రుణమాఫీ, హోదా జిమ్మిక్కు...!
మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్‌కే ప్రసాద్
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, తెస్తామని చెప్పి తేకపోవడానికి పాలకుల్లో రాజనీతిజ్ఞత లేకపోవడమే కారణమంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మీడియా సలహాదారు పీవీఆర్‌కే ప్రసాద్. రెండు తెలుగు ప్రాంతాల మధ్య వాతావరణాన్ని ఇంతగా కలుషితం చేసి విభజన చేయటం సరికాదంటున్నారు. రుణమాఫీలు అనేవి ఎక్కడ జరిగినా అవి రాజకీయ జిమ్మిక్కులేనని, మానవీయ కోణంతో కూడిన అభివృద్ధి అవసరమే కానీ అభివృద్ధినే మింగేసే మానవీయ కోణం సమస్యాత్మకం అవుతుందని చెబుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్ష పడాల్సిందే అంటున్న పీవీఆర్‌కే ప్రసాద్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
పీవీ నరసింహారావును కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఎలా ఎంపిక చేసింది?
రాజకీయంగా అప్పటికే పీవీ అస్త్రసన్యాసం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదు. రాజ్యసభలో సీటు ఇచ్చే పరిస్థితి కనబడలేదు. కనబడితే మర్యాద ఇస్తున్నారు తప్పితే విడిగా ఆయన్ని పలకరించేవారు లేకుండా పోయారు. మొదట్నుంచి ఈయనకు గ్రూపు లేదు. తనతో ఉండే ఎంపీలూ లేరు. తన ఓటును తనే వేసుకోవడం పద్ధతి కాదు. ఇలాంటి స్థితిలో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎవరిని ప్రధాని చేయాలనేది పెద్ద సమస్య. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవికి అర్హత ఏమంటే అందరికీ ఆమోదనీయవ్యక్తి కంటే అతి తక్కువ అభ్యంతరాలు ఉన్న వ్యక్తి కావాలి. పీవీ అంటారా.. వెనకాల ఒక మనిషీ లేడు. ఆయనతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసిపడేయవచ్చు. గ్రూపు అనేదే లేదు. పైగా పెద్దవాడు. సీనియర్ పర్సన్, వివాదరహితుడు కాబట్టి ప్రధాని పదవిలో పెడదాం అని నిర్ణయించారు. కానీ పదవిలోకి వచ్చాక చూస్తుండగానే బలపడటమే కాక, దేశానికే ఒక దశా, దిశను ఇచ్చి బాగా నిర్వహిస్తూ మైనారిటీ ప్రభుత్వంలోనూ సంస్కరణలు అమలు చేస్తూ గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చి అయిదేళ్లు పాలన సాగించారు.
విభజనపై మీ వ్యాఖ్య ఏమిటి?
విభజన అనేది అది గత జలసేతు బంధనం. కానీ చెడు వాతావరణం కల్పించి విభజన చేయాల్సి ఉండింది కాదు. 1960ల చివరలో వచ్చిన ఆంధ్రా ఆందోళన కాలంలోనే విభజన చేసి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. ఆ తర్వాత అయినా ఇరువర్గాలనూ పిలిచి కూర్చోబెట్టి వేరు చేసి ఉంటే సరిపోయేది. ఇవేమీ చేయకపోగా వాతావరణాన్ని ఇంతగా దిగజార్చి చేయడం అనవసరం.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారు కదా?
ఆనాడు వాగ్దానం చేసిన వారికి నిబంధనల ప్రకారం అలాంటిది లేదనే విషయం తెలియదా? రాజనీతిజ్ఞత లేకపోవడమే దీనంతటికీ కారణం. నిజంగా హోదా ఇవ్వదలుచుకుంటే ఏ రూల్స్ కూడా అడ్డురావు. ఇది మంచిది ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. ఏదో ఒక లబ్ధి కోసమే ఏదైనా చేస్తారు. నిజంగా ఆ లబ్ధే వస్తే.. హోదా ఇస్తే ఏమి, లేకపోతే ఏమి? హోదాకు సమానమైన ప్రయోజనం పూర్తిగా ఇవ్వగలిగితే హోదా అవసరం లేదు. కానీ ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ సమస్య అయి కూర్చుంది. నిజంగా హోదావల్ల వచ్చేవన్నీ మామూలుగా వస్తే ఇక హోదా అవసరం ఎందుకు? కానీ హోదాతో పని లేని ప్రయోజనాలు ఇస్తున్నారా, ఇవ్వలేదా అన్నదే ఇక్కడ పాయింటు.
పలు రాష్ట్రాలకు హోదా కల్పించాక అవి ఎంతో లబ్ది పొందాయి కదా?
ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిన అర్హత ఆంధ్రప్రదేశ్‌కు రాదు. సమస్య ఏమిటంటే హోదా వస్తుంది, ఇస్తామని చెప్పేశారు. ఇస్తామని డిక్లేర్ చేసినప్పుడు ఆ మాటకు అందరూ కట్టుబడాలి. కానీ అధికారంలో లేనప్పుడు చేసే వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చాక పాలనా పరంగా అమలు చేయాల్సి వచ్చేటప్పటికీ చాలా తేడా ఉంటుందన్నది ఇక్కడ మనకే కాదు రేపు అమెరికాలో వాళ్లకు కూడా తెలుసు. ఎందుకంటే పరిస్థితులు అలాంటివి.
పెద్ద నోట్ల రద్దుపై మీ అభిప్రాయం?
దేశానికి మంచిది. కానీ ఎవరికీ ఇబ్బంది లేకుండా జరుగుతుందన్నది మాత్రం వాస్తవం కాదు. మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది గ్రామస్థాయి వరకు ఇంకా పూర్తిస్థాయిలో వెళ్లలేదు. ప్రభుత్వం ఏదో ఇస్తామంటే వెళ్లి ఖాతాలు తెరిచారు తప్పితే ఖాతాలు ఆపరేట్ చేసుకోవడానికి తీసుకునేవారు లేరు. పైగా నగదు లావాదేవీలపైనే చాలామంది ఆధారపడి ఉన్నారు. వాటిని కాస్త సరళీకరించి, జనానికి ఇబ్బందులు లేకుండా చేయగలిగితే నోట్ల రద్దు విజయవంతమవుతుంది.
దేశంలో కోట్లమంది పేదలున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా?
ఇబ్బందిపడుతున్నారు. ఇంత భారీ మార్పు జరిగినప్పుడు తప్పకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ దానికి మూల్యం అన్ని రాజకీయ పార్టీలు చెల్లించాల్సి వస్తుంది కూడా.
ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది కదా?
ఎక్కడ కుదేలైంది? ఏమీ కాలేదు. నాలుగు రోజులు గడిచేసరికి కార్డు ఎలా ఉపయోగిస్తాం, చెక్కు ఎలా రాస్తాం అని తెలుసుకుంటున్నారు. మన ప్రతిఘటన అంతా ఎక్కడ వస్తోందంటే.. ఖాతా ఉన్నవాడు నగదు తీసుకుని ఇద్దామనుకుంటున్నాడు తప్పితే చెక్కు ఇచ్చి తీసుకుందాం అనుకోవడం లేదు.
ఏపీ, తెలంగాణలో రుణమాఫీలపై మీ అభిప్రాయం?
ఏపీలోనే కాదు, తెలంగాణలోనే కాదు. ఏ రాష్ట్రంలో ఇలాంటివి జరిగినా సరే ఇలాంటివి రాజకీయ జిమ్మిక్కులే. రుణమాఫీ వంటివి ఆర్థిక వ్యవస్థకు మంచివి కాదు. అప్పు అంటే అప్పేనండీ. ఒకసారి నువ్వు అçప్పు తీసుకున్నాక, దాన్ని చెల్లించాలి. పంట పోతే రుణం మాఫీ చేయాలి. అంతే కానీ ఎన్నికలప్పుడు రుణమాఫీలు ఏమిటి?
బాబు వంటి సీనియర్ నేత కూడా రుణ మాఫీపై వాగ్దానం చేశారు కదా?
ఆయన ఎంతో డెవలప్ చేసానని చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనే సీట్లు రాకపోతే, గెలవాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లి గెలిచాక కొన్ని స్కీములు అమలు చేశారు. ఎలాంటి స్కీములు పెడితే ఎలాంటి వాళ్లు ఆకర్షితులవుతారో తెలిసింతర్వాత అందరూ అలాంటి స్కీములకు ప్రయత్నిస్తారు. ఒక విషయం గుర్తించాలి. మానవీయ కోణంతో కూడిన అభివృద్ధిని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తే మంచిదే. కానీ అభివృద్ధినే మింగేసే హ్యూమన్ ఫేస్ ఉంటే కష్టమైపోతుంది.
ఓటుకు కోట్లుపై మీ వ్యాఖ్య?
కెమెరాలలో జరిగిన ఘటనను, పద్ధతిని చూసినవారికి అక్కడేదో తప్పు జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ అది ఎంతవరకు, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు చేయించారు అనేది చట్టమే నిర్ణయిం చాలి. అది ఇప్పటికే న్యాయ విచారణ ప్రక్రియలో ఉంది. అలాంటప్పుడు ఘటనలో ఉన్న వారినీ విమర్శించి, అటు చట్టాన్నీ విమర్శించే పని పెట్టుకోవడం సరైంది కాదు. కానీ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందే.
రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు మీద మీ వ్యాఖ్య?
భవిష్యత్తు తప్పకుండా బాగానే ఉంటుంది. కనీసం అభివృద్ధి విషయంలో ఇద్దరూ పోటీపడుతున్నారు. చేద్దామని ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తూ రెండేళ్ల క్రితం ఉన్న ద్వేషభావం ఇప్పుడు అంతగా లేదు. కొంతలో కొంత సర్దుకున్నారు. అభివృద్ధి చేసుకుంటూ పోతే ఎక్కడున్నా ఇబ్బంది లేదనే ఫీలింగు జనంలో ఉంది. ఉన్న పెట్టుబడులు పోవు. రెండుచోట్లా మదుపు పెట్టవచ్చు అనే అభిప్రాయం కూడా వచ్చేసింది. అందరూ పనిచేస్తే రెండు రాష్ట్రాలూ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.
(పీవీఆర్‌కే ప్రసాద్‌తో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకులో చూడండి)
https:// www. youtube. com/ watch? v= qMSpP7 kSmzo