ఎమ్మెల్యేలను కొనడం దుర్మార్గం
సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి స్పష్టీకరణ
న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఏపీ సీఎం చంద్రబాబు పాల్పడుతున్న స్థాయిలో రాజకీయ అవినీతిని దేశంలో మరెక్కడా చూడలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సీపీఎం కేంద్ర కార్యాలయంలో ఏచూరిని కలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాల గురించి ఆయనకు వివరించింది. ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ అనే పుస్తకాన్ని ఆయనకు అందించింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల బృందాన్ని ఉద్దేశించి సీతారాం ఏచూరి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
‘‘వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దుర్మార్గం. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ అంశాన్ని మా పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఉత్తరాఖండ్‌లో ఫిరాయింపుల అంశాన్ని మంగళవారం పార్లమెంట్‌లో ప్రస్తావించాం. కానీ, చర్చ జరగలేదు. ఉత్తరాఖండ్ కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఏపీలో ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఏపీ అభివృద్ధి చెందాలని, ప్రసిద్ధిగాంచాలని అందరం కోరుకుంటున్నాం. కానీ, ఈ విధంగా ప్రసిద్ధిగాంచాలని అనుకోవడం లేదు. ఇది అవమానకరమైన విషయం.
ఫిరాయింపులను ఆపకపోతే దేశంలో ప్రజాస్వామ్యం మిగలదు. ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారో.. వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అలాంటప్పుడు వ్యవస్థను కాపాడటం మనవల్ల సాధ్యమయ్యే పని కాదు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణ తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ మేరకు పార్లమెంట్‌లో సీపీఎం చొరవ తీసుకుంటుంది. ఏపీలో కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులు, అనైతిక రాజకీయాల గురించి అన్ని వేదికలపై ప్రస్తావిస్తాం. వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది’’ అని సీతారం ఏచూరి పేర్కొన్నారు.