వామపక్షం వాడలో కాషాయం జాడలు..!
పశ్చిమబెంగాల్ తాజా మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని వామపక్షాలు చావుదెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదలైన కమ్యూనిస్టుల పతనం క్రమేపీ ‘ముందుకు’ సాగుతోందనడానడానికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఒక కార్పొరేషన్, ఆరు మునిసిపాలిటీల్లోని 148 వార్డుల్లో పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 140 కైవసం చేసుకుని ఏడింటినీ చేజిక్కించుకోగా, బీజేపీ ఆరు సీట్లతో ‘రెండో’ స్థానం సంపాదించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. లెఫ్ట్‌ఫ్రంట్ భాగస్వామ్యపక్షం ఫార్వర్డ్ బ్లాక్ ఒకే ఒక సీటు సాధించింది. సీపీఎం, కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదు. బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో రెండు, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలు ఒంటరిగా పోటీచేసి గెలుచుకుంది. తర్వాత జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ తర్వాత స్థానం కాషాయదళం సంపాదించి, సీపీఎం, దాని మిత్రపక్షాలను మూడోస్థానానికి నెట్టేయడం బెంగాల్ రాజకీయ చిత్రపటంలో వస్తున్న మార్పునకు సంకేతం.
1991 నుంచీ బలపడుతున్న బీజేపీ!
మండల్-మందిర్ వేడిలో జరిగిన 1991 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల నుంచీ బెంగాల్లో బీజేపీకి పడే ఓట్లు పెరగడం మొదలైంది. ముఖ్యమంత్రి, తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయటిపడి టీఎంసీ స్థాపించాక 1998 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పటి నుంచీ కాషాయదళం బాగా పుంజుకుంది. 1999 ఎన్నికల్లో కూడా టీఎంసీతో పొత్తు బీజేపీకి లాభించింది. ఏబీ వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాల్లో తృణమూల్ ఇంకా సూటిగా చెప్పాలంటే మమతా బెనర్జీ కొనసాగడం బెంగాల్ బీజేపీకి జనామోదం తెచ్చిపెట్టింది. 2006 అసెంబ్లీ ఎన్నికల నుంచీ బీజేపీతో తృణమూల్ తెగతెంపులు చేసుకుంది.
తర్వాత ఎన్నికల్లో బీజేపీ ఒకట్రెండు సీట్లే సాధించినాగాని వామపక్షాల స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నంలో చాలా వరకు విజయంసాధించిందనే చెప్పవచ్చు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు 6 శాతం నుంచి 2014 ఎన్నికలకు 17 శాతానికి పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓట్లు దక్కలేదు. 2006లో 6 శాతం, 2011లో 4 శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పదిశాతం ఓట్లు కమలానికి దక్కాయి. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఉప ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ మూడో స్థానానికి దిగజారింది. బీజేపీ ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకోవడం మూడేళ్ల క్రితమే మొదలైంది. 2016 కూచ్‌బిహార్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ 28.5శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సీపీఎం మద్దతుతో పోటీచేసిన వామపక్షాల అభ్యర్థి(ఫార్వర్డ్‌బ్లాక్)కి కేవలం 6.5 శాతం ఓట్లే పడ్డాయి. మొన్నటి ఏడు పట్టణాల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 18 శాతం ఓట్లు లభించాయి.
కరిగిపోతున్న సీపీఎం ఓటు
2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదలైన సీపీఎం పతనం మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పరాకాష్టకు చేరింది. 2009, 2011, 20014, 2016 వరుసగా లోక్‌సభ, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు వరుసగా 33.1, 30, 22.9, 12.2 శాతం ఓట్లు దక్కాయి. కిందటేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె\స్‌తో లెఫ్ట్‌ఫ్రంట్ సీట్ల సర్దుబాటు చేసుకుంది. 148 సీట్లకు పోటీచేసిన సీపీఎంకు 26 సీట్లు రాగా, 92 సీట్లలో పోటీపడిన కాంగ్రెస్‌కు 44 స్థానాలు లభించడం విశేషం.
మోదీపై మమత వైఖరిలో మార్పు!
ప్రధాని నరేంద్రమోదీతో తనకేమీ పేచీ లేదని, గొడవంతా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోనేనని ఆదివారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో మమత వ్యాఖ్యానించడం ఆమె వైఖరిలో మార్పునకు సూచికగా కనిపిస్తోంది. ‘పార్టీ అధ్యక్షుడు(షా) ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యంచేసుకోవడం దేశంలో నియంతృత్వ వాతావరణానికి చిహ్నం’అంటూ ఆమె ప్రధానిని వదలి ఆయన పార్టీని దుయ్యబట్టారు. బెంగాల్ జనాభాలో 27 శాతం ముస్లింలు (యూపీలో కన్నా ఎక్కువ) ఉండడం, మూడు జిల్లాల్లో మెజారిటీ వారిదే కావడం, నాలుగు జిల్లాల జనాభాలో ముస్లింలు నాలుగోవంతు దాటడం, బంగ్దాదేశ్ సరిహద్దు పొడవునా ఉన్న జిల్లాల్లో మైనారిటీల్లో కనిపిస్తున్న దూకుడు కూడా బీజేపీ బలోపేతానికి కారణాలుగా చెప్పవచ్చు. ఆరేళ్లు దాటిన తృణమూల్ పాలనలో ఆరెసెస్ శాఖలు 475 నుంచి 1680కి పెరిగాయి. ముస్లింలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కొన్ని జిల్లాల్లో ఇటీవల మతఘర్షణలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో 2018లో జరిగే పంచాయతీ ఎన్నికలు బీజేపీ ఇంకే మేరకు బలపడినదీ సూచిస్తాయి.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)