సాక్షి, హైదరాబాద్ : దేశంలో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలంటూ నూతన విద్యా విధానం–2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ సారథ్యంలోని కమిటీ... పాఠశాల విద్యలోనూ సెమిస్టర్ విధానం తీసుకురావాలని ప్రతిపాదించింది. సెకండరీ విద్య పరిధిలోకి 8వ తరగతి నుంచి 12వ తరగతిని తీసుకొచ్చి ఏటా రెండు సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లను అమలు చేయాలని పేర్కొంది. అలాగే వృత్తివిద్యను కూడా పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లతో అనుసంధానించాలని, వీలైతే ఆ రెండింటినీ ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తెచ్చి స్కూల్ కాంప్లెక్స్ పేరుతో నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌తోపాటు క్లాస్‌రూమ్ డెమో అమలును తప్పనిసరి చేయాలని సూచించింది. మరోవైపు త్రిభాషా విధానాన్ని ఆరో తరగతి నుంచి అమలు చేయాలని పేర్కొంది. ఈ విషయంలో కమిటీ సిఫార్సులపై తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అన్ని భాషలకు సమ ప్రాధాన్యం ఉంటుందని, ఏ భాషపైనా వివక్ష చూపబోమని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కమిటీ సిఫారసులపై ఈ నెల 30 వరకు అభిప్రాయాలను సేకరిస్తున్నామని, ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. కమిటీ సిఫారసుల్లో మరికొన్ని ప్రధానాంశాలు...
సెకండరీ విద్యగానే కొనసాగింపు..
►హయ్యర్ సెకండరీ విద్యను, సెకండరీ విద్యను కలిపి సెకండరీ విద్యగానే కొనసాగించాలి. అందులో సెమిస్టర్ విధానం అమలు చేయాలి. 9, 10, 11, 12 తరగతుల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలి. ఏటా రెండు సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లు అమలు చేయాలి.
►హయ్యర్ సెకండరీ లేదా జూనియర్ కాలేజీ విధానం తొలగించాలి. 11వ తరగతి, 12వ తరగతి విధానం అమలు చేయాలి. దాన్నీ సెకండరీ విద్య పరిధిలోకి తేవాలి.
►కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన కొనసాగించాలి. వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషనే అమలు చేయాలి. వృత్తి విద్యను పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలి.
►అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీస్కూళ్లతో విలీనం చేయాలి. అవకాశం ఉన్న చోట అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రీ స్కూళ్లను, ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తేవాలి. స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి నిర్వహించాలి. – ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌ను మానవ వనరుల అభివృద్ధిశాఖ పరిధిలోనే కొనసాగించాలి.
►ఉపాధ్యాయ నియామకాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షతోపాటు 5–7 నిమిషాల క్లాస్‌రూమ్ డెమోను కచ్చితంగా అమలు చేయాలి.
►ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:30గా కొనసాగించాలి.
ఎన్నికల విధులకు టీచర్లను దూరం చేయాల్సిందే...
►ప్రతిభావంతులైన వారు ఉపాధ్యాయ విద్యలోకి వచ్చేలా ప్రోత్సాహించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ ఇస్తూ దేశంలో ఎక్కడైనా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చదివేలా ప్రోత్సహించాలి.
►టీచర్లకు బోధనతో సంబంధంలేని ప్రభుత్వ పనులను తగ్గించాలి. ప్రస్తుతం టీచర్లు ఆ పనులతో బిజీగా ఉంటున్నారు. వాటిని నుంచి దూరం చేయాలి. ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయవద్దు. పాలన పనులను అప్పగించవద్దు. వారు పూర్తిగా బోధన, అభ్యసన పనుల్లోనే నిమగ్నం అయ్యేలా చేయాలి.
►ప్రతి టీచర్ తన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కనీసం 50 గంటలు కేటాయించేలా చూడాలి.
►ప్రైవేటు పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ అనే పదాన్ని వినియోగించకూడదు. ఆ పదం కేవలం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకే ఉండాలి.
►ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.
యూజీసీ స్థానంలో ఎన్‌హెచ్‌ఈఆర్‌ఏ...
►యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థానంలో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. దీని ఆధ్వర్యంలోనే మొత్తం ఉన్నత విద్యతోపాటు వృత్తి విద్యా కోర్సులను కూడా పర్యవేక్షించాలి.
►ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ తదితర సంస్థలన్నింటినీ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ సెట్టింగ్ బాడీస్‌గా మార్పు చేయాలి.
► ఆన్‌లైన్‌లో నిర్వహించే కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
►దూరవిద్యను కూడా నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) పరిధిలోకి తీసుకురావాలి. దూరవిద్య అధ్యయన కేంద్రాలుగా నాణ్యతా ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలనే ఎంపిక చేయాలి.
►న్యాక్ గ్రేడింగ్ విధానాన్ని సమూలంగా మార్చేయాలి. గ్రేడింగ్ విధానం ఉండొద్దు. న్యాక్ గుర్తింపు ఉందా లేదా అనే విధానమే తీసుకురావాలి.
►ఉన్నత విద్యాసంస్థలకు అనుబంధ గుర్తింపు విధానం తొలగించాలి. అవన్నీ బోధన కాలేజీలుగా కొనసాగేలా చర్యలు చేపట్టాలి.
ప్రైవేటు విద్యాసంస్థలకు పరిశోధన నిధులు...
►ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ప్రాజెక్టుల కోసం నిధులు పొందేలా చర్యలు చేపట్టాలి.
►ప్రభుత్వ విద్యాసంస్థలతో సమానంగా ప్రైవేటు విద్యాసంస్థలకు ఎన్‌ఆర్‌ఎఫ్ ఫండింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి.
►పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చేలా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంతోపాటు దానికి అదనంగా ప్రస్తుతం ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్ సంస్థలను కొనసాగించాలి.
►నీట్ తరహాలో ఎంబీబీఎస్ పూర్తయ్యే సమయంలో ఎగ్జిట్ పరీక్షగా కామన్ పరీక్షను ప్రవేశపెట్టాలి.
► అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ కేడర్ల మధ్యలో స్థాయిలను కొనసాగించాలి.
►ఎంఫిల్ విద్యా విధానాన్ని తొలగించాలి.
పాఠశాల విద్యలోనూ సెమిస్టర్లు!
Published Tue, Jun 4 2019 1:09 AM | Last Updated on Tue, Jun 4 2019 9:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment