అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీలోని ప్రభుత్వ పాఠశాల
సాక్షి, అమరావతి: చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయిన మైదానం.. దుమ్ము కొట్టుకుపోయిన గోడలు.. విరిగిపోయిన వాకిళ్లు, కిటికీలు.. పగుళ్లిచ్చిన పైకప్పు.. నీళ్లు లేని మరుగుదొడ్లు.. కూర్చోవడానికి బెంచీలు కరువు.. కిర్రు కిర్రుమని శబ్దం చేసే ఉపాధ్యాయుల చెక్క కుర్చీలు.. నాలుగు పరీక్ష నాళికలు సైతం లేని సైన్స్ ల్యాబ్.. ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొన్నటి దాకా ఉన్న పరిస్థితి.
ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి. రంగు రంగుల చిత్రాలతో అల్లంత దూరం నుంచే ఆకట్టుకుంటున్నాయి. సకల సౌకర్యాలతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా రూపు మార్చుకున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో రూపు మారిపోయి కొత్త శోభ సంతరించుకున్నాయి. పట్టణాల్లో ఉండి సొంత గ్రామాలకు వెళ్లిన వారికి తాను చిన్నప్పుడు చదువుకున్న బడి ఇదేనా అని అబ్బుర పరిచేలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు–నేడు కింద తొలి దశలో 15,717 స్కూళ్లలో చేపట్టిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. తొలి దశలో 15,717 స్కూళ్లలో రూ.3,669 కోట్ల వ్యయంతో 1,16,241 పనులు చేపట్టగా ఇప్పటికే 78,589 పనులు పూర్తి అయ్యాయి. మరో 23,281 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటిదాకా మన బడి నాడు–నేడు పనులకు రూ.3,158 కోట్లు వ్యయం చేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
సర్కారు స్కూళ్లపై వ్యయం సామాజిక పెట్టుబడి
సంవత్సరాల తరబడి ప్రభుత్వ రంగంలోని స్కూళ్లపై పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మరుగు దొడ్డి కూడా లేకపోవడంతో ఆడ పిల్లలు పడుతున్న అవస్థలను ప్రతిపక్ష నేతగా పాదయాత్ర ద్వారా స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి గమనించారు. ఆ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల వెతలను స్వయంగా విన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ అవస్థలు, వెతలను సమూలంగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించారు. 2019 నవంబర్ 14వ తేదీన తొలి దశలో 15,717 స్కూళ్లలో నాడు–నేడు పనులకు శ్రీకారం చుట్టారు. స్కూళ్లపై చేస్తున్న వ్యయం సామాజిక పెట్టుబడిగా నిలవనుంది. మానవ వనరుల అభివృద్ధితోనే మెరుగైన సమాజం సాధ్యమని భావించిన సీఎం.. 45,329 స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు మూడు దశల్లో మన బడి నాడు–నేడు కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా పది రకాల సౌకర్యాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న టీచర్
పనులు చకచకా..
► తొలి దశలో స్కూళ్లలో రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.815.41 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసి పనులు ప్రారంభించారు. 14,306 పనులు చేపట్టగా ఇప్పటికే 13,573 పనులు పూర్తి అయ్యాయి. మరో 707 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇందుకోసం రూ.778.54 కోట్లు వ్యయం చేశారు.
► రక్షిత మంచినీటి సరఫరా కల్పించడానికి రూ.352.06 కోట్ల వ్యయంతో 14,552 పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 8,350 పనులు పూర్తి కాగా మరో 6,136 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.311.04 కోట్లు వ్యయం చేశారు.
► విద్యుత్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల కల్పనకు రూ.268.17 కోట్ల వ్యయంతో 15,020 పనులను చేపట్టారు. ఇప్పటికే రూ.205.49 కోట్లు వ్యయం చేశారు. 14,909 పనులు పూర్తి కాగా, 98 పనులు పురోగతిలో ఉన్నాయి.
► రాష్ట్రంలోని 45,329 సూళ్లలో నాటి పరిస్థితికి సంబంధించి 20.19 లక్షల ఫొటోలను తీసి కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో కనీస మౌలిక వసతుల కల్పన అనంతరం గత పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు తెలిసేలా వెబ్ పోర్టల్‌లో ఉంచుతున్నారు.
► మనబడి నాడు–నేడు తొలి దశలో రూ.3,669 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు రూ.3,158 కోట్లు వ్యయం చేసిందని విద్యా శాఖ సలహాదారు జె.మురళి తెలిపారు. పురోగతిలో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment