అఖిల్ సిటీలో కాన్వెంట్లో చదువుతున్నాడు. కోవిడ్ టైమ్ కావటంతో అమ్మమ్మ–తాతయ్య ఊరికెళ్లాడు. ఓ రోజు అక్కడి ప్రభుత్వ స్కూలుకు తీసుకెళ్లాడు వాళ్ల తాతయ్య. ఆ స్కూల్‌లో ఉన్న సౌకర్యాలు చూసి అఖిల్ మైమరచిపోయాడు. అక్కడి ల్యాబ్‌లో, పచ్చిక బయలులో రెండు మూడు గంటలు గడిపేశాడు. తిరిగి వస్తూ ఆ స్కూల్ గురించి వాళ్ల తాతయ్యతో ఒకటే కబుర్లు. మరి కాన్వెంట్లో చదువుతున్న పిల్లాడికి ల్యాబ్ గురించి తెలీదా? నిజానికి ల్యాబ్ అంటే తెలుసు. కానీ వాళ్ల స్కూల్లో మాత్రం లేదు. ఆ స్కూలు మాత్రమే కాదు. అలా దాదాపు 90 శాతం ప్రయివేటు స్కూళ్ల పరిస్థితి అదే. ఇళ్ల మధ్య.. రణగొణ ధ్వనుల మధ్య చిన్న చిన్న బిల్డింగులే వారి స్కూళ్లు. చదువుకుంటే చాలనే అమ్మానాన్నలు... ఫీజులొస్తే చాలనుకునే యాజమాన్యాలు. మరిక ల్యాబ్‌లు ఎక్కడ? పచ్చిక బయళ్లు ఇంకెక్కడ?
నిజానికి ప్రభుత్వ స్కూళ్లలో చాలా వాటికి ల్యాబ్‌లు, పచ్చిక బయళ్లు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేక పరికరాలన్నీ మూలన పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చేపట్టిన ‘నాడు–నేడు’ పుణ్యమాని వాటన్నింటికీ మహర్దశ పట్టుకుంది. చాలా వరకు కొత్త పరికరాలు కూడా వచ్చాయి. వీలైన ప్రతి స్కూల్లోనూ పచ్చని చెట్లతో కూడిన ఆవరణ, పచ్చిక బయళ్లను అభివృద్ధి చేశారు.
ప్రతి ప్రాథమిక పాఠశాలలో, హైస్కూల్లో, యూపీ స్కూలులో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. రన్నింగ్ వాటర్‌తో కూడిన అధునాతన వాష్ రూమ్‌లను నిర్మించారు. తాగునీటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో విద్యార్థులెవరూ మధ్యలో ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇలా తొలివిడతలో ముస్తాబయిన స్కూళ్లన్నీ పిల్లల్ని భలేగా ఆకట్టుకుంటున్నాయి. బొమ్మలు చూస్తూ.. ఆహ్లాదకర వాతావరణ మధ్య ఆడుతూ పాడుతూ చదువుకుంటే ఆ మజాయే వేరనేది టీచర్లూ అంగీకరించే మాట. మరో రెండ్రోజుల్లో పిల్లలందరికీ కొత్త స్కూలు అనుభవంలోకి రాబోతోంది మరి!
గతంలో మా పాఠశాలలో 1వ తరగతినుంచి 7వ తరగతివరకు 168 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెండింతలు పెరిగి 300కు చేరింది. ఇకపై మురారిపల్లె గ్రామం నుంచి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వారు ఎవరూ ఉండరు. పట్టణాల్లోని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలో విద్యార్థులకు కావలసిన వసతులన్నీ కల్పించాం. చిన్న పిల్లలు ఆడుకోవటానికి పార్కుల్లో ఉండే రంగులరాట్నం, జారుడు బండ, ఊయల లాంటివి ఏర్పాటు చేశాము.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మురారిపల్లె యూపీ స్కూల్
స్వాతంత్య్రోద్యమానికి అక్షరాయుధాలు అందించిన గ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని సిద్ధాపురం. ఇంతవరకూ మా పాఠశాలలో కనీస వసతులు లేవు. మరుగుదొడ్డి ఉన్నప్పటికీ పాఠశాలకు వెళ్లిన వెంటనే గుప్పున వచ్చే దుర్వాసనతో ముక్కు బద్దలయ్యేది. గతంలో పిల్లలు చేతులు కడుక్కునేందుకు సౌకర్యమే ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో నాడు–నేడు పథకం మా పాఠశాలకు మంజూరైందనగానే పట్టరాని ఆనందం కలిగింది. ఇప్పుడు ప్రహరీ నిర్మాణం, అధునాతన, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల కల్పనతో సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఎం వైఎస్ జగన్‌చేపట్టిన ఈ అభివృద్ధి పేద విద్యార్థుల ఆరోగ్య, విద్యా వికాసానికి ఎంతో దోహదపడుతుంది.
