విజయవాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విజయవాడలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నందున బీజేపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి ఇబ్బందేనని చెప్పారు. రాష్ట్రంలోను టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. పోలవం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం పూర్తి అవుతాయనే నమ్మకం తమకు లేదన్నారు. తప్పుడు హామీలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని ఏచూరి అన్నారు.
దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని, దీనికి కారణం నోట్ల రద్దేనని ఆరోపించారు. నాలుగు అంశాల కోసం నోట్ల రద్దు చేశామని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కానీ ఏ ఒక్కటీ జరగలేదని, పైగా అవన్నీ ఎక్కువైపోయామని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ శక్తులకు ఈ మూడేళ్లలో రెండు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన సర్కారు రైతుల రుణమాఫీని గాలికి వదిలేసిందని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు దారుణంగా పడిపోయిందని, నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని విమర్శించారు.
మోదీ ప్రధానిగా కంటే మంచి ఈవెంట్ మ్యానేజర్‌గా బాగా పనికి వస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వం విధానాలకు నిరసనగా రాబోయే రోజుల్లో వామపక్షాలు ప్రజా ఉద్యమాలు ఉదృతం చేస్తాయని తెలిపారు. రైతులు సమస్యలపై అక్టోబర్‌లో ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల సమస్యల పై ఉద్యమించేందుకు మేధావుల ఫోరం ను ఏర్పాటు చేశామన్నారు.ఈ వేదిక ద్వారా మరిన్ని ఉద్యమాలు చేస్తామని ఏచూరి చెప్పారు.
విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా బీజేపీ మత కలహాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. దేశంలో రోజు రోజుకూ బీజేపీ పతనం అవుతోందని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వ మతతత్వ, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీలు మరింత బలపడనున్నాయని వివరించారు. జీఎస్టీ ద్వారా ప్రజలకు మరింత పన్ను భారం పెంచేశారని ఆరోపించారు. పెట్రో ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం రేట్లు 80 శాతం తగ్గాయి. మన దేశంలో 125 శాతం పెంచేశారని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా అధికారం తమదే అని చంద్రబాబు, మోదీ చెప్పుకోవటం హాస్యాస్పదమని ఆయన అన్నారు.