సాక్షి,అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో అనే దయనీయ పరిస్థితుల నుంచి బయటపడి సకల వసతులతో కళకళలాడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా చక్కటి వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ ఫలితాలు ఇవన్నీ. ఇప్పటికే తొలివిడత స్కూళ్లలో నాడు–నేడు పనులు పూర్తయి సర్వాంగ సుందరంగా రూపుదిద్దు కోగా ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. తొలుత ప్రభుత్వ స్కూళ్ల వరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రణాళిక తయారైనా తదుపరి ముఖ్యమంత్రి జగన్ సూచనలతో ఇతర విద్యాసంస్థలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు.
సమున్నత లక్ష్యంతో శ్రీకారం..
సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని స్వయంగా పరిశీలించిన సీఎం జగన్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు పడుతున్న అగచాట్లను గుర్తించారు. కనీస సదుపాయాలు కరువై విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడాన్ని చూసి చలించారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని తెచ్చారు. 45 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
విద్యాశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో పనులను చేపట్టాలని నిర్దేశించారు. 2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్తు సదుపాయం–లైట్లు, ఫ్యాన్లు, డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు లాంటి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేశారు. తొలుత 9 రకాల సదుపాయాల కల్పనకే ప్రణాళికలు రూపొందించినా తదుపరి కిచెన్‌షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ ల్యాబ్స్ కూడా జోడించారు.
రూ.16,450 కోట్లతో 61,661 విద్యాసంస్థల్లో నాడు–నేడు
నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్లలో రూ.3,697.88 కోట్లతో వివిధ సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. గత ఏడాది ఆగస్టు 16న ముఖ్యమంత్రి జగన్ వీటిని విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చి జాతికి అంకితం చేశారు. అనంతరం మలివిడత నాడు–నేడు పనులను చేపట్టాలని ఆదేశించారు.
ఇతర విద్యా సంబంధితసంస్థల్లోనూ నాడు–నేడును అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాల(డైట్స్)లతో పాటు ప్రతిష్టాత్మక శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులో చేర్చారు. తొలివిడతతో కలిపి మొత్తం 61,661 విద్యాసంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల అభివృద్ధి పనులను చేపట్టారు.
పేదలకు పెనుభారం తప్పింది
ప్రభుత్వ పాఠశాలల్లో రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరిగాయి. భారీగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించాల్సిన అవస్థలు తల్లిదండ్రులకు తొలగిపోయాయి. ముఖ్యంగా పేద వర్గాలకు పెనుభారం తప్పింది. కార్పొరేట్ స్కూళ్లకు మించిన సదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చదువులు కొనసాగుతున్నాయి. పక్కా భవనాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించడంతో విద్యార్ధులు ఉత్సాహంగా బడికి వస్తున్నారు.
–పారది జ్యోతి, పెదమేడపల్లి ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యురాలు, విజయనగరం జిల్లా
నాడు అంతా అధ్వానం..
మా ఊరిలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆనుకొని ఖాళీ స్థలం అపరిశుభ్రంగా ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో చేర్చేవారు. ఇప్పుడు అవస్థలు లేవు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రవేశాలు పెరుగుతున్నాయి.
–అల్లు రాము, చైర్మన్, తల్లిదండ్రుల కమిటీ, కొర్లాం ప్రాథమిక పాఠశాల, విజయనగరం జిల్లా
ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లట్లేదు
నాడు–నేడు మొదటి విడతలో మా పాఠశాలను ఆధునీకరించాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు, గ్రామస్తులు సహకరించారు. పాఠశాల చుట్టూ చెట్లు నాటారు. పాఠశాలతో పాటు టీచర్ల ప్రతిష్ట పెరిగింది. చిర‡స్థాయిగా ఉండేలా అభివృద్ధి చేశాం. మొత్తం 63 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎగువపల్లిలో ఏ ఒక్క విద్యార్థీ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడం లేదు.
–పీవీ శ్రీనివాసరెడ్డి, హెచ్‌ఎం, ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల, కదిరి
Comments
Please login to add a commentAdd a comment