దేవాన్ష్‌ చదివే స్కూళ్లో తెలుగు మీడియం ఉందా? | AP Ministers Speech At Nadu Nedu Launch Programme At Ongole | Sakshi
Sakshi News home page

దేవాన్ష్‌ చదివే స్కూళ్లో తెలుగు మీడియం ఉందా?

Published Thu, Nov 14 2019 2:18 PM | Last Updated on Thu, Nov 14 2019 2:31 PM

AP Ministers Speech At Nadu Nedu Launch Programme At Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు: దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహన్‌రెడ్డికే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నేడు దేశమంతా ఏపీ వైపు చూస్తోందని.. విద్య కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందన్నారు. ప్రతీ పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు స్కూళ్ల స్థితిగతులను మార్చబోతున్నట్లు స్పష్టం చేశారు. గురువారమిక్కడ మనబడి నాడు-నేడు కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి సురేష్‌ మాట్లాడారు. 

‘ఐదు నెలల కాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నత విద్యను పేదలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా అందిస్తే.. ఆయన తనయుడు సీఎం జగనన్న రెండు అడుగులు ముందుకేసి పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ఏర్పాటు చేశారు. ఇలాంటి చరిత్రాత్మక ఘట్టం దేశంలో ఎక్కడా  లేదు. వైఎస్సార్‌ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చాలనే ధృడ సంకల్పంతో విద్యకు మన ప్రభుత్వం పెద్దపీట వేసింది.

ఈ చారిత్రాత్మక ఘట్టంలో దళిత బిడ్డనైన నేను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ చదివే స్కూల్లో తెలుగు మీడియం లేదు.. రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్దలు ఏర్పాటు చేసిన స్వర్ణభారతి ట్రస్టు, పత్రికాధినేత ఏర్పాటు చేసుకున్న స్కూళ్లలో తెలుగు మీడియం ఉందా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయం కోసం పేదలకు ఆంగ్ల మాధ్యమం అందకూడదని కుట్రలు చేస్తున్నారు. ఏదైనా చెప్పాలనుకుంటే ఆచరణ చేసి చూపించమనే సిద్ధాంతాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ నమ్మారు. తన బిడ్డలతో పాటు రాష్ట్రంలోని 70 లక్షల మంది పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదవాలని ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం జగనన్నకే సాధ్యమైందని’ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

పేదవారి పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం వద్దా?

పేద పిల్లలకు ఇంగ్లీష్‌ చదువులు అందిస్తే తప్పేంటని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యాశాఖకు రూ.33 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. పేద పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివించేందుకు సీఎం ముందుకు వస్తే..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు తన మనవడిని ఏ స్కూల్‌లో చేర్పించారని, పవన్‌ తన పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. 

పేదల పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం వద్దా అని నిలదీశారు. అందరిని కూడా ఉన్నతంగా చదివించేందుకు ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్‌ జగన్‌ జనరంజక పాలన చేస్తున్నారని, పవన్‌ మరో 15 రోజుల్లో సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేపడుతున్న మంచి కార్యక్రమాలు అందరూ స్వాగతించాలన్నారు. ఇసుకపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇసుకపై నిక్కచ్చిగా ఉన్నారని తెలిపారు. తమ జిల్లాలో ఒక్క లారీ కూడా బయటకు వెళ్లడం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. 

చదవండి: 
‘చరిత్రను మార్చబోయే అడుగులు వేస్తున్నాం’
ఏం పాపం చేశాం సార్‌.. ఇంగ్లీషు వద్దంటున్నారు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement