
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలు మూసివేస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరో 27 వేల అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు. ఎంఈవో పోస్టుల భర్తీ, పాఠశాలల విలీనం, ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు అనే అంశాలపై శాసనమండలిలో శుక్రవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేష్ బదులిచ్చారు.
విద్యాశాఖ అంశాలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ప్రతి మండలానికి ఎంఈవో–2ను నియమించాల్సిన అవసరాన్ని సూచించిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న 264 ఎంఈవోలతోపాటు మరో 666 ఎంఈవో–2 పోస్టులను సృష్టించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. దీనివల్ల ఏడాదికి రూ.28 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. వీటితోపాటు 36 డివిజనల్ విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. ఎంఈవో, డివిజినల్ విద్యాశాఖ అధికారుల ఖాళీల భర్తీకి సీనియారిటీ ప్యానల్ రూపొందిస్తామన్నారు.
స్వీపర్లను ఆయాలుగా చేసి వేతనాలు పెంచాం..
పాఠశాలల్లో పనిచేసేవారిని గత ప్రభుత్వం స్వీపర్లు అని కించపరిచేలా వ్యవహరిస్తే.. వారికి ఆయాలుగా పేరు మార్చి తమ ప్రభుత్వం గౌరవిస్తోందని మంత్రి సురేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 45,488 మంది ఆయాలకు గత ప్రభుత్వం రూ.2 వేలు వేతనంగా ఇస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.6 వేలకు పెంచిందని మంత్రి గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment