రబాబు గతంలో ఆరోపించారని చెప్పారు. నేడు అదే చంద్రబాబు మోడీని ప్రధాని చేయాలంటున్నారని విమర్శించారు.
చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. బీజేపీతో టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నేత నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరికపై ప్రశ్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. ఆ అంశంపై రాష్ట్ర పార్టీ స్పందిస్తుందని సీతారాం ఏచూరి తెలిపారు.