PVRK Prasad
-
పీవీఆర్కే ప్రసాద్ చిత్రపటం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ చిత్రపటాన్ని బుధవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా పీవీఆర్కే ప్రసాద్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, శిక్షణ వ్యవస్థను పటిష్టం చేశారని కొనియాడారు. ఈ ఏడాది ఆగస్టులో మరణించిన పీవీఆర్కే ప్రసాద్ 1998 నుంచి 2004 మధ్య ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. -
పదవులకే వన్నెతెచ్చిన పీవీఆర్కే ప్రసాద్
హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మీడియా సలహాదారుగా, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా, డాక్టర్ ఎంసీఆర్ మానవ వనరుల అభివద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా ఐఏఎస్ అధికారిగా పీవీఆర్కే ప్రసాద్ ఎనలేని సేవలు చేశారు. ఆయన ఎప్పుడు, ఏ విభాగంలో పనిచేసినా ఆ విభాగం అభివద్ధికి అంకిత భావంతో అవిశ్రాంతంగా పనిచేశారు. ముఖ్యంగా ఆయన మానవ వనరుల అభివద్ధి డైరెక్టర్ జనరల్‌గా అందించిన సేవలు మరువలేనివి. మకుటాయమానమైనవి. 1988లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఈ విభాగం అధిపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి అత్యున్నత ప్రభుత్వోద్యోగి వరకు రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగుల పనితీరును విశ్లేషించి, వారికి ఎప్పటికప్పుడు వివిధ విభాగాల్లో అవసరమైన శిక్షణ ఇవ్వడం, వారిని వత్తిలో రాణించేలా తీర్చిదిద్దడం డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ పని. ఈ సంస్థ పనులు కుంటినడక నడుస్తుండడంతో చంద్రబాబు సూచన మేరకు నేను మరో విభాగంలో పనిచేస్తున్న పీవీఆర్కే ప్రసాద్‌ను కలుసుకున్నాను. హెచ్ఆర్డీ విభాగం పనులు, విధి విధానాల గురించి నేను ఆయనకు విడమర్చి చెబుతున్నాను. అంతలోనే బాబు నుంచి 15 నిమిషాల్లో వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా ఫోన్ వచ్చింది. నేను ఈలోగా గబాగబా హెచ్చార్డీ విభాగం గురించి తెల్సిన మేరకు ఆయనకు వివరించారు. ఆ తర్వాత ఇద్దరం కలసి సీఎం చంద్ర బాబు వద్దకు వెళ్లాము. హెచ్చార్డీ విభాగం గురించి ఏం తెలుసునని ఆయన్ని బాబు ప్రశ్నించారు. ఆ విభాగం మీద మూడేళ్ల అనుభవం ఉన్నట్లు ప్రసాద్ గారు ముచ్చటగా వివరించారు. వెంటనే ఆయన్ని ఆ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాబు నియమించారు. హెచ్చార్డీ కార్యాలయం జూబ్లీ హిల్స్‌లోని 25వ నెంబర్ రోడ్డులో ఉన్నప్పటికీ ఎలాంటి అందులో ఎలాంటి సదుపాయాలు లేవు. ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ముందుగా కార్యాలయాన్ని అభివద్ధి చేశారు. ఇప్పుడు అందులో ఉన్న సదుపాయాల్లో 90 శాతం ఆయన ఏర్పాటు చేసినవి. కార్యాలయంలో ఏ మూల చూసిన ఆయన ప్రత్యేక ముద్రే నేటికి కనిపిస్తుంది. ప్రసాద్ గారు హెచ్చార్డీ ఆధ్వర్యంలో ‘స్టేట్ ట్రేనింగ్ ఇన్సియేటివ్’ కార్యక్రమం కింద ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ వచ్చారు. అదే కార్యాలయంలో సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెస్ (సీజీజీ)ని ప్రసాద్ ఏర్పాటు చేశారు. దీన్ని అప్పటి ఇంగ్లండ్ ప్రధాన మంత్రి టోని బ్లెయిర్ ఇక్కడికి వచ్చి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కేంద్రం లక్ష్యాలను ఆయన ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోని కూడా టోని బ్లెయిర్ చాలాసేపు చర్చించారు. అలాగే ప్రసాద్, అంతర్జాతీయ కార్మిక సంఘం, వీవీ గిరి నేషనల్ లేబర్ ఇనిస్టిట్యూట్‌తో కలసి రాష్ట్రంలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాను హెచ్చార్డీ బాధ్యతలు స్వీకరించిన ఎనిమిది నెలల కాలంలోనే సంస్థకు ‘ఐఎస్ఓ 9007 2000’ సర్టిఫికెట్ సాధించి పెట్టారు. ఉన్నత ప్రమాణాలను సూచించే ఈ సర్టిఫికెట్ జాతీయ స్థాయిలో ఓ రాష్ట్ర సంస్థకు రావడం బహూశా అదే మొదటి సారి కావచ్చు. అంతటి మహానుభావుడు నేడు మన మధ్యలో లేరని చెప్పడానికి విచారిస్తున్నాను. ఆయన ఆగస్టు 21, అంటే సోమవారం పరమపదించారు. ఆయన తెలుగులో పలు మంచి పుస్తకాలు కూడా రచించారు. నహం కర్త, అసలేం జరిగిందంటే, తిరుమల లీలామతం, తిరుమల చరిత్రామతం పాఠకులను ఆకట్టుకున్నాయి. -- వనం జ్వాలా నరసింహారావు -
రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ఇకలేరు
పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ (77) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్7లోని స్వగృహానికి తరలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ ముఖ్య సలహాదారు పరకాల ప్రభాకర్, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన కుమారుడు సంజీవి ప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, ఎంవీఎస్ ప్రసాద్, చెంగప్ప, రాంబాబు, ఎన్వీ భాస్కర్‌రావు, బీవీ రామారావు, కృష్ణారావు, సత్యనారాయణ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారు. టీటీడీ ఈవోగా తిరుమల విశిష్టతపై పలు రచనలు చేశారు. కేసీఆర్, చంద్రబాబు సంతాపం..: ప్రసాద్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పీవీఆర్కే ప్రసాద్ సమర్థవం తమైన అధికారిగా వ్యవహరించారని, ప్రభుత్వానికి విశేషమైన సేవలు అందిం చారని చంద్రబాబు కొనియాడారు. టీటీడీ ఈవోగా పనిచేసిన కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించారన్నారు. పీవీఆర్కే ప్రసాద్ మృతిపై జగన్ సంతాపం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ (77) మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రసాద్ కుటుంబసభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలు కీలక పదవుల్లో పనిచేసిన ఆయన విధి నిర్వహణలో చిత్తశుద్ధిగా వ్యవహరించారన్నారు. -
నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం
నివాళి తిరుపతిలో టీటీడీ ఈఓగా పనిచేసే రోజుల్లో ప్రసాద్ ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడు ఎవరికీ చెప్పకుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కేసేవారు. తనను కలుసుకోవడానికి వచ్చే అతి సామాన్యుడికి సైతం అసంతృప్తి కలగకుండా మాట్లాడి పంపించేవారు. ప్రధాని వద్ద పనిచేసే రోజుల్లో సొంత పనులకు వెళ్లాల్సి వస్తే, తనే కారు డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయేవారు. రిటైర్ అయిన ఒక ఐఏఎస్ అధికారి విశిష్టత గురించి కొన్ని మాసాలపాటు సీరియల్‌గా రాయాల్సిన వ్యక్తి ఒక్క పత్రి వేంకటరామకృష్ణ ప్రసాద్ మాత్రమే. పీవీఆర్కే ప్రసాద్‌గా బాగా గుర్తింపు పొందిన 1966 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఈ ఆగస్టు 21 తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ కింద ఏర్పడిన హిందూధర్మ పరి రక్షణ ట్రస్టు చైర్మన్‌గా 2015లో బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ ప్రసాద్ ట్రస్టు లక్ష్యాల కోసం విరామం లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. 2015 డిసెంబర్లో, 2017 ఫిబ్రవరిలో సుమారు 60 మంది వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులతో ధార్మిక సదస్సులు నిర్వహించి, ధర్మాచార్యుల్ని ఏకతాటిపై నడిపించే బృహత్కార్యాన్ని సాగిస్తున్నారు. 1980–81లో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నప్పుడు తిరుమల ఆలయంలో మూల విరాట్ విగ్రహానికి అష్టబంధనం జరిగింది. అష్ట బంధనంలో వాడాల్సిన నవరత్నాల సెట్లన్నీ ముందే తెప్పించుకుని పెట్టుకున్నా, అష్ట బంధనం జరిగే కొన్ని గంటల ముందు ఒక సెట్ తక్కువైంది. సమయానికి చెన్నై నుంచి సతీసమేతంగా ఒక వ్యాపారవేత్త నవరత్నాల సెట్‌తో వచ్చి దాన్ని అష్ట బంధనంలో వాడమని కోరాడు. అంతే! వాణ్ణి (శ్రీనివాసుణ్ణి) నమ్ముకుంటే, అన్నీ వాడే ఇస్తాడు, చేస్తాడు అన్న నమ్మకం ప్రసాద్లో పాతుకుపోయింది. ఇదే కాదు. టీటీడీలో కాలినడకన వెళ్లే భక్తులకోసం షెల్టర్లు నిర్మించినా, కొండమీద యాత్రికులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా, నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టినా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ని సుసంపన్నం చేస్తూ నిర్మింపచేసినా, పాపనాశనం డ్యామ్‌ని అధిక ప్రయోజనం లభించేలా నిర్మింపజేసినా, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు తదితరాలను, తిరుమల ఆలయ సేవల్లో కొత్త సేవల్ని, సంస్కరణల్ని తీసుకువచ్చినా, తిరుమల కొండపై మాస్టర్ ప్లాన్ అమలుచేసినా... ఆ ఘనతంతా శ్రీనివాసుడిదే అనేవారు ప్రసాద్. 1985లో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ప్రసాద్ అనేక ఉద్యోగాలకు భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేపట్టారు. అందులో భాగంగా పరీక్షలు, ఇంటర్వ్యూలను జరుపుతున్నప్పుడు ప్రసాద్‌ని బదిలీచేస్తున్నట్లు సమాచారం అందింది. ఉత్తర్వులు చేతికి వచ్చేదాకా నిరీక్షించకుండానే బాధ్యతలను ఆ శాఖ డైరెక్టర్‌కు అప్పగించి వెళ్లిపోయారు. విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా ఉండే రోజుల్లో ఒకసారి కుటుంబంతో పాటు ఆయన ఊరికి వెళ్లి వచ్చారు. వాళ్లకోసం రావల్సిన పోర్టు కారు రైల్వేస్టేషన్‌కి రాలేదు. ‘‘కారు ఎందుకు రాలేదు? పంపాల్సిన వాడు ఎందుకు పంపలేదు? ఎవడు దీనికి బాధ్యుడు..?’’ ఇలాంటి మాటలు మాట్లాడకుండా, వెంటనే ఆటో ఎక్కేసి బంగళాకు వెళ్లి పోయారు. తిరుపతిలో టీటీడీ ఈఓగా పనిచేసే రోజుల్లో కూడా ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎవరికీ చెప్పకుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కేసేవారు. తనను కలుసుకోవడానికి వచ్చే అతి సామాన్యుడికి సైతం అసంతృప్తి కలగకుండా మాట్లాడి పంపించేవారు. ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర పనిచేసే రోజుల్లో ఏదైనా షాపింగ్ లేదా సినిమాలు వంటి సొంత పనులకు వెళ్లాల్సి వస్తే, సొంతంగా కారు డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయేవారు.ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆయన నిరాడంబర జీవితాన్ని సూచిస్తాయి. 1986–87లో ఎక్సైజ్ కమిషనర్‌గా ఉండగా ప్రసాద్ కుమార్తెకు చెన్నైలోని ఒక మెడికల్ కాలేజీలో మెరిట్ ప్రాతిపదికపై సీటు వచ్చింది. కాలేజి మంచిది. కాని ఆ కాలేజి యాజమాన్యం అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో సారా కాంట్రాక్టర్లుగా ఉన్న ఒడయార్స్ బంధు వులది. ప్రసాద్, స్వయంగా ముఖ్యమంత్రి (ఎన్టీ రామారావు)ని కలసి విషయాన్ని లిఖితపూర్వకంగా ఆయన ముందుంచి, ‘‘మీరు విచారణ చేసి, ఇందులో నేను ఎలాంటి అనైతికతకు పాల్పడ్డానని మీకు అనిపించినా నేను ఈ అడ్మిషన్ వదులుకుంటాను’’ అన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం ఆయన పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఆయన ఎక్సైజ్ శాఖలో ఉన్నప్పుడే, లిక్కర్ వ్యాపారం చేసే ఒక బడా వ్యాపారవేత్త తనకు లంచం ఇవ్వాలని ప్రయత్నిస్తే, తక్షణం అవినీతి నిరోధక శాఖకు ఫోన్ చేసి ఆ వ్యాపారవేత్తను పట్టించారు ప్రసాద్. ప్రసాద్, విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా పనిచేస్తున్నప్పుడు కొత్తగా విజిలెన్స్ ఆఫీసర్‌గా వచ్చిన ధిల్లేశ్వరరావు అనే ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి పోర్టులో అవినీతి అధికారుల చిట్టాని ఆయన ముందుంచి ‘‘ఈ చిట్టాలో ఉన్నవాళ్లంతా అవినీతిపరులే. ముందుగా ఎవర్ని ట్రాప్చేయమంటారు సర్’’ అని అడిగారు.ఆ చిట్టా చూసి సంభ్రమంలో మునిగిన ప్రసాద్ చివర్లో ఉన్న తన ప్రైవేట్ సెక్రటరీని ముందు ట్రాప్ చేయమని అడిగారు. అంతే! ఆ ప్రైవేట్ సెక్రటరీ, ఉద్యోగం కోసం తిరుగుతున్న ఒక వ్యక్తి వద్ద లంచం తీసుసుకుంటూ పట్టుబడ్డాడు. నీతివంతమైన పాలన కోసం ప్రసాద్ తాపత్రయపడిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎన్. జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా (1990–92) పనిచేస్తు న్నప్పుడు 12 మెడికల్ కాలేజీలకి అనుమతిస్తున్నారంటూ కోర్టులో కేసు దాఖ లైంది. కోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. జనార్ధన రెడ్డి పదవి కోల్పోయారు. 1996లో ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండగా ప్రసాద్, ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌కు డిమాండు పెరగనున్న దృష్ట్యా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించాలని ప్రతిపాదించారు. జనార్ధన రెడ్డి అనుభవం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు సంకోచించారు. కానీ హేతుబద్ధమైన, నిర్మాణాత్మమైన విధానం ద్వారా ప్రతి రెవెన్యూ డివిజన్‌కి ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఎలా ఏర్పాటు చేయవచ్చో ప్రణాళికను రూపొందించి ప్రసాద్ ముఖ్యమంత్రిని ఒప్పించారు. ఇవ్వాళ తెలుగు విద్యార్థులు ఇంజనీరింగ్ సీట్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లనక్కర లేకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి కారణం ప్రసాద్ దూరదృష్టే. విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా ఆయన బాధ్యత స్వీకరించిన తొలి మూడు సంవత్సరాలపాటు (మొదటిసారిగా) ఆ పోర్టును జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టారు. పోర్టు భవిష్యత్తు (ఖనిజాల నిల్వల) అవసరాల కోసం హార్బర్లోని ఉద్యోగుల కాలనీని నగరం బయటకు తరలించి, ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా, అన్ని యూనియన్లను ఒప్పించి, కొత్త కాలనీలు కట్టించారు. 1984–85లో సాంస్కృతికశాఖ కమిషనర్‌గా కూడా ప్రసాద్ వ్యవహరించారు.సాంస్కృతిక శాఖకి పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా జానపద కళలని ప్రోత్సహించారు. ‘కళామంగళ’ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రతి మంగళవారం ఉచితంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పించే ఏర్పాటు చేశారు. సురభి నాటకసంస్థలు జిల్లాల్లో సంచరిస్తూ నాటకాలు ప్రదర్శించేందుకు ప్రోత్సాహం అందించారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఓరుగల్లు దగ్గర శివరాత్రి నాడు ఆంధ్ర నాట్యాన్ని ప్రదర్శింపజేసి వెలుగులోకి తీసుకొచ్చారు. టీటీడీలో ఉండగా, డాక్టరు మేడసాని మోహన్ వంటి సాహితీవేత్తల్నీ, శోభారాజ్, బాలకృష్ణప్రసాద్ వంటి గాయకుల్ని ప్రోత్సహిస్తూ వెలుగులోకి తీసుకొచ్చారు. సాహిత్యం, కళలు, కళాకారులు ఆయన మనసుకి ఎంతో ఇష్టమైన విషయం. హైదరాబాదులో టీటీడీపరంగా ఉగాది ఉత్సవాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే. పాలనా సామర్థ్యం, దూరదృష్టి, ప్రణాళికారచనలో నైపుణ్యం, నీతి నియమాలు, నిరాడంబరత, సత్యసంధత, నమ్మిన లక్ష్యం కోసం నిలబడే ధైర్యం, నిబద్ధత, సంగీతం, సాహిత్యం, కళలపట్ల మక్కువ, విజయం పరాజయం రెండూ భగవంతుని అనుగ్రహమే అని నమ్మే భక్తి విశ్వాసాలు, ధర్మబద్ధమైన జీవితాన్ని రాబోయే తరాలకి అందించాలన్న తపనతో ధార్మిక ఉద్యమానికి రిటైర్మెంట్ అనంతర జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం... ఇవన్నీ కలబోస్తే కనిపించే రూపం పీవీఆర్కేప్రసాద్. ‘నాహం కర్తా, హరిః కర్తా’, ‘తిరుమలలీలామృతం’, ‘తిరుమలచరితామృతం’, ‘అసలేం జరిగిందంటే...!’ (Wheels Behind the Veil) అనే ఆయన రచనలు ప్రసాద్ సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పట్టేవే. జి. వల్లీశ్వర్, సీనియర్ పాత్రికేయులు ‘ మొబైల్ : 99493 51500 -
రుణమాఫీ, హోదా జిమ్మిక్కు...!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, తెస్తామని చెప్పి తేకపోవడానికి పాలకుల్లో రాజనీతిజ్ఞత లేకపోవడమే కారణమంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మీడియా సలహాదారు పీవీఆర్కే ప్రసాద్. రెండు తెలుగు ప్రాంతాల మధ్య వాతావరణాన్ని ఇంతగా కలుషితం చేసి విభజన చేయటం సరికాదంటున్నారు. రుణమాఫీలు అనేవి ఎక్కడ జరిగినా అవి రాజకీయ జిమ్మిక్కులేనని, మానవీయ కోణంతో కూడిన అభివృద్ధి అవసరమే కానీ అభివృద్ధినే మింగేసే మానవీయ కోణం సమస్యాత్మకం అవుతుందని చెబుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్ష పడాల్సిందే అంటున్న పీవీఆర్కే ప్రసాద్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. పీవీ నరసింహారావును కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఎలా ఎంపిక చేసింది? రాజకీయంగా అప్పటికే పీవీ అస్త్రసన్యాసం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదు. రాజ్యసభలో సీటు ఇచ్చే పరిస్థితి కనబడలేదు. కనబడితే మర్యాద ఇస్తున్నారు తప్పితే విడిగా ఆయన్ని పలకరించేవారు లేకుండా పోయారు. మొదట్నుంచి ఈయనకు గ్రూపు లేదు. తనతో ఉండే ఎంపీలూ లేరు. తన ఓటును తనే వేసుకోవడం పద్ధతి కాదు. ఇలాంటి స్థితిలో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎవరిని ప్రధాని చేయాలనేది పెద్ద సమస్య. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవికి అర్హత ఏమంటే అందరికీ ఆమోదనీయవ్యక్తి కంటే అతి తక్కువ అభ్యంతరాలు ఉన్న వ్యక్తి కావాలి. పీవీ అంటారా.. వెనకాల ఒక మనిషీ లేడు. ఆయనతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసిపడేయవచ్చు. గ్రూపు అనేదే లేదు. పైగా పెద్దవాడు. సీనియర్ పర్సన్, వివాదరహితుడు కాబట్టి ప్రధాని పదవిలో పెడదాం అని నిర్ణయించారు. కానీ పదవిలోకి వచ్చాక చూస్తుండగానే బలపడటమే కాక, దేశానికే ఒక దశా, దిశను ఇచ్చి బాగా నిర్వహిస్తూ మైనారిటీ ప్రభుత్వంలోనూ సంస్కరణలు అమలు చేస్తూ గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చి అయిదేళ్లు పాలన సాగించారు. విభజనపై మీ వ్యాఖ్య ఏమిటి? విభజన అనేది అది గత జలసేతు బంధనం. కానీ చెడు వాతావరణం కల్పించి విభజన చేయాల్సి ఉండింది కాదు. 1960ల చివరలో వచ్చిన ఆంధ్రా ఆందోళన కాలంలోనే విభజన చేసి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. ఆ తర్వాత అయినా ఇరువర్గాలనూ పిలిచి కూర్చోబెట్టి వేరు చేసి ఉంటే సరిపోయేది. ఇవేమీ చేయకపోగా వాతావరణాన్ని ఇంతగా దిగజార్చి చేయడం అనవసరం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారు కదా? ఆనాడు వాగ్దానం చేసిన వారికి నిబంధనల ప్రకారం అలాంటిది లేదనే విషయం తెలియదా? రాజనీతిజ్ఞత లేకపోవడమే దీనంతటికీ కారణం. నిజంగా హోదా ఇవ్వదలుచుకుంటే ఏ రూల్స్ కూడా అడ్డురావు. ఇది మంచిది ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. ఏదో ఒక లబ్ధి కోసమే ఏదైనా చేస్తారు. నిజంగా ఆ లబ్ధే వస్తే.. హోదా ఇస్తే ఏమి, లేకపోతే ఏమి? హోదాకు సమానమైన ప్రయోజనం పూర్తిగా ఇవ్వగలిగితే హోదా అవసరం లేదు. కానీ ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ సమస్య అయి కూర్చుంది. నిజంగా హోదావల్ల వచ్చేవన్నీ మామూలుగా వస్తే ఇక హోదా అవసరం ఎందుకు? కానీ హోదాతో పని లేని ప్రయోజనాలు ఇస్తున్నారా, ఇవ్వలేదా అన్నదే ఇక్కడ పాయింటు. పలు రాష్ట్రాలకు హోదా కల్పించాక అవి ఎంతో లబ్ది పొందాయి కదా? ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిన అర్హత ఆంధ్రప్రదేశ్‌కు రాదు. సమస్య ఏమిటంటే హోదా వస్తుంది, ఇస్తామని చెప్పేశారు. ఇస్తామని డిక్లేర్ చేసినప్పుడు ఆ మాటకు అందరూ కట్టుబడాలి. కానీ అధికారంలో లేనప్పుడు చేసే వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చాక పాలనా పరంగా అమలు చేయాల్సి వచ్చేటప్పటికీ చాలా తేడా ఉంటుందన్నది ఇక్కడ మనకే కాదు రేపు అమెరికాలో వాళ్లకు కూడా తెలుసు. ఎందుకంటే పరిస్థితులు అలాంటివి. పెద్ద నోట్ల రద్దుపై మీ అభిప్రాయం? దేశానికి మంచిది. కానీ ఎవరికీ ఇబ్బంది లేకుండా జరుగుతుందన్నది మాత్రం వాస్తవం కాదు. మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది గ్రామస్థాయి వరకు ఇంకా పూర్తిస్థాయిలో వెళ్లలేదు. ప్రభుత్వం ఏదో ఇస్తామంటే వెళ్లి ఖాతాలు తెరిచారు తప్పితే ఖాతాలు ఆపరేట్ చేసుకోవడానికి తీసుకునేవారు లేరు. పైగా నగదు లావాదేవీలపైనే చాలామంది ఆధారపడి ఉన్నారు. వాటిని కాస్త సరళీకరించి, జనానికి ఇబ్బందులు లేకుండా చేయగలిగితే నోట్ల రద్దు విజయవంతమవుతుంది. దేశంలో కోట్లమంది పేదలున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా? ఇబ్బందిపడుతున్నారు. ఇంత భారీ మార్పు జరిగినప్పుడు తప్పకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ దానికి మూల్యం అన్ని రాజకీయ పార్టీలు చెల్లించాల్సి వస్తుంది కూడా. ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది కదా? ఎక్కడ కుదేలైంది? ఏమీ కాలేదు. నాలుగు రోజులు గడిచేసరికి కార్డు ఎలా ఉపయోగిస్తాం, చెక్కు ఎలా రాస్తాం అని తెలుసుకుంటున్నారు. మన ప్రతిఘటన అంతా ఎక్కడ వస్తోందంటే.. ఖాతా ఉన్నవాడు నగదు తీసుకుని ఇద్దామనుకుంటున్నాడు తప్పితే చెక్కు ఇచ్చి తీసుకుందాం అనుకోవడం లేదు. ఏపీ, తెలంగాణలో రుణమాఫీలపై మీ అభిప్రాయం? ఏపీలోనే కాదు, తెలంగాణలోనే కాదు. ఏ రాష్ట్రంలో ఇలాంటివి జరిగినా సరే ఇలాంటివి రాజకీయ జిమ్మిక్కులే. రుణమాఫీ వంటివి ఆర్థిక వ్యవస్థకు మంచివి కాదు. అప్పు అంటే అప్పేనండీ. ఒకసారి నువ్వు అçప్పు తీసుకున్నాక, దాన్ని చెల్లించాలి. పంట పోతే రుణం మాఫీ చేయాలి. అంతే కానీ ఎన్నికలప్పుడు రుణమాఫీలు ఏమిటి? బాబు వంటి సీనియర్ నేత కూడా రుణ మాఫీపై వాగ్దానం చేశారు కదా? ఆయన ఎంతో డెవలప్ చేసానని చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనే సీట్లు రాకపోతే, గెలవాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లి గెలిచాక కొన్ని స్కీములు అమలు చేశారు. ఎలాంటి స్కీములు పెడితే ఎలాంటి వాళ్లు ఆకర్షితులవుతారో తెలిసింతర్వాత అందరూ అలాంటి స్కీములకు ప్రయత్నిస్తారు. ఒక విషయం గుర్తించాలి. మానవీయ కోణంతో కూడిన అభివృద్ధిని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తే మంచిదే. కానీ అభివృద్ధినే మింగేసే హ్యూమన్ ఫేస్ ఉంటే కష్టమైపోతుంది. ఓటుకు కోట్లుపై మీ వ్యాఖ్య? కెమెరాలలో జరిగిన ఘటనను, పద్ధతిని చూసినవారికి అక్కడేదో తప్పు జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ అది ఎంతవరకు, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు చేయించారు అనేది చట్టమే నిర్ణయిం చాలి. అది ఇప్పటికే న్యాయ విచారణ ప్రక్రియలో ఉంది. అలాంటప్పుడు ఘటనలో ఉన్న వారినీ విమర్శించి, అటు చట్టాన్నీ విమర్శించే పని పెట్టుకోవడం సరైంది కాదు. కానీ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు మీద మీ వ్యాఖ్య? భవిష్యత్తు తప్పకుండా బాగానే ఉంటుంది. కనీసం అభివృద్ధి విషయంలో ఇద్దరూ పోటీపడుతున్నారు. చేద్దామని ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తూ రెండేళ్ల క్రితం ఉన్న ద్వేషభావం ఇప్పుడు అంతగా లేదు. కొంతలో కొంత సర్దుకున్నారు. అభివృద్ధి చేసుకుంటూ పోతే ఎక్కడున్నా ఇబ్బంది లేదనే ఫీలింగు జనంలో ఉంది. ఉన్న పెట్టుబడులు పోవు. రెండుచోట్లా మదుపు పెట్టవచ్చు అనే అభిప్రాయం కూడా వచ్చేసింది. అందరూ పనిచేస్తే రెండు రాష్ట్రాలూ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. (పీవీఆర్కే ప్రసాద్‌తో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకులో చూడండి) https:// www. youtube. com/ watch? v= qMSpP7 kSmzo