ప.గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం పాఠశాలలో గతంలో తాగునీటి పరిస్థితి ఇలా..; ప్రస్తుతం పాఠశాలలో ఏర్పాటుచేసిన మంచినీటి కుళాయిలు, హ్యాండ్ వాష్ బేసిన్
‘వర్షం పడితే మా స్కూల్లో మొత్తం గదులన్నీ నీరు కారి విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. పిల్లలను ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థమయ్యేది కాదు. మరుగుదొడ్లు లేక పిల్లల్ని ఇళ్లకు పంపేవాళ్లం. నాడు –నేడు కార్యక్రమంతో పాఠశాలలో గదులన్నీ ఆధునికీకరించారు. ఆట స్థలానికి ఎకరం భూమిని సేకరించాం. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్‌తో విద్యార్థులకు తాగునీటి కొరత తీరింది. వాష్‌రూమ్ కోసం పిల్లలు ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు’ అనేది అనంతపురం జిల్లా ఓడీ చెరువు మండలం మిట్టపల్లి జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ ఎం.పి.పి.స్కూల్ ఆవరణ
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్లలోని ప్రాథమికోన్నత పాఠశాలలోనూ వర్షం వస్తే అంతా బురదమయమైపోయేది. నాడు–నేడుతో మెరకతోలి ఆవరణంతా ఎత్తు చేశారని, విద్యార్థులను ఆకర్షించేలా తరగతి గదిలో బొమ్మలు వేశారని.. మల్టీప్లెక్స్ థియేటర్‌లో మాదిరి అధునాతన సౌకర్యాలతో మరుగుదొడ్లను నిర్మించారని విద్యార్థిని తల్లి పల్లగాని వెంకటేశ్వరమ్మ సంబరపడుతోంది. ‘‘ఐదో తరగతి చదువుతున్న మా అమ్మాయి చందన ఇక వాష్‌రూమ్ కోసం ఇంటికి రానవసరం లేదు. ఆటస్థలం అభివృద్ధి చేశారు. కొంత స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తున్నారు. మొత్తంగా స్కూలంటే ఇలా ఉండాలనేలా తీర్చిదిద్దారు’’ అంటూ ప్రశంసిస్తోంది.
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్ల ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ
గతంలో మా పాఠశాలలో మరుగుదొడ్లు లేక చాలా అవస్థలు పడేవాళ్లం. మూత్ర విసర్జనకు స్కూలు పక్కనే ఉన్న చిన్న స్థలంలో పని కానిస్తుండేవాళ్లం. టీచర్లు, సహచర విద్యార్ధినిలు అటుగా రాకపోకలు సాగిస్తున్నప్పడు మూత్ర విసర్జన చేయడానికి ఇబ్బందిగా ఉండేది. చేతులు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఉండేవి కావు. మల విసర్జనకు పరుగెత్తుకుంటూ ఇళ్లకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వం పాఠశాలలో మరుగుదొడ్లను కొత్తగా నిర్మించింది. నీటి వసతి కోసం ట్యాంక్‌ను కట్టించింది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు సమకూరడం గర్వంగా ఉంది.
విద్యార్థులు మూత్ర విసర్జనకు వినియోగించే ఖాళీ స్థలం; సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన వాష్ రూమ్
– సాక్షి, అమరావతి / సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment