రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్‌కే ప్రసాద్ ఇకలేరు
- పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్ (77) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్7లోని స్వగృహానికి తరలించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ ముఖ్య సలహాదారు పరకాల ప్రభాకర్, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన కుమారుడు సంజీవి ప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, ఎంవీఎస్ ప్రసాద్, చెంగప్ప, రాంబాబు, ఎన్‌వీ భాస్కర్‌రావు, బీవీ రామారావు, కృష్ణారావు, సత్యనారాయణ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారు. టీటీడీ ఈవోగా తిరుమల విశిష్టతపై పలు రచనలు చేశారు.
కేసీఆర్, చంద్రబాబు సంతాపం..: ప్రసాద్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పీవీఆర్‌కే ప్రసాద్ సమర్థవం తమైన అధికారిగా వ్యవహరించారని, ప్రభుత్వానికి విశేషమైన సేవలు అందిం చారని చంద్రబాబు కొనియాడారు. టీటీడీ ఈవోగా పనిచేసిన కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించారన్నారు.
పీవీఆర్‌కే ప్రసాద్ మృతిపై జగన్ సంతాపం
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో పీవీఆర్‌కే ప్రసాద్ (77) మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రసాద్ కుటుంబసభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలు కీలక పదవుల్లో పనిచేసిన ఆయన విధి నిర్వహణలో చిత్తశుద్ధిగా వ్యవహరించారన్నారు.