16 నుంచి స్కూళ్లు.. ఆ రోజే నూతన విద్యావిధానంపై ప్రకటన | Andhra Pradesh Schools To Reopen On 16th August | Sakshi
Sakshi News home page

16 నుంచి స్కూళ్లు.. ఆ రోజే నూతన విద్యావిధానంపై ప్రకటన

Published Sat, Jul 24 2021 2:50 AM | Last Updated on Sat, Jul 24 2021 2:52 PM

Andhra Pradesh Schools To Reopen On 16th August - Sakshi

రూ.16 వేల కోట్లతో చేపట్టిన నాడు – నేడు, నూతన విద్యా విధానంతో సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి. సమూల మార్పుల ద్వారా విద్యా వ్యవస్థ పునరుజ్జీవానికి ఏం చేయబోతున్నామో తెలియజేయాలి. తల్లిదండ్రులకూ అవగాహన కలిగించాలి. నూతన విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో టీచర్లకు వివరించాలి.      – సీఎం జగన్‌

16న జరిగే మరిన్ని కార్యక్రమాలు 
►తొలి విడత నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లు ప్రజలకు అంకితం 
►రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం 
►విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ  

కొత్త విధానంలో 6 రకాల స్కూల్స్‌
1.శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌ 
(పీపీ–1, పీపీ–2)
2.ఫౌండేషన్‌ స్కూల్స్‌ 
(పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)
3.ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు)
4.ప్రీ హైస్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)
5.హైస్కూల్స్‌ 
(3 నుంచి 10వ తరగతి వరకు)
6.హైస్కూల్‌ ప్లస్‌ 
(3 నుంచి 12వ తరగతి వరకు) 

సాక్షి, అమరావతి: వచ్చే నెల 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖను ఆదేశించారు. అదే రోజు తొలి విడతలో నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లను ప్రజలకు అంకితం చేస్తూ.. రెండో విడత స్కూళ్లలో నాడు–నేడు కింద పనులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అదే రోజే విద్యా కానుకను ప్రారంభించి, నూతన విద్యా విధానం విధి, విధానాలను ప్రకటిస్తామని చెప్పారు. విద్యా శాఖ, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు, నూతన విద్యా విధానం, విద్యా కానుక అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును అధికారులు సీఎంకు వివరించారు. నూతన విద్యా విధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే త్వరితగతిన ఆ ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే నెల 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 


నాడు–నేడులో భాగంగా స్కూళ్ల ప్రహరీలపై గీసిన ఆకర్షణీయమైన పెయింటింగ్స్‌ వద్ద ఆడుకుంటున్న పిల్లలు 

అంగన్‌వాడీల నుంచే ఇంగ్లిష్‌ మీడియం 
►ఫౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా అంగన్‌వాడీల నుంచే ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభం అవుతుంది. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు రూపాంతరం చెందుతాయి. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌కు ఫౌండేషన్‌ స్కూల్స్‌ మార్గ నిర్దేశం చేస్తాయి. ఇక్కడ కూడా ఎస్‌జీటీ టీచర్లు పర్యవేక్షిస్తూ ఉత్తమ బోధన అందేలా చూస్తారు. 
►శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుంది. కిలోమీటరు లోపలే ఫౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుంది. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్‌ ఉంటుంది. మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం.
అవగాహన కల్పించాలి
►ఎందుకు నూతన విద్యా విధానం పట్ల మొగ్గు చూపుతున్నామనేదానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఫౌండేషన్‌ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా? లేదా? (విస్తృతంగా చర్చించామని అధికారులు చెప్పారు)
►ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు వారికీ తెలియాలి. ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి.
►అంగన్‌వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్‌ చానల్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతికి ఒక టీచర్‌ ఉండేలా హేతుబద్ధీకరణ, జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యా వ్యవస్థ ఉంటుంది. ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం.
పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి 
►మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలి. పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఎక్కడా అవినీతికి, వివక్షకు తావుండరాదు. పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం గతంలో లేదు. 
►పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు. ఈ విషయం పై స్థాయి హెడ్‌ మాస్టర్‌ నుంచి కింద స్థాయి వారి వరకు వర్తిస్తుంది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా చెబుతున్నా. 
►పాఠ్య పుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక.. తదితరాలన్నీ ఆగస్టు 16 నాటికి సిద్ధంగా ఉండాలి.   



మార్కుల ఆధారంగా గ్రేడ్లు 
►తొలిదశలో నాడు–నేడు కింద చేపట్టిన స్కూల్స్‌లో పనులు దాదాపు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. అమ్మఒడి, నాడు–నేడు, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్‌ మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్నారు.
►వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్‌ విద్యార్థులను పాస్‌ చేశామని, కొన్ని రిక్రూట్‌మెంట్లలో మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నందున 2020 టెన్త్‌ విద్యార్థులకూ అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇస్తామని తెలిపారు.
►ఇలాగే 2021 టెన్త్‌ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నామని వివరించారు. స్లిప్‌ టెస్టుల్లో మార్కుల ఆధారంగా 70% మార్కులు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా మిగిలిన 30% మార్కులు ఇస్తామన్నారు. మొత్తం మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడించారు.
►విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

నైపుణ్య బోధనే నూతన విద్యా విధానం లక్ష్యం
►ఉపాధ్యాయులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విద్యా విధానం ప్రధాన లక్ష్యం. పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది. ప్రస్తుతం 5వ తరగతి వరకు ప్రతి టీచర్‌ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు. 
►ఇంటర్‌ తర్వాత డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌ చేసి సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పని చేస్తున్నారు. కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్‌ బోధిస్తున్న పరిస్థితి ఉంది. నూతన విద్యా విధానం ద్వారా ఈ రకమైన పరిస్థితుల్లో మార్పు తెస్తున్నాం. 
►5వ తరగతి వరకు 18 సబ్జెక్టులను బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం. తద్వారా పిల్లలకు ఫోకస్డ్‌ ట్రైనింగ్‌ వస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ రాబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement