వేయి గొంతుకల విప్లవ శంఖం! | Vardelli Murali Write Article On CM Ys Jagan Flagged 1088 Ambulances | Sakshi
Sakshi News home page

వేయి గొంతుకల విప్లవ శంఖం!

Published Sun, Jul 5 2020 12:56 AM | Last Updated on Sun, Jul 5 2020 1:12 AM

Vardelli Murali Write Article On CM Ys Jagan Flagged 1088 Ambulances - Sakshi

సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం బాగుంటుంది. అది నిత్య నూతనం, ఉత్తేజపూరితం. చూడగలిగితే విప్లవం ప్రభవిస్తున్న దృశ్యం కూడా చాలా బాగుంటుంది. అది నవోన్మేష సత్యం. మహోత్తేజపూరితం. దృశ్యం ఏదైనా కావచ్చు. ఆ దృశ్యంతో చుట్టరికం కలిగిన పరిణామాలు, ఆ పరిణామాల చుట్టూ అల్లుకున్న ఒక తాత్విక చింతన అనతికాలంలోనే ఆ రంగాన్ని ఆమూలాగ్రం సంస్కరించబోతున్నాయని గ్రహించగలిగే చైతన్యం ఉంటే, విప్లవ జనన దృశ్యాన్ని ఎవరైనా చూడవచ్చు. అలాంటి ఒక దృశ్యమే మొన్న విజయవాడ వీధుల్లో కనువిందు చేసింది. అంగడి సరుకుగా మారిపోతున్న వైద్యరంగంలో పెను మార్పులకు దండోరా వేస్తూ ప్రజారోగ్య రథయాత్ర మాదిరిగా 1088 అంబులెన్స్‌ల సేవా యాత్ర మొదలైంది. సంక్షుభిత ప్రజారోగ్య రంగంలో అదొక వేయి గొంతుకల విప్లవ శంఖం.

ఈ దేశంలో వ్యవసాయరంగం తర్వాత, అదేస్థాయిలో తీవ్ర సంక్షోభంలో కూరుకొనిపోయిన రంగం ఏదంటే ముందుగా చెప్పవలసింది ప్రజారోగ్య రంగం గురించే. ఆ తర్వాతనే విద్యారంగం. బ్రిటిష్‌ కాలంలో భారతీయ వైద్యవిధానం నిర్లక్ష్యానికి గురైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దానికి ప్రోత్సాహం లభించలేదు. పైగా నాటువైద్యంగా ఈసడింపుల పాలైంది. వేల సంవత్సరాల పాటు భారతీయ సమాజపు ఆరోగ్యానికి రక్షణ కవచంగా నిలిచింది ఆ వైద్య విధానమేనన్న సంగతి మరచిపోరాదు. అటువంటి వైద్యుడు లేని ఊరిలో నివసించకూడదు సుమా అని సుమతీ శతకకారుడు హెచ్చరించాడు కూడా. పాతతరం ప్రజలందరికీ ఆ పద్యం కంఠో పాఠం. శతాబ్దాలపాటు ఎటువంటి పరిశోధనలు లేకుండా, అధ్యయనాలు లేకుండా వదిలేసిన ఫలితంగా మారుతున్న సమాజంతో పరుగెత్తలేక, దేశీయ సంప్రదాయ వైద్యవిధానం చతికిలబడిపోయింది. 

కానీ, శాస్త్రీయ అల్లోపతి వైద్యవిధానం ప్రాథమిక స్థాయిలో ఆ స్థానాన్ని ఇప్పటికీ భర్తీ చేయలేక పోయింది. దాని ఫలితమే వైద్యరంగ సంక్షోభం. స్వాతంత్య్రం వచ్చిన 34 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2000 సంవత్సరం నాటికి పౌరులందరికీ ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తేవడమే విధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కాలంలోనే తెలుగులో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు...’ అనే పాట సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఆ పాట సన్నివేశం వచ్చినప్పుడు ప్రేక్ష కుల ఈలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లాయి. మొదటి ఆరోగ్య విధానం (1983–2003) సాధించిన విజయాలకు ఇంత కంటే గొప్ప ఉదాహరణ ఉండబోదు. కొన్ని మార్పు చేర్పులతో 2003లో రెండో ఆరోగ్య విధానాన్ని కేంద్రం ప్రకటించింది.

ప్రస్తుతం ప్రభుత్వరంగంలో మూడంచెల ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉంది. ఆ పైస్థాయి వాటిని రెఫరల్‌ ఆస్ప త్రులుగా పరిగణిస్తారు. తొలిదశలో రెండు లేదా మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఆరోగ్య ఉపకేంద్రం ఉంటుంది. ఉప కేంద్రంలో ఏఎన్‌ఎమ్‌తోపాటు ఆశ వర్కర్లు ఉంటారు. ఆపై దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఇవి కొంచెం అటూఇటుగా మండలానికి రెండు చొప్పున ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ నిబంధనల ప్రకారం ప్రాథమిక కేంద్రాల్లో వైద్యాధికారితోపాటు 14 మంది సిబ్బంది ఉండాలి. వీటి పైస్థాయిలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉంటాయి. వీటి సంఖ్య మన రాష్ట్రాల్లో ఇంచుమించు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉన్నాయి. 

నిబంధనల ప్రకారం ఈ కేంద్రాల్లో ఒక సర్జన్, ఒక ఫిజీషియన్, గైనకాలజిస్టు, పిల్లల వైద్యనిపుణులు, 21 మంది పారా మెడికల్‌ సిబ్బంది ఉండాలి. 30 పడకల వసతి, ఆపరేషన్‌ థియేటర్, ఎక్స్‌–రే, ప్రసూతి గది, లేబొరేటరీ తదితర సౌకర్యాలు ఉండాలి. నిబంధనలు ఎలా ఉన్నా ఆచరణలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సిబ్బంది లేక, సౌకర్యాలు లేక అధానస్థితికి చేరుకుని, వెళ్లాలంటేనే ప్రజలు భయ పడి పోయే పరిస్థితి ఏర్పడింది. తొలిసారి జాతీయ ఆరోగ్య విధానాన్ని ప్రకటించినప్పుడు ప్రాథమిక వైద్యంలో ప్రైవేట్‌ సంస్థల పాత్ర పరిమితంగానే ఉండాలన్న సూచనను చేర్చారు. కానీ ప్రభుత్వాసుపత్రుల వైఫల్యం కారణంగా ప్రాథమిక వైద్యం లోనూ ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు ప్రవేశించడానికి మార్గం ఏర్పడింది.

ప్రజారోగ్య రంగంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా తొలి రోజుల్లో ప్రశంసనీయమైన పాత్రనే పోషించాయి. 1980 తర్వాతనే మెజారిటీ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాపార ధోరణి ప్రబలింది. తెలుగు రాష్ట్రాల్లోని తొలితరం డాక్టర్లలో స్వాతం త్య్రోద్యమ ప్రభావం, కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావం బలంగా ఉండేవి. ఎంతోమంది డాక్టర్లు ఉన్నతాశయాలతోనే ఆస్పత్రులు ప్రారంభించారు. కేవలం రూపాయి, రెండు రూపాయల కన్సల్టేషన్‌ ఫీజుతోనే రోగులకు చికిత్స చేసిన డాక్టర్లు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేకమంది ఉండేవారు. రాజకీయ రంగప్రవేశం చేయకముందు వైద్యసేవలు అందించిన డాక్టర్‌ రాజశేఖరరెడ్డికి రూపాయి డాక్టర్‌ అని జనంలో పేరుం డేదని ఇప్పటికీ చెప్పుకుంటారు. నెల్లూరులో డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి స్థాపించిన ప్రజావైద్యశాలలో శిక్షణ పొందిన అనేకమంది డాక్టర్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆస్పత్రులు నెలకొల్పి అదేతరహా సేవలను అందించారు. 

ఆర్‌ఎమ్‌పీ, పీఎమ్‌పీల పేర్లతో గ్రామాల్లో పనిచేస్తున్న వారికి ఈ ఆదర్శ డాక్టర్లు పునశ్చరణ తరగతులు నిర్వహించి వారి నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టేవారు. ఆవిధంగా పల్లెసీమల్లో అంతర్ధానమవుతున్న సంప్రదాయ వైద్యుల స్థానాన్ని శిక్షణ పొందిన ఆర్‌ఎమ్‌పీ, పీఎమ్‌పీలతో భర్తీ చేసే ప్రయత్నాన్ని తొలితరం డాక్టర్లు చేయగలిగారు. వైద్యుల తరం మారడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల ఫలితాలు వైద్యరంగం మీద కూడా ప్రభావం చూపాయి. వ్యాపార సంస్కృతి క్రమంగా వేళ్లూనుకోవడం ప్రారంభమై అచిర కాలంలోనే వటవృక్షంలా మారిపోయింది. కార్పొరేట్‌ ఆస్ప త్రులు విస్తరించాయి. గ్రామీణ వైద్యులకు ‘రెఫరల్‌ ఫీజు’ను ఎరగా వేశాయి. 

ఊళ్లో వైద్యం చేస్తే పేషెంట్లు తమకిచ్చే ఫీజుకన్నా కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇచ్చే ‘రెఫరల్‌ ఫీజు’ ఎక్కువగా ఉన్నందువల్ల పేషెంట్లను పెద్దాసుపత్రులకు పంపించే వ్యాప కాన్ని మెజారిటీ గ్రామీణ వైద్యులు అలవాటు చేసుకున్నారు. సంప్రదాయ వైద్యం అదృశ్యమైంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ‘నేను రాను బిడ్డో’ అనే విధంగా తయారయ్యాయి. ఆర్‌ఎంపీ, పీఎమ్‌పీ వైద్య సేవలు చాలాచోట్ల గాడి తప్పాయి. ఫలితంగా ప్రాథమిక వైద్యం పూర్తిగా పడకేసింది. ఈ పరిణామం కార్పొ రేట్‌ ఆస్పత్రులకు బాగా నచ్చింది. ప్రాథమిక వైద్యం అందు బాటులో ఉన్నట్లయితే భవిష్యత్తులో బ్రహ్మరాక్షసిగా పరిణ మించే అవకాశాలున్న అనేక జబ్బులను మొగ్గలోనే తుంచేయ వచ్చు. జబ్బును ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరైన చికిత్సను అందజేస్తే అది దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించకుండా ఉంటుం దని వైద్య నిపుణులు చెబుతారు.

ప్రాథమిక వైద్య సౌకర్యాల లేమి ఫలితంగా లక్షలాది మంది గ్రామీణ ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారినపడి ఆర్థికంగా దివాలా తీశారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు కొత్తకాంతులు పులుముకున్నాయి. ఈ పరిణా మాన్ని గమనించిన నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి దీర్ఘవ్యాధుల బారిన పడిన పేద ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వుండేందుకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. రెండు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలను ఆదుకున్న ఈ పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. కానీ, ప్రజారోగ్య సంక్షో భాన్ని తొలగించడానికి ఇంకా పూర్తి చేయవలసిన ప్రధాన లక్ష్యం మిగిలే ఉన్నది. అదే, నాణ్యమైన ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అధికారంలోకి వచ్చిన తొలివారం నుంచే ముఖ్యమంత్రి వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిని పెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేసి నూతన జవసత్వాలను సమకూర్చబోతున్నట్టు అప్పుడే ఆయన విధాన ప్రకటన చేశారు. అందుకోసం నాడు – నేడు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. 671 కోట్ల రూపాయల కేటాయింపును కూడా వెంటనే చేసి వేగంగా పనులు ప్రారంభమయ్యేలా చూశారు. 2,153 మంది వైద్యులతో సహా దాదాపు పదివేల మంది నూతన వైద్య సిబ్బంది నియామకానికి సింగిల్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. బహుశా, ఈ నెలాఖరుకల్లా వారంతా విధుల్లో చేరిపోతారు. 16 కొత్త వైద్యశాలలను ప్రకటించారు. 

వాటికి స్థల సేకరణ, డిజైన్ల ఎంపిక సిద్ధమైంది. 2023 నాటికి ఇవి అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలను ఈ రకంగా ప్రారంభించిన దాఖలా లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 11 మెడికల్‌ కాలేజీలకు ఇవి అదనం. దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 11,197 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్ర పౌరులందరికీ హెల్త్‌ రికార్డులను సిద్ధం చేయబోతున్నారు. ప్రజారోగ్య రంగాన్ని కీలక మలుపు తిప్పే నిర్ణయం ఇది. ప్రతి పౌరునికీ ఒక ఫ్యామిలీ డాక్టర్‌ ఉన్నట్టే లెక్క. 

వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల ప్రజలు దోమకాటు జ్వరాలతో వేల సంఖ్యలో పిట్టల్లా రాలిపోయే దారుణాన్ని ప్రభుత్వాలు ప్రతియేటా ప్రేక్షక పాత్రలో వీక్షించే సంప్రదాయానికి తెరదించారు. 23 లక్షల దోమ తెరలను ఇప్పటికే పంపిణీ చేశారు. మొబైల్‌ మలేరియా, డెంగీ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. దోమకాటు వ్యాధులపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పా టైంది. మెదడువాపు వ్యాధి నియంత్రణకు విశాఖ, విజయ నగరం జిల్లాలపై ఫోకస్‌ పెట్టారు. ఏఎన్‌ఎమ్‌లు, ఆశ వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు కలిసి దోమకాటు వ్యాధుల నియం త్రణ పద్ధతులపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

108 సర్వీసులకోసం 412 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ వాహనా లున్నాయి. మరికొన్ని పాత వాహనాలతో కలిపి 705 వాహ నాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. 104 సర్వీసుల కోసం ఒక్కసారే 676 కొత్త వాహనాలను తెప్పించారు. ఇందులో డాక్టర్, డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారు. ఇందులో 74 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ప్రతి గ్రామాన్ని నెలకోసారి ఈ మొబైల్‌ క్లినిక్‌ సందర్శిస్తుంది. ఈ రెండు సర్వీసులకూ కలిపి 1,088 కొత్త వాహనాలను గత బుధవారం నాడు ముఖ్యమంత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ రథయాత్రను టీవీలో చూసి యావద్దేశం పులకించిపోయింది. 

ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ తదితర భారతీయ భాషల మీడియా ప్రముఖ వార్తగా ఈ ఘట్టాన్ని చూపెట్టాయి. సువర్ణ టీవీ అనే కన్నడ చానల్‌ యాంకర్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. జగన్‌ లాంటి ముఖ్యమంత్రి కావాలి మాక్కూడా అని పదేపదే ఆ యాంకర్‌ వ్యాఖ్యానించాడు. తమిళ చానళ్లదీ ఇదే వరస. కానీ, ఒకే ఒక్కరు. ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ప్రతిపక్ష నేత మాత్రం ఓస్, ఇంతేనా అన్నారు. ఈ మాత్రం దానికే ఇంత షో చేయాలా అని పెదవి విరిచారు. వాహనాల కొనుగోలుకు 211 కోట్లు ఖర్చయింది. ఇందులో మూడు వందల కోట్లు అవినీతి జరిగిందని ఆయన అనుయాయులు లెక్క తేల్చారు. 

బేరీజు వేసి చూస్తే... వైద్య రంగాన్ని ప్రజలకు చేరువ చేయడం కోసం వైఎస్‌ జగన్‌ ఒక్క సంవత్సరంలో చేసిన కృషిలో కనీసం పదో వంతు కూడా చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనలో చేసి ఉండరు. ఏ నిష్పాక్షిక బృందాన్ని అంచనాకోసం నియమించినా ఇదే విషయం రుజువవుతుంది. బెలూన్‌లో భూగోళాన్ని చుట్టివచ్చిన స్విస్‌ సాహసికుడు బెట్రండ్‌ పికార్డ్‌ ఒక మాట అన్నారు. ‘ఉరిమే ఉత్సాహం అవసరమే, కానీ ఆ ఉత్సాహం అంతరిక్షాన్ని గెలవడానికో, గ్రహాలను గెలవడానికో కాదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం అన్నిటికన్నా ముఖ్యం’. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన కార్య క్రమం అదే.


వ్యాసకర్త: వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement