అభిప్రాయం
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరాక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఫైళ్లను కాల్చివేయడం ఒక ఆనవాయితీగా మారినట్లు కనిపిస్తోంది. మదనపల్లె రెవెన్యూ డివిజన్ ఆఫీస్‌లో రికార్డులు తగలబడితే ఏకంగా డీజీపీ, సీఎస్‌లు హెలికాప్టర్‌లో అక్కడకు వెళ్లడం ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తోంది. చంద్రబాబు నాయుడు తన తరహా మార్కు రాజకీయాలను చూపించడంలో దిట్ట.
వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు జరగలేదనే సంగతి నూతన ప్రభుత్వం ఏర్పడిన వారం పది రోజుల్లోనే ప్రభుత్వ పెద్దలందరికీ అర్థమైంది. తాము చేసిన ఆరోపణలను నిరూపించడానికి దారిలేక రికార్డులను వాళ్లే తగలబెట్టిస్తున్నట్లుంది. ‘వైసీపీవాళ్లు... వాళ్లు చేసిన అక్రమాలు బయటపడకుండా ఫైళ్లను తగలబెట్టిస్తున్నార’నే ప్రచారం చేయడానికి ఈ తరహా దహన కార్యక్రమాలు చేపడు తున్నా రనేది ప్రజల అవగాహన.
ఎన్నికల ఫలితాల ప్రకటనకు, ప్రమాణ స్వీకారానికి మధ్య వారం రోజుల వ్యవధి ఉంది. ఈ వ్యవధిలోనే గతంలో వారికి వచ్చిన సమాచారాన్ని సరిచూసుకునే వెసులుబాటు కలిగింది. అందులో భాగంగానే 20 ఏళ్ల తరు వాత 22 ఏ భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా తెరపైకి తీసుకొచ్చి జగన్ మీద తాము చేసిన తప్పుడు ప్రచారానికి వాస్తవ రూపం తీసుకురావాలని భావించారు.
అందులో భాగంగా అధికార యంత్రాంగాన్ని 24/7 పనిచేయించి రికార్డులను జల్లెడపట్టారు. ఎక్కడా లోపం లేకపోవడంతో రికార్డులను కాల్చివేతకు పూనుకుంటున్నారు. నేరం మాత్రం వైఎస్సార్‌సీపీపై వేస్తున్నారు. అయితే, దొంగ ఎక్కడో ఒకచోట తప్పు చేస్తాడన్న నిజాన్ని ఇక్కడ వారు మరచి పోయారు. ఫిజికల్‌గా ఉన్న ఫైళ్లను తగులబెట్టారేగానీ ఆన్‌లైన్‌లో ఉన్న ఫైళ్ల సంగతిని మరచిపోయినట్లు ఉన్నారు.
అదీకాకుండా ఇదే ఫైలుకు సంబంధించిన వివరాలు కింద ఉండే ఎమ్మార్వో కార్యాలయంలోనూ, పైన ఉండే కలెక్టర్ కార్యాలయంలోనూ ఉంటాయి. వాటిని ఏం చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే ఆ వాస్తవం ప్రజలకు తెలుస్తుందని గమనించి బాబు తదితరులు ఇదే తరహాలో మరికొన్ని ఘటనలు చూపి ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కొంతమంది అధికారులపై వారికి తెలియకుండానే విచారణ నిర్వహించారు. వారి విచారణలో ఏం తేలకపోయినా వారి అరెస్టులు, విచారణలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 16 మంది ఐపీఎస్‌లకు మెమో జారీ చేశారు.
అనూహ్య పరిణామాల నేపథ్యంలో అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు... జగన్ పార్టీని ఎలాగైనా భూస్థాపితం చేయాలని ప్రయత్నిస్తు న్నట్లుంది. వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతలు, ఎప్పుడో రెండు మూడేళ్ల క్రితం మూసేసిన కేసులు తిరగదోడటం, ఆ పార్టీ కార్యకర్తలపై తమ పార్టీ కార్యకర్తలతో దాడులు చేయించడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం... వంటివన్నీ ఇందులో భాగమే.
‘సూపర్ సిక్స్’ అమలును వదిలి అమరావతి రాజధానిపై దృష్టిపెట్టడం, కళాశాల ఫీజుల పెంపు నిర్ణయం... ఇలా అనేక అంశాలపై ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిని గమనించిన ప్రజలు ఇప్పుడు పేదలకు–పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటూ జగన్ చేసిన కామెంట్‌ను గుర్తు చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణగా రాజధాని ప్రాంతం ఆర్5 జోన్‌లో పేదలకు ఇచ్చిన ఇళ్లను చంద్ర బాబు సర్కార్ రద్దుచేసిన అంశాన్ని ప్రజలు చూపిస్తున్నారు.
తిరుమల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు వాడితే తప్పన్న బాబు... చంద్రగిరి అభివృద్ధికి ఇప్పుడు ఇవే నిధులు వాడుతున్నారు. ఉపాధ్యాయులతో మరుగు దొడ్ల ఫొటోలు తీయించడంపై తప్పుబట్టిన బాబు సచివాలయ ఉద్యోగులతో ఇదే పని చేయిస్తున్నారు. ఇసుకను తమ నేతలకు దోచి పెడుతున్న విషయాన్నీ ప్రజలు గమనిస్తు న్నారు. నిజంగా ప్రజల్లో ఇంత త్వరగా ప్రస్తుత ప్రభుత్వంపై పెదవి విరుపు వస్తుందని ఎవరూ ఊహించలేదు.
పాలనపై దృష్టిపెట్టాల్సిన పాలకులు వ్యక్తిగత కక్షలపై దృష్టిపెట్టడంతో పాలన అస్తవ్యస్తమవుతోంది. పాత పథకాలు నిలిచిపోవడం ఒక వైపు, ఎప్పుడు ఎవరు ఎవరిని కొడతారో, చంపుతారో తెలియని పరిస్థితి మరోవైపు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ స్థితిలో ప్రజాదరణ పొందిన వాలంటీర్ వ్యవస్థను తీసేసి మళ్లీ ‘జన్మభూమి–2’ తీసుకురావాలని అను కోవడం సరికాదు. ఇదీ మొత్తంగా రెండు నెలల నారా వారి పాలన సాధించిన ఘనకార్యం.
పూనూరు గౌతమ్ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్: 98481 05455
Comments
Please login to add a commentAdd a comment