అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అత్యంత సీనియర్ నేత కేశూభాయ్ పటేల్(92) కన్ను మూశారు. కోవిడ్–19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్ గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గుజరాత్‌లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించిన కేశూభాయ్ 1995, 1998–2001 సంవత్సరాల్లో రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్‌లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. కేశూభాయ్ మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్య క్రియలు జరుగుతాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు.
కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ తన తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా క్షీణిస్తోందని కేశూభాయ్ కుమారుడు భరత్ పటేల్ తెలిపారు.
గురువారం ఉదయం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోవడంతో ఆస్పత్రికి తరలించామన్నా రు. కేశూభాయ్ గుండెపోటుతో చనిపో యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పర్యటనలో ఉన్న రూపానీ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గాంధీనగర్ చేరుకుని స్వగృహంలో ఉంచిన కేశూభాయ్ మృతదేహానికి నివాళుల ర్పించారు. జునాగఢ్ జిల్లా విసవదార్ పట్టణంలో 1928లో జన్మించిన కేశూభాయ్ 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రచారక్‌గా చేరారు. జన్‌సంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్ర శాసనసభకు ఆయన 6 పర్యాయాలు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment