
నేదురుమల్లి కన్నుమూత
మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
4 సభల్లో ప్రాతినిధ్యం వహించిన జనార్దన్‌రెడ్డి
1990 నుంచి 1992 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు
నేడు వాకాడులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయ దిగ్గజం మృతికి ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్/ నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం ఏప్రిల్ 26న నిమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, నలుగురు కుమారులున్నారు. సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన నేదురుమల్లి 1935 ఫిబ్రవరి 20న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో జన్మించారు.
ముఖ్యమంత్రిగా రాష్ట్రంపై తనదైన ముద్రవేశారు. దేశ అత్యున్నత చట్టసభలన్నింటిలోనూ సుదీర్ఘకాలం ప్రతినిధిగా వ్యవహరించిన అరుదైన గౌరవం నేదురుమల్లికి దక్కింది. కీలకమైన నాలుగు చట్టసభలైన లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలిలో ఆయన ప్రాతినిథ్యం వహించడం విశేషం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు. ఇందిరాగాంధీకి సన్నిహితుడిగా మెలగిన ఆయన రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికవ్వడమే కాకుండా ముఖ్యమంత్రిగా సేవలందించారు.1972-78లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1978-1984 మధ్య ఎమ్మెల్సీగా పనిచేశారు.
1988-89లో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 1989లో వెంకటగిరి (నెల్లూరు) నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జలగం వెంగళరావు, టి.అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి కేబినెట్లలో మంత్రిగా చేశారు. రెవెన్యూ, పరిశ్రమలు, విద్యుత్తు, వ్యవసాయ అటవీ, ఉన్నత విద్య వంటి శాఖలు చూశారు. 1989లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వ చ్చాక సీఎంగా ఎన్నికైన మర్రిచెన్నారెడ్డి అర్ధంతరంగా దిగిపోవడంతో ఆయన స్థానంలో రాష్ట్రానికి 12వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 1992 దాకా సీఎంగా కొనసాగారు. తరవాత బాపట్ల (1998-99), నర్సరావుపేట (1999-2004), విశాఖపట్నం (2004-2009) లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసి గెలిచారు. 2009, 2010లో వరుసగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1983, 1994 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2007 సెప్టెంబర్‌లో నక్సల్స్ దాడి నుంచి నేదురుమల్లి, ఆయన భార్య రాజ్యలక్ష్మి త్రుటిలో తప్పించుకున్నారు. రాజ్యలక్ష్మి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. ఆయన కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి ఈ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు.
నేడు వాకాడులో అంత్యక్రియలు
నేదురుమల్లి భౌతిక కాయానికి శనివారం ఆయన స్వగ్రామమైన నెల్లూరుజిల్లా వాకాడులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. నేదురుమల్లి మృతికి సంతాపసూచకంగా జిల్లాలో రేపు అధికారిక సెలవు ప్రకటించారు. దీంతోపాటు అక్కడ మూడు రోజులు సంతాపదినాలుగా కొనసాగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నేదురుమల్లి భౌతిక కాయాన్ని శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంలో ఉంచి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఇందిరాభవన్లో కొంతసేపు ఉంచారు. అక్కడి నుంచి నేరుగా వాకాడుకు తీసుకువెళ్లారు.
ప్రముఖుల సంతాపం
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తనకు ఎన్నోఏళ్లుగా అత్యంత సన్నిహితుడైన మిత్రుడు, ఎంతో గౌరవించే సహచరుడిని కోల్పోయానని నేదురుమల్లి భార్య ఎన్.రాజ్యలక్ష్మికి పంపిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జనార్దన్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య వేర్వేరు సందేశాల్లో సంతాపం వ్యక్తపరిచారు.
జనార్దన్‌రెడ్డి భౌతికకాయాన్ని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి, కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, సీపీఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య, రాష్ట్ర మాజీ మంత్రులు ఇతర ముఖ్యులు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. జనార్దన్‌రెడ్డి మృతిపట్ట కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ సీనియర్‌నేత ఎం.వెంకయ్యనాయుడు, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి, సీనియర్‌నేత కంభంపాటి రామ్మోహన్‌రావు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ్, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు.