loan weiver
-
రుణమాఫీకి సిద్ధం
సాక్షిపతినిధి, ఖమ్మం: రైతులు పంటల సాగుకోసం బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల మాఫీకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మొదటి విడతలో రూ.25వేల లోపు లోన్లను మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత రూ.లక్షలోపు వారికి నాలుగు విడతల్లో విముక్తి కల్పించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష రూపాయలలోపు పంట రుణాన్ని మాఫీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వడంతో..ప్రభుత్వం ఇప్పుడు అమలుకు పూనుకుంది. దీంతో 2018, డిసెంబర్ 11వ తేదీలోపు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. 2.63 లక్షల మంది కర్షకులు రూ.2,324 కోట్లు తీసుకున్నట్లు అంచనా. ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతోపాటు ఏపీజీవీబీ, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లో పొందిన పంట రుణాలను మాఫీ చేయనున్నారు. జాబితా రాగానే.. అర్హులైన రైతుల వివరాలను ఆయా బ్యాంకులు వారి ప్రధాన కార్యాలయాలకు పంపించాయి. మాఫీ అవుతున్న రుణం విలువకు సంబంధించి ఎస్ఎల్బీసీ (స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ)నుంచి జిల్లాలకు జాబితా అందాల్సి ఉంది. ఆ తర్వాత మాఫీ ప్రక్రియ షురూ కానుంది. 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.59 లక్షల మంది రైతులు రుణమాఫీ పొందారు. రూ.1,630కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో వెచ్చించింది. ప్రభుత్వ ఆదేశాలతోనే.. రుణమాఫీ ప్రక్రియపై ప్రభుత్వ ఆదేశాలందడంతో చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి వివరాలను సేకరించి సిద్ధం చేస్తున్నాం. ఎస్ఎల్బీసీ నుంచి జాబితా వచ్చాక జిల్లాలో ఆచరిస్తాం. – సీహెచ్.చంద్రశేఖర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఖమ్మం -
‘రుణమాఫీ’కి సమాయత్తం
రైతులకు కొండంత ఆత్మస్థైర్యాన్నిచ్చి ఆర్థికంగావెసులుబాటు కల్పించిన రుణమాఫీ పథకం అమలుకు సన్నాహాలు మొదలయ్యాయి. పంట రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీ చేసినా.. ముక్కుపిండి వడ్డీ కట్టేలా బలప్రదర్శనకు దిగినా.. సహనంతో అప్పులు చేసి రైతులు కట్టారు. రుణమాఫీ ఆదుకుంటుందనే భరోసాతో ప్రభుత్వంపై భారం వేసి కుటుంబాలను వెళ్లదీస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీ ఎట్టకేలకు పట్టాలెక్కుతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనున్నట్టు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంది. నాలుగు విడతలుగా 25 శాతం చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలోనూ మళ్లీ రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వరుస ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ అమలులో జాప్యం చోటు చేసుకుంది. దీనిపై తెలంగాణ ఆవిర్భావం రోజు అధికారికంగా ప్రకటిస్తారని భావించినా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాని ఊసే లేకుండా పోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రుణమాఫీకి సంబంధించినమార్గదర్శకాలను మూడు రోజుల క్రితమే రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి జారీ చేశారు. కటాఫ్ తేదీ 2018 డిసెంబర్ 11 రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలకు రూపకల్పన చేసింది. రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి జి ల్లాల వారీగా బ్యాంకులు, పంట రుణాల మొ త్తం, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల వి వరాలు సేకరించింది. గతంలో 2018 డిసెంబ ర్ 11 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకర్లు రుణమాఫీ అర్హులను తేల్చేపనిలో నిమగ్నమయ్యారు. 26 అంశాలతో వివరాలను సేకరించనున్నారు. ప్రభుత్వ ప్రకటన మేరకు నిర్ణీత తేదీ కంటే ముందు బకాయిలు ఉన్న రైతుల వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. రైతు పేరు, ఖాతా నంబర్, ఆధార్ కార్డు, తీసుకున్న రుణం, అసలు, వడ్డీ కలిపి మొత్తం, ఫోన్ నంబర్, తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని సూచించారు. బ్యాంకుల వారీగా వివరాలు ఆరా తీయనుండగా వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 2014లో 4 దఫాలుగా... తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కటాఫ్ తేదీని నిర్ణయించి ‘రుణమాఫీ’ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు నాలుగు దఫాలుగా రుణమాఫీ నిధులు విడుదల చేసింది. 2014లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం రైతులు 6,07,813 మందికి గాను రుణమాఫీకి 5,98,990 మంది అర్హత సాధించారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ.2,725.83 కోట్లు కేటాయించింది. రూ.25వేల లోపైతే ఒకేసారి.. 2018 డిసెంబర్ 11 కంటే ముందున్న పంట రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. రుణమాఫీతో సంబంధం లేకుండా తీసుకున్న రుణాలను చెల్లించి మళ్లీ తీసుకోవాలని, రుణమాఫీకి చెందిన డబ్బులు చెక్ రూపంలో నాలుగు విడతల్లో ఇస్తామని ప్రకటించారు. తాజాగా రూ.25వేల లోపు పంట రుణం ఉన్న రైతులకు ఒకేసారి అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు విడతల వారీగా మాఫీ సొమ్ము అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.25వేల లోపు పంట రుణం మొత్తం ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించడంతో సన్న, చిన్నకారు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తక్కువ రుణం ఉన్నా.. విడతల వారీగా రావడంతో అవి వడ్డీకే సరిపోయేవి. రూ.20వేలు రుణం ఉంటే విడతల వారీగా రూ.ఐదు వేల చొప్పున జమ చేశారు. తాజా ప్రకటనతో రూ.25వేల లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు లక్ష మంది ఉంటారని బ్యాంకర్ల అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5.42 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. అయితే గతంలో గడువులోగా రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ చేయకపోగా అప్పు ఉన్న వారికే విడతల వారీగా ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ముందు జాగ్రత్తగా చాలామంది రెన్యువల్ చేసుకోలేదు. నిర్ణీత తేదీని తెలియజేసి రుణాలు చెల్లించినా.. రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో ఈ సీజన్లో తిరిగి బకాయిలు చెల్లించి కొందరు రైతులు రుణాలు పొందారు. ఇప్పుడు మాఫీ చేస్తే వడ్డీ సొమ్మును ఎప్పటి వరకు లెక్కిస్తారనేది తేలాల్సి ఉంది. సందేహాలెన్నో..? గతంలో జరిగిన ‘రుణమాఫీ’లో ఎదురైన స మస్యలు మళ్లీ పునరావృతమవుతాయా అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలేవీ రాలేదని వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లు చె బుతున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చే యాల్సి ఉంది. చాలామందికి రెండు ప్రాంతా ల్లో భూములు ఉండి పాసు పుస్తకాలు ఉన్నా యి. వేర్వేరు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం ఉంది. రెండు మాఫీ చేస్తారా.. ఏదో ఒకటి చేస్తారా.. అలాగే కుటుంబానికి రూ.లక్ష మాఫీ చేస్తే ఒకే కుటుంబంలో ముగ్గురి పేరున కలిపి రూ.1.25 లక్షల రుణం ఉంటే ఎంత మాఫీ అవుతుంది. గత రుణమాఫీలో మొదట బంగారం తాకట్టుపెట్టిన రుణాలకు వర్తించలేదు. తదుపరి ఆదేశాలతో కొంతమందికి మాఫీ అయింది. తాజాగా బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకున్నారు. బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను పంట రుణాల కింద చూపవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. వాటిని పరిగణలోకి తీసుకుంటారా.. లేదా, రుణమాఫీతో సంబంధం లే కుండా పంట రుణం కింద తీసుకున్న రుణా న్ని కొంతమంది రైతులు గడువులోగా చెల్లించారు. ఇలాంటి వారు గత రుణమాఫీలో ఉండగా వీరికి మాఫీ వర్తించలేదు. ఈ దఫా రు ణాలను సకాలంలో చెల్లించిన వారికి మాఫీ చే స్తారా? దీర్ఘకాలంగా బ్యాంకులకు అప్పులు క ట్టకుండా మొండి బకాయిదారుల జాబితాలో చేరిన వారికి మాఫీ ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రుణమాఫీ చేసిన సందర్భంలో రైతులు తీసుకున్న పంట రుణాలను కొన్ని బ్యాంకులు రీషెడ్యూ లు చేయడంతో సంబంధిత రైతులకు వర్తించలేదు. అందులో చాలామంది ఇప్పటికీ రుణాలను చెల్లించలేదు. వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. వివరాలు సేకరిస్తున్నాం రూ.లక్షలోపు అప్పు తీసుకున్న రైతులు ఎంతమంది ఉంటారో స్పష్టంగా చెప్పలేం. ఈ వివరాలు ఇవ్వాలని ఆయా బ్యాంకర్లకు చెప్పాం. వారు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో ఈ సమాచారం మాకు అందుతుంది. అలాగే మార్గదర్శకాలు సైతం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. – నాగరాజకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్, మహబూబ్‌నగర్ జిల్లా ఏకకాలంలో మాఫీ చేయాలి రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలి. రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు సైతం రూ.లక్ష వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్నారు. కొందరు మాత్రమే తక్కువ రుణం తీసుకున్నారు. చిన్న రైతులకు ప్రాధాన్యతనివ్వడం మంచిదే. అయితే రూ.లక్ష లోపు రుణం ఉన్న రైతులకు నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తే ఆ డబ్బు వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది. – వెంకటేశ్వర్‌రెడ్డి, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ మండలం -
డ్వాక్రా మహిళలకు మరోసారి మోసం
సాక్షి, విశాఖపట్నం: డ్వాక్రా మహిళలను మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ మహిళా సదస్సు ఇన్చార్జి విజయసారథి రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి నాలుగున్నరేళ్లు గడిచినా హామీ నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికలకు మూడు నెలల ముందు వచ్చి మహిళలకు స్వర్ణయుగం తెస్తానంటే చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ సీపీ నగర, విశాఖ పార్లమెంట్ మహిళా అధ్యక్షులు గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని పార్టీ ప్రధాన కార్యలయంలో మహిళా సదస్సు బుధవారం నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా విజయ సారథిరెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరదు కల్యాణి హాజరయ్యారు. ముందుగా నవరత్నాలు అమలు చేస్తే కలిగే ప్రయోజనాలను ఎల్సీడీ స్క్రీన్ ద్వారా మహిళలకు వివరించారు. అనంతరం విజయసారథి రెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వాటితో కలిగే ప్రయోజనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలో పర్యటించి నవరత్నాలతో మహిళలకు కలిగే లబ్ధిని వివరించాలన్నారు. అబద్ధపు హామీలతో మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్న వైనాన్ని కూడా అందరికీ తెలియజేయాలన్నారు. అనంతరం వరదు కల్యాణి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ మూడు నెలలూ చాలా కీలకమన్నారు. మహిళా కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామన్నారు. ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి నవరత్నాలను తీసుకెళ్లడానికి కృషి చేయాలన్నారు. మహిళలను మభ్యపెట్టడానికే పసుపు – కుంకుమ పేరుతో మరో మోసానికి చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు. విశాఖ నగరంలో నిర్వహించిన సమావేశంలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్ఫోన్లు, రూ.10వేలు చొప్పున ఇస్తామని ఆశ కల్పించి వాటర్ ప్యాకెట్లతో టీడీపీ నాయకులు సరిపెట్టారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వడ్డీ కూడా చెల్లించకుండా అక్కాచెల్లమ్మలు ఎదురుచూస్తున్నారన్నారు. గరికిన గౌరి మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను కాపీ కొట్టి మహిళల ఓట్లు దండుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మరో రెండు నెలల్లో రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు ఎత్తుగడలను తిప్పికొడతారన్నారు. సదస్సులో విశాఖ ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు, గాజువాక, భీమిలి నియోజకవరగ్గాల మహిళా విభాగం అధ్యక్షులు సాడి పద్మారెడ్డి, మళ్ల ధనలత, సభీర, కృప, చినతల్లి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీదేవివర్మ, శిరీష, అనుబంధ విభాగాల అధ్యక్షులు యువశ్రీ, రామలక్ష్మి, నిర్మలారెడ్డి, అమృతవలి, శోభ పాల్గొన్నారు. -
మాఫీ ఎలా?
సాక్షి, బెంగళూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతల రుణ మాఫీ చేయాలంటూ రైతుసంఘాలు, ప్రతిపక్ష బీజేపీ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడితో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో జేడీఎస్ గద్దెనెక్కితే రైతులకు రూ. 53 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని కుమారస్వామి హామీనిచ్చారు. అనూహ్య పరిస్థితుల్లో కుమార సీఎం కావడం, రుణాల రద్దు కోసం బీజేపీ సహా రైతుసంఘాలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. రుణమాఫీపై ఉన్న సాదకబాధకాలపై మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రుణమాఫీపై తీవ్రంగా చర్చించినట్లు తెలిపారు. నేడు (బుధవారం) రుణమాఫీపై ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేస్తామని చెప్పారు. రూ.55 వేల కోట్లు అవసరం తొలుత రైతులకు రుణమాఫీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుందనే విషయంపై అధికారులను ముఖ్యమంత్రి ఆరా తీశారు. సీఎం నివాసంకృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిని వివరించారు. వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార సంస్థల్లోని మొత్తం రుణాలను మాఫీ చేయాలంటే రూ. 55 వేల కోట్లు అవసరమవుతాయని ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. ఆరోగ్య బీమా పథకం యశస్వీపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అమలు తీరుతెన్నుల గురించి ఆరా తీశారు. పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంపై సూచనలిచ్చారు. నేడు రైతు సంఘాలతో సీఎం భేటీ రైతు రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నేడు (బుధవారం) ఉదయం 11.15 గంటలకు విధానసౌధలో రైతు సంఘాలతో సమావేశం నిర్వహిస్తారు. ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర్ ఈ భేటీలో పాల్గొననున్నారు. సమావేశంలో పాల్గొనాల్సిందిగా బీజేపీ పక్ష నేత బీఎస్ యడ్యూరప్పనూ ఆహ్వానించారు. రుణమాఫీపై ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్‌కు కుమార షాక్ : బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల రద్దు బొమ్మనహళ్లి : రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మంత్రి మండలి ఏర్పాటుకాలేదు. మంత్రివర్గంలో చోటు కోసం రెండు పార్టీల నుంచి ఔత్సాహికులకు కొదవ లేదు. దీంతో ఇరుపార్టీల ఎమ్మెల్యేను శాంతపరచడానికి సీఎం కుమారస్వామి గత ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్, బోర్డుల అధ్యక్షుల పదవీకాలం ముగియకముందే రద్దు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే బోర్డు, కార్పొరేషన్ల పదవుల్లో ఉండేవారందరూ కాంగ్రెస్ నాయకులే. పదవీకా లం ఉండగానే ఎలా రద్దు చేస్తారని అధ్యక్షలు రుసరుసలాడుతున్నారు. కుమారస్వామిది ఏకపక్ష నిర్ణయమని ఆక్షేపిస్తున్నారు. -
రుణమాఫీ, హోదా జిమ్మిక్కు...!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, తెస్తామని చెప్పి తేకపోవడానికి పాలకుల్లో రాజనీతిజ్ఞత లేకపోవడమే కారణమంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మీడియా సలహాదారు పీవీఆర్కే ప్రసాద్. రెండు తెలుగు ప్రాంతాల మధ్య వాతావరణాన్ని ఇంతగా కలుషితం చేసి విభజన చేయటం సరికాదంటున్నారు. రుణమాఫీలు అనేవి ఎక్కడ జరిగినా అవి రాజకీయ జిమ్మిక్కులేనని, మానవీయ కోణంతో కూడిన అభివృద్ధి అవసరమే కానీ అభివృద్ధినే మింగేసే మానవీయ కోణం సమస్యాత్మకం అవుతుందని చెబుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్ష పడాల్సిందే అంటున్న పీవీఆర్కే ప్రసాద్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. పీవీ నరసింహారావును కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఎలా ఎంపిక చేసింది? రాజకీయంగా అప్పటికే పీవీ అస్త్రసన్యాసం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదు. రాజ్యసభలో సీటు ఇచ్చే పరిస్థితి కనబడలేదు. కనబడితే మర్యాద ఇస్తున్నారు తప్పితే విడిగా ఆయన్ని పలకరించేవారు లేకుండా పోయారు. మొదట్నుంచి ఈయనకు గ్రూపు లేదు. తనతో ఉండే ఎంపీలూ లేరు. తన ఓటును తనే వేసుకోవడం పద్ధతి కాదు. ఇలాంటి స్థితిలో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎవరిని ప్రధాని చేయాలనేది పెద్ద సమస్య. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవికి అర్హత ఏమంటే అందరికీ ఆమోదనీయవ్యక్తి కంటే అతి తక్కువ అభ్యంతరాలు ఉన్న వ్యక్తి కావాలి. పీవీ అంటారా.. వెనకాల ఒక మనిషీ లేడు. ఆయనతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసిపడేయవచ్చు. గ్రూపు అనేదే లేదు. పైగా పెద్దవాడు. సీనియర్ పర్సన్, వివాదరహితుడు కాబట్టి ప్రధాని పదవిలో పెడదాం అని నిర్ణయించారు. కానీ పదవిలోకి వచ్చాక చూస్తుండగానే బలపడటమే కాక, దేశానికే ఒక దశా, దిశను ఇచ్చి బాగా నిర్వహిస్తూ మైనారిటీ ప్రభుత్వంలోనూ సంస్కరణలు అమలు చేస్తూ గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చి అయిదేళ్లు పాలన సాగించారు. విభజనపై మీ వ్యాఖ్య ఏమిటి? విభజన అనేది అది గత జలసేతు బంధనం. కానీ చెడు వాతావరణం కల్పించి విభజన చేయాల్సి ఉండింది కాదు. 1960ల చివరలో వచ్చిన ఆంధ్రా ఆందోళన కాలంలోనే విభజన చేసి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. ఆ తర్వాత అయినా ఇరువర్గాలనూ పిలిచి కూర్చోబెట్టి వేరు చేసి ఉంటే సరిపోయేది. ఇవేమీ చేయకపోగా వాతావరణాన్ని ఇంతగా దిగజార్చి చేయడం అనవసరం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారు కదా? ఆనాడు వాగ్దానం చేసిన వారికి నిబంధనల ప్రకారం అలాంటిది లేదనే విషయం తెలియదా? రాజనీతిజ్ఞత లేకపోవడమే దీనంతటికీ కారణం. నిజంగా హోదా ఇవ్వదలుచుకుంటే ఏ రూల్స్ కూడా అడ్డురావు. ఇది మంచిది ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. ఏదో ఒక లబ్ధి కోసమే ఏదైనా చేస్తారు. నిజంగా ఆ లబ్ధే వస్తే.. హోదా ఇస్తే ఏమి, లేకపోతే ఏమి? హోదాకు సమానమైన ప్రయోజనం పూర్తిగా ఇవ్వగలిగితే హోదా అవసరం లేదు. కానీ ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ సమస్య అయి కూర్చుంది. నిజంగా హోదావల్ల వచ్చేవన్నీ మామూలుగా వస్తే ఇక హోదా అవసరం ఎందుకు? కానీ హోదాతో పని లేని ప్రయోజనాలు ఇస్తున్నారా, ఇవ్వలేదా అన్నదే ఇక్కడ పాయింటు. పలు రాష్ట్రాలకు హోదా కల్పించాక అవి ఎంతో లబ్ది పొందాయి కదా? ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిన అర్హత ఆంధ్రప్రదేశ్‌కు రాదు. సమస్య ఏమిటంటే హోదా వస్తుంది, ఇస్తామని చెప్పేశారు. ఇస్తామని డిక్లేర్ చేసినప్పుడు ఆ మాటకు అందరూ కట్టుబడాలి. కానీ అధికారంలో లేనప్పుడు చేసే వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చాక పాలనా పరంగా అమలు చేయాల్సి వచ్చేటప్పటికీ చాలా తేడా ఉంటుందన్నది ఇక్కడ మనకే కాదు రేపు అమెరికాలో వాళ్లకు కూడా తెలుసు. ఎందుకంటే పరిస్థితులు అలాంటివి. పెద్ద నోట్ల రద్దుపై మీ అభిప్రాయం? దేశానికి మంచిది. కానీ ఎవరికీ ఇబ్బంది లేకుండా జరుగుతుందన్నది మాత్రం వాస్తవం కాదు. మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది గ్రామస్థాయి వరకు ఇంకా పూర్తిస్థాయిలో వెళ్లలేదు. ప్రభుత్వం ఏదో ఇస్తామంటే వెళ్లి ఖాతాలు తెరిచారు తప్పితే ఖాతాలు ఆపరేట్ చేసుకోవడానికి తీసుకునేవారు లేరు. పైగా నగదు లావాదేవీలపైనే చాలామంది ఆధారపడి ఉన్నారు. వాటిని కాస్త సరళీకరించి, జనానికి ఇబ్బందులు లేకుండా చేయగలిగితే నోట్ల రద్దు విజయవంతమవుతుంది. దేశంలో కోట్లమంది పేదలున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా? ఇబ్బందిపడుతున్నారు. ఇంత భారీ మార్పు జరిగినప్పుడు తప్పకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ దానికి మూల్యం అన్ని రాజకీయ పార్టీలు చెల్లించాల్సి వస్తుంది కూడా. ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది కదా? ఎక్కడ కుదేలైంది? ఏమీ కాలేదు. నాలుగు రోజులు గడిచేసరికి కార్డు ఎలా ఉపయోగిస్తాం, చెక్కు ఎలా రాస్తాం అని తెలుసుకుంటున్నారు. మన ప్రతిఘటన అంతా ఎక్కడ వస్తోందంటే.. ఖాతా ఉన్నవాడు నగదు తీసుకుని ఇద్దామనుకుంటున్నాడు తప్పితే చెక్కు ఇచ్చి తీసుకుందాం అనుకోవడం లేదు. ఏపీ, తెలంగాణలో రుణమాఫీలపై మీ అభిప్రాయం? ఏపీలోనే కాదు, తెలంగాణలోనే కాదు. ఏ రాష్ట్రంలో ఇలాంటివి జరిగినా సరే ఇలాంటివి రాజకీయ జిమ్మిక్కులే. రుణమాఫీ వంటివి ఆర్థిక వ్యవస్థకు మంచివి కాదు. అప్పు అంటే అప్పేనండీ. ఒకసారి నువ్వు అçప్పు తీసుకున్నాక, దాన్ని చెల్లించాలి. పంట పోతే రుణం మాఫీ చేయాలి. అంతే కానీ ఎన్నికలప్పుడు రుణమాఫీలు ఏమిటి? బాబు వంటి సీనియర్ నేత కూడా రుణ మాఫీపై వాగ్దానం చేశారు కదా? ఆయన ఎంతో డెవలప్ చేసానని చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనే సీట్లు రాకపోతే, గెలవాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లి గెలిచాక కొన్ని స్కీములు అమలు చేశారు. ఎలాంటి స్కీములు పెడితే ఎలాంటి వాళ్లు ఆకర్షితులవుతారో తెలిసింతర్వాత అందరూ అలాంటి స్కీములకు ప్రయత్నిస్తారు. ఒక విషయం గుర్తించాలి. మానవీయ కోణంతో కూడిన అభివృద్ధిని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తే మంచిదే. కానీ అభివృద్ధినే మింగేసే హ్యూమన్ ఫేస్ ఉంటే కష్టమైపోతుంది. ఓటుకు కోట్లుపై మీ వ్యాఖ్య? కెమెరాలలో జరిగిన ఘటనను, పద్ధతిని చూసినవారికి అక్కడేదో తప్పు జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ అది ఎంతవరకు, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు చేయించారు అనేది చట్టమే నిర్ణయిం చాలి. అది ఇప్పటికే న్యాయ విచారణ ప్రక్రియలో ఉంది. అలాంటప్పుడు ఘటనలో ఉన్న వారినీ విమర్శించి, అటు చట్టాన్నీ విమర్శించే పని పెట్టుకోవడం సరైంది కాదు. కానీ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు మీద మీ వ్యాఖ్య? భవిష్యత్తు తప్పకుండా బాగానే ఉంటుంది. కనీసం అభివృద్ధి విషయంలో ఇద్దరూ పోటీపడుతున్నారు. చేద్దామని ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తూ రెండేళ్ల క్రితం ఉన్న ద్వేషభావం ఇప్పుడు అంతగా లేదు. కొంతలో కొంత సర్దుకున్నారు. అభివృద్ధి చేసుకుంటూ పోతే ఎక్కడున్నా ఇబ్బంది లేదనే ఫీలింగు జనంలో ఉంది. ఉన్న పెట్టుబడులు పోవు. రెండుచోట్లా మదుపు పెట్టవచ్చు అనే అభిప్రాయం కూడా వచ్చేసింది. అందరూ పనిచేస్తే రెండు రాష్ట్రాలూ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. (పీవీఆర్కే ప్రసాద్‌తో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకులో చూడండి) https:// www. youtube. com/ watch? v= qMSpP7 kSmzo -
చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ..ఎన్నికలు అయిన తర్వాత ప్రజలతో పనిలేదనుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు అయిన తర్వాత బాబు ప్లేటు ఫిరాయించారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ .... అయిదేళ్ల పాటు ప్రజలతో పనిలేదన్నప్పుడు చంద్రబాబు ఎలా ప్లేటు మార్చేయగలిగారో, ఎంతగొప్పగా అబద్దాలు ఆడారో...మీడియాకు విజువల్స్ ద్వారా చూపించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ' మొట్టమొదటిగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన దాంట్లో ప్రధానపాత్ర చంద్రబాబు నాయుడిదే. పార్లమెంటులో తన ఎంపీల చేత తానే ఓటు వేయించిన ఘటన బాబుది. సీమాంధ్రకు, తెలంగాణకు చంద్రబాబు వేర్వేరుగా మేనిఫెస్టోలు ప్రకటించారు. తన మేనిఫెస్టోలో తానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అని ప్రకటించారు. చంద్రబాబు నాయుడి గెజిట్ పేపర్ ఈనాడు దినపత్రికలో వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అని రాశారు. ఏప్రిల్ 11న చంద్రబాబు ఈసీకి రాసిన లేఖలో రెండో లైన్లోనే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆరోజు ఆయన అన్నది పంట రుణాలు కాదు, వ్యవసాయ రుణాలే. ప్రధాని మోదీగారితో కలిసి చంద్రబాబు పక్కనే ఉన్న కరపత్రాలు చాలా విడుదల చేశారు. ఇందులో మొట్టమొదటి పాయింటే..వ్యవసాయ రుణాల మాఫీ. ఇక రెండోది డ్వాక్రా రుణాల మాఫీ. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు..గెజిట్ పేపర్ ఈనాడు పత్రికలో వ్యవసాయ రుణాలు రద్దు అంటూ పెద్ద ప్రకటన ఇచ్చారు. 2014 మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. నేనెప్పుడు అన్నాను..వ్యవసాయ రుణాలని.. నేను అన్నది పంట రుణాలు అని చంద్రబాబు ప్లేటు మార్చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ సంగతి అడిగితే తర్వాత మాట్లాడదాం దాని గురించి అని మాట మార్చేశారు. బాబొస్తాడు..జాబు వస్తుంది.. అని విస్తృతంగా ప్రచారం చేశారు. ఒకవేళ జాబు రాకపోతే..రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబు వచ్చాడు..జాబు రాలేదు...కనీసం నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారంటే దాని గురించి మాట్లాడరు' అని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం చేపట్టబోయే మహాధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
'బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచింది'
హైదరాబాద్ : టీఆర్ఎస్ తొలి బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉదయం అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే...సాయంత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన అన్నారు. తమది భారీ బడ్జెట్ అంటున్న కేసీఆర్ రైతు రుణాలు పూర్తిగా ఎందుకు మాఫీ చేయలేకపోయారని పొన్నాల సూటిగా ప్రశ్నించారు. కేంద్రం నుంచి కరెంటు పొందలేకపోతున్న కేసీఆర్... 22వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ఎలా పొందుతారని ఆయన అన్నారు. నిధుల సమీకరణపై బడ్జెట్లో స్పష్టత లోపించిందని పొన్నాల అభిప్రాయపడ్డారు. విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులకు కూడా పొంతన లేదని, బడ్జెట్లో ఇచ్చిన హామీల మేరకు పథకాలకు నిధులు ఇవ్వగలరో లేదో కేసీఆర్ తన గుండెలపై చేయి వేసుకుని ప్రజలకు జవాబు చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. -
వెయ్యి కాదు....రూ.5వేల కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను వల్ల నష్టపోయిన ఉత్తరాంధ్ర పునరుద్ధరణకు వెయ్యి కోట్లు సరిపోవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తక్షణ సాయంగా రూ.5వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాను వల్ల రూ.70వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా అని, దీనిపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు రుణమాఫీ చేయకపోవటంతో రైతులు బీమా అవకాశాన్ని కోల్పోయారని పద్మరాజు అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి రైతులకు పంట బీమా వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తే ఊరటగా ఉంటుందన్నారు.