నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం | G Valliswar pays tribute to TTD ex EO PVRK prasad | Sakshi
Sakshi News home page

నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం

Published Tue, Aug 22 2017 1:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం

నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం

నివాళి
తిరుపతిలో టీటీడీ ఈఓగా పనిచేసే రోజుల్లో ప్రసాద్‌ ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడు ఎవరికీ చెప్పకుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కేసేవారు. తనను కలుసుకోవడానికి వచ్చే అతి సామాన్యుడికి సైతం అసంతృప్తి కలగకుండా మాట్లాడి పంపించేవారు. ప్రధాని వద్ద పనిచేసే రోజుల్లో సొంత పనులకు వెళ్లాల్సి వస్తే, తనే కారు డ్రైవ్‌ చేసుకుని వెళ్లిపోయేవారు.

రిటైర్‌ అయిన ఒక ఐఏఎస్‌ అధికారి విశిష్టత గురించి కొన్ని మాసాలపాటు సీరియల్‌గా రాయాల్సిన వ్యక్తి ఒక్క పత్రి వేంకటరామకృష్ణ ప్రసాద్‌ మాత్రమే. పీవీఆర్‌కే ప్రసాద్‌గా బాగా గుర్తింపు పొందిన 1966 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి ఈ ఆగస్టు 21 తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయశాఖ కింద ఏర్పడిన హిందూధర్మ పరి రక్షణ ట్రస్టు చైర్మన్‌గా 2015లో బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ ప్రసాద్‌ ట్రస్టు లక్ష్యాల కోసం విరామం లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. 2015 డిసెంబర్‌లో, 2017 ఫిబ్రవరిలో సుమారు 60 మంది వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులతో ధార్మిక సదస్సులు నిర్వహించి, ధర్మాచార్యుల్ని ఏకతాటిపై నడిపించే బృహత్కార్యాన్ని సాగిస్తున్నారు.

1980–81లో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నప్పుడు తిరుమల ఆలయంలో మూల విరాట్‌ విగ్రహానికి అష్టబంధనం జరిగింది. అష్ట బంధనంలో వాడాల్సిన నవరత్నాల సెట్లన్నీ ముందే తెప్పించుకుని పెట్టుకున్నా, అష్ట బంధనం జరిగే కొన్ని గంటల ముందు ఒక సెట్‌ తక్కువైంది. సమయానికి చెన్నై నుంచి సతీసమేతంగా ఒక వ్యాపారవేత్త నవరత్నాల సెట్‌తో వచ్చి దాన్ని అష్ట బంధనంలో వాడమని కోరాడు. అంతే! వాణ్ణి (శ్రీనివాసుణ్ణి) నమ్ముకుంటే, అన్నీ వాడే ఇస్తాడు, చేస్తాడు అన్న నమ్మకం ప్రసాద్‌లో పాతుకుపోయింది.

ఇదే కాదు. టీటీడీలో కాలినడకన వెళ్లే భక్తులకోసం షెల్టర్లు నిర్మించినా, కొండమీద యాత్రికులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా, నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టినా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ని సుసంపన్నం చేస్తూ నిర్మింపచేసినా, పాపనాశనం డ్యామ్‌ని అధిక ప్రయోజనం లభించేలా నిర్మింపజేసినా, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు తదితరాలను, తిరుమల ఆలయ సేవల్లో కొత్త సేవల్ని, సంస్కరణల్ని తీసుకువచ్చినా, తిరుమల కొండపై మాస్టర్‌ ప్లాన్‌ అమలుచేసినా... ఆ ఘనతంతా శ్రీనివాసుడిదే అనేవారు ప్రసాద్‌. 1985లో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ప్రసాద్‌ అనేక ఉద్యోగాలకు భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్‌ చేపట్టారు. అందులో భాగంగా పరీక్షలు, ఇంటర్వ్యూలను జరుపుతున్నప్పుడు ప్రసాద్‌ని బదిలీచేస్తున్నట్లు సమాచారం అందింది. ఉత్తర్వులు చేతికి వచ్చేదాకా నిరీక్షించకుండానే బాధ్యతలను ఆ శాఖ డైరెక్టర్‌కు అప్పగించి వెళ్లిపోయారు.

విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా ఉండే రోజుల్లో ఒకసారి కుటుంబంతో పాటు ఆయన ఊరికి వెళ్లి వచ్చారు. వాళ్లకోసం రావల్సిన పోర్టు కారు రైల్వేస్టేషన్‌కి రాలేదు. ‘‘కారు ఎందుకు రాలేదు? పంపాల్సిన వాడు ఎందుకు పంపలేదు? ఎవడు దీనికి బాధ్యుడు..?’’ ఇలాంటి మాటలు మాట్లాడకుండా, వెంటనే ఆటో ఎక్కేసి బంగళాకు వెళ్లి పోయారు. తిరుపతిలో టీటీడీ ఈఓగా పనిచేసే రోజుల్లో కూడా ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎవరికీ చెప్పకుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కేసేవారు. తనను కలుసుకోవడానికి వచ్చే అతి సామాన్యుడికి సైతం అసంతృప్తి కలగకుండా మాట్లాడి పంపించేవారు. ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర పనిచేసే రోజుల్లో ఏదైనా షాపింగ్‌ లేదా సినిమాలు వంటి సొంత పనులకు వెళ్లాల్సి వస్తే, సొంతంగా కారు డ్రైవ్‌ చేసుకుని వెళ్లిపోయేవారు.ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆయన నిరాడంబర జీవితాన్ని సూచిస్తాయి.

1986–87లో ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఉండగా ప్రసాద్‌ కుమార్తెకు చెన్నైలోని ఒక మెడికల్‌ కాలేజీలో మెరిట్‌ ప్రాతిపదికపై సీటు వచ్చింది. కాలేజి మంచిది. కాని ఆ కాలేజి యాజమాన్యం అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో సారా కాంట్రాక్టర్లుగా ఉన్న ఒడయార్స్‌ బంధు వులది. ప్రసాద్, స్వయంగా ముఖ్యమంత్రి (ఎన్టీ రామారావు)ని కలసి విషయాన్ని లిఖితపూర్వకంగా ఆయన ముందుంచి, ‘‘మీరు విచారణ చేసి, ఇందులో నేను ఎలాంటి అనైతికతకు పాల్పడ్డానని మీకు అనిపించినా నేను ఈ అడ్మిషన్‌ వదులుకుంటాను’’ అన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం ఆయన పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఆయన ఎక్సైజ్‌ శాఖలో ఉన్నప్పుడే, లిక్కర్‌ వ్యాపారం చేసే ఒక బడా వ్యాపారవేత్త తనకు లంచం ఇవ్వాలని ప్రయత్నిస్తే, తక్షణం అవినీతి నిరోధక శాఖకు ఫోన్‌ చేసి ఆ వ్యాపారవేత్తను పట్టించారు ప్రసాద్‌.

ప్రసాద్, విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా పనిచేస్తున్నప్పుడు కొత్తగా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా వచ్చిన ధిల్లేశ్వరరావు అనే ఒక మాజీ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి పోర్టులో అవినీతి అధికారుల చిట్టాని ఆయన ముందుంచి ‘‘ఈ చిట్టాలో ఉన్నవాళ్లంతా అవినీతిపరులే. ముందుగా ఎవర్ని ట్రాప్‌చేయమంటారు సర్‌’’ అని అడిగారు.ఆ చిట్టా చూసి సంభ్రమంలో మునిగిన  ప్రసాద్‌ చివర్లో ఉన్న తన ప్రైవేట్‌ సెక్రటరీని ముందు ట్రాప్‌ చేయమని అడిగారు. అంతే! ఆ ప్రైవేట్‌ సెక్రటరీ, ఉద్యోగం కోసం తిరుగుతున్న ఒక వ్యక్తి వద్ద లంచం తీసుసుకుంటూ పట్టుబడ్డాడు. నీతివంతమైన పాలన కోసం ప్రసాద్‌ తాపత్రయపడిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.

ఎన్‌. జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా (1990–92) పనిచేస్తు న్నప్పుడు 12 మెడికల్‌ కాలేజీలకి అనుమతిస్తున్నారంటూ కోర్టులో కేసు దాఖ లైంది. కోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. జనార్ధన రెడ్డి పదవి కోల్పోయారు. 1996లో ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండగా ప్రసాద్, ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు డిమాండు పెరగనున్న దృష్ట్యా ఇంజనీరింగ్‌ కాలేజీలు ప్రారంభించాలని ప్రతిపాదించారు. జనార్ధన రెడ్డి అనుభవం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు సంకోచించారు. కానీ హేతుబద్ధమైన, నిర్మాణాత్మమైన విధానం ద్వారా ప్రతి రెవెన్యూ డివిజన్‌కి ఒక ఇంజనీరింగ్‌ కాలేజీని ఎలా ఏర్పాటు చేయవచ్చో ప్రణాళికను రూపొందించి ప్రసాద్‌ ముఖ్యమంత్రిని ఒప్పించారు.

ఇవ్వాళ తెలుగు విద్యార్థులు ఇంజనీరింగ్‌ సీట్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లనక్కర లేకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయడానికి కారణం ప్రసాద్‌ దూరదృష్టే. విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా ఆయన బాధ్యత స్వీకరించిన తొలి మూడు సంవత్సరాలపాటు (మొదటిసారిగా) ఆ పోర్టును జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టారు. పోర్టు భవిష్యత్తు (ఖనిజాల నిల్వల) అవసరాల కోసం హార్బర్‌లోని ఉద్యోగుల కాలనీని నగరం బయటకు తరలించి, ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా, అన్ని యూనియన్లను ఒప్పించి, కొత్త కాలనీలు కట్టించారు.

1984–85లో సాంస్కృతికశాఖ కమిషనర్‌గా కూడా ప్రసాద్‌ వ్యవహరించారు.సాంస్కృతిక శాఖకి పునర్‌వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా జానపద కళలని ప్రోత్సహించారు. ‘కళామంగళ’ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ప్రతి మంగళవారం ఉచితంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పించే ఏర్పాటు చేశారు. సురభి నాటకసంస్థలు జిల్లాల్లో సంచరిస్తూ నాటకాలు ప్రదర్శించేందుకు ప్రోత్సాహం అందించారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఓరుగల్లు దగ్గర శివరాత్రి నాడు ఆంధ్ర నాట్యాన్ని ప్రదర్శింపజేసి వెలుగులోకి తీసుకొచ్చారు. టీటీడీలో ఉండగా, డాక్టరు మేడసాని మోహన్‌ వంటి సాహితీవేత్తల్నీ, శోభారాజ్, బాలకృష్ణప్రసాద్‌ వంటి గాయకుల్ని ప్రోత్సహిస్తూ వెలుగులోకి తీసుకొచ్చారు. సాహిత్యం, కళలు, కళాకారులు ఆయన మనసుకి ఎంతో ఇష్టమైన విషయం. హైదరాబాదులో టీటీడీపరంగా ఉగాది ఉత్సవాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే.

పాలనా సామర్థ్యం, దూరదృష్టి, ప్రణాళికారచనలో నైపుణ్యం, నీతి నియమాలు, నిరాడంబరత, సత్యసంధత, నమ్మిన లక్ష్యం కోసం నిలబడే ధైర్యం, నిబద్ధత, సంగీతం, సాహిత్యం, కళలపట్ల మక్కువ, విజయం పరాజయం రెండూ భగవంతుని అనుగ్రహమే అని నమ్మే భక్తి విశ్వాసాలు, ధర్మబద్ధమైన జీవితాన్ని రాబోయే తరాలకి అందించాలన్న తపనతో ధార్మిక ఉద్యమానికి రిటైర్‌మెంట్‌ అనంతర జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం... ఇవన్నీ కలబోస్తే కనిపించే రూపం పీవీఆర్‌కేప్రసాద్‌.
 
‘నాహం కర్తా, హరిః కర్తా’, ‘తిరుమలలీలామృతం’, ‘తిరుమలచరితామృతం’, ‘అసలేం జరిగిందంటే...!’ (Wheels Behind the Veil) అనే ఆయన రచనలు ప్రసాద్‌ సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పట్టేవే.


జి. వల్లీశ్వర్, సీనియర్‌ పాత్రికేయులు ‘ మొబైల్‌ : 99493 51500

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement