హంగులద్దుకుంటున్న సర్కారు బడి | AP Govt intends to redesign schools in three phases in three years | Sakshi
Sakshi News home page

హంగులద్దుకుంటున్న సర్కారు బడి

Published Sun, Jul 5 2020 3:42 AM | Last Updated on Sun, Jul 5 2020 2:40 PM

AP Govt intends to redesign schools in three phases in three years - Sakshi

ఇది కృష్ణా జిల్లా కోలవెన్ను మండల పరిషత్‌ మోడల్‌ స్కూల్‌.. ఎండలున్నా, కరోనా ఉన్నా పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు దాసరి ఏసుదాసు, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ శిరీష, సభ్యుడు పున్నాని సురేష్‌లు ఇక్కడ మూడు నెలలుగా పనులు చేయిస్తున్నారు. కూలీలను పురమాయిస్తూ.. తాపీ మేస్త్రీతో మాట్లాడుతూ పనులు జరుగుతున్న తీరును వివరించారు. ‘ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ఈ పనులకు అవసరమైన నిధులతోపాటు పనులు చేపట్టే బాధ్యత కూడా పేరెంట్స్‌ కమిటీలకు ఇచ్చింది. మా స్కూలును 1935లో కట్టారు. చాలా పాత భవనం. ఈ భవనాన్ని పడగొట్టకుండా బాగు చేయడానికి చాలా కష్టపడ్డాం. మినరల్‌ వాటర్, మరుగుదొడ్లు, కిచెన్, రంగులు, ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని చెప్పారు. ‘ఇప్పటి వరకు రూ.21 లక్షలు ఖర్చయింది. ఇంకా ఎంతైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మా స్కూలులో గత ఏడాదిలో ఒక్కసారిగా ప్రయివేటు పాఠశాలల పిల్లలు 35 మంది వచ్చి చేరారు. ఇప్పుడు 5 తరగతులు కలిపి 67 మంది పిల్లలున్నారు. ఇప్పుడు స్కూలులో అన్ని సౌకర్యాలను చూసి ఈ ఏడాది 100కు పైగా పిల్లలు పెరిగే పరిస్థితి ఉంది. ఈ పనులన్నీ పూర్తయ్యాక చూస్తే కార్పొరేట్‌ స్కూల్‌ కంటే అద్భుతంగా ఉంటుంది’  అని వారు ఆనందంగా చెప్పారు. 

కూలిపోయేలా ఉన్న గోడలు.. పెచ్చులూడుతున్న శ్లాబులు.. గట్టిగా తోస్తే ఊడిపోయే తలుపులు, కిటీకీలు..నీళ్లు లేని మరుగు దొడ్లు,  ప్రాంగణంలో పందులు, గేదెలు, కోళ్లు, కుక్కలు.. మొన్నటిదాకా ఇదీ పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ కనీసం 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘పాఠశాలలు నాడు–నేడు’ కింద శ్రీకారం చుట్టింది.  

సీహెచ్‌.శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు పనులు’ చకచకా ముందుకు సాగుతున్నాయి.  రాష్ట్రంలోని దాదాపు 45 వేలకు పైగా ఉన్న స్కూళ్లను మూడేళ్లలో మూడు దశల్లో రూపురేఖలు మార్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొత్తంగా రూ.12 వేల కోట్లు ఇందుకు అవసరమవుతుందని అంచనా వేస్తోంది. తొలి విడతగా ఈ ఏడాది 15,715 స్కూళ్లలో 9 మౌలిక సదుపాయాలు కల్పించేలా పనులు ప్రారంభించింది. ఆయా స్కూళ్లలో నాడు–నేడు పనులు ఏ విధంగా సాగుతున్నాయో శుక్రవారం ‘సాక్షి’ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. దేశంలోనే తొలిసారిగా సోషల్‌ కాంట్రాక్టింగ్‌ పేరిట ఆయా స్కూళ్ల పేరెంట్సు కమిటీల ద్వారా ఈ పనులను చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటి పనుల మాదిరిగా ఈ స్కూళ్ల పనులను దగ్గరుండి చూసుకుంటుండటం ప్రతి ఊళ్లో కనిపించింది. పేరెంట్స్‌ కమిటీల్లోని సభ్యులతో పాటు ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఇతర టీచర్లు, గ్రామంలోని పెద్దలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై పర్యవేక్షిస్తున్నారు. ఏ పనిలో కూడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా ప్రతీ వస్తువును పది కాలాల పాటు ఉండేలా ప్రభుత్వం బ్రాండెడ్‌వి సమకూరుస్తోంది. 

90 శాతం పనులు పూర్తి
కృష్ణా జిల్లా కంకిపాడు ఎంపీఎం స్కూల్లో జరుగుతున్న పనులు ఇవీ.. పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ షేక్‌ ఆదిక్, హెచ్‌.ఎం కె.ఆనందజ్యోతి, ఇతర టీచర్లు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. ‘మా స్కూలులో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.21.81 లక్షలు ఖర్చయ్యాయి. గత ఏడాది ప్రయివేటు స్కూళ్ల నుంచి 40 మంది విద్యార్థులు చేరడంతో మొత్తం సంఖ్య 172కు చేరింది. ఈ ఏడాది ఏకంగా మరో 150 మందికి పైగా కొత్త పిల్లలు వచ్చి చేరే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కోవిడ్‌ ఉన్నా సరే మా స్కూలుకు పిల్లలు, వారి తల్లిదండ్రులు వచ్చి క్యూ కడుతున్నారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం పెట్టడంతో పాటు జగనన్న అమ్మ ఒడి వంటి కార్యక్రమాలతో విద్యార్థులు పెరిగే పరిస్థితులు ఉన్నాయి’ అని వారు వివరించారు. 

స్కూల్‌ బాగుతో మా పిల్లలు బాగుంటారు
నాడు–నేడు పనుల్ని నేను, మా సభ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము. మా పిల్లలు ఉండే బడి కనుక సొంత ఇంటి నిర్మాణం లాగా పని చేస్తున్నాము. ఇందులో నేను స్వయంగా పని చేస్తున్నా. మా పాఠశాల బాగుంటే మా పిల్లలు బాగుంటారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇలా మహర్దశ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇదంతా వైఎస్‌ జగన్‌ చొరవ వల్లే సాధ్యమైంది.   
 – ఎస్‌.భూలక్ష్మి,  పేరెంట్స్‌ కమిటీ చైర్‌పర్సన్, జి.కొట్టాల, అనంతపురం జిల్లా 

పది రోజుల్లో పనులు పూర్తి
ఇన్నాళ్లకు ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయి. సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన నాడు–నేడు కింద మా స్కూల్లో పనులను రోజూ  దగరుండి చూసుకుంటున్నాం. మూడు నెలల్లోనే మరుగుదొడ్లు, తాగు నీరు, విద్యుత్, ప్రహరీ, ఇతర పనులు శరవేగంతో చేపట్టాం. 80% పనులు పూర్తి చేశాం. 10 రోజుల్లో పనులు పూర్తవుతాయి.   
    – మక్క గంగేశ్వరి, హెచ్‌ఎం, చంద్రయ్యపేట, శ్రీకాకుళం జిల్లా  

మా సొంత పనిగా భావించాం
మా స్కూల్లో జరుగుతున్న పని అంటే నా సొంత పనిగానే భావిస్తాను. చేసిన పని దీర్ఘకాలం ఉండే విధంగా, ఎక్కడా నాణ్యత లోపించకుండా పర్యవేక్షిస్తున్నాను. విద్యుత్, ఫ్లోరింగ్‌ తదితర పనులు ఇప్పటికే 70% పూర్తయ్యాయి. మిగతా పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. టీచర్లు, పాఠశాల కమిటీ సభ్యులంతా పనుల్లో పాలు పంచుకుంటున్నారు. 
– తాతపూడి లక్ష్మయ్య, పీఎంసీ చైర్మన్, జెడ్పీహెచ్‌ఎస్, ఏడిద, తూర్పుగోదావరి జిల్లా

మొన్నటి దాకా ఇదీ పరిస్థితి
కూలిపోయేలా ఉన్న గోడలు.. పెచ్చులూడి ఎప్పుడు కూలుతుందో అన్నట్లుండే శ్లాబులు.. కొంచెం గట్టిగా తోస్తే చాలు ఊడిపోయే తలుపులు, కిటీకీలు.. బూజు పట్టి వేలాడుతున్న కరెంటు వైర్లు, పగిలిపోయిన స్విచ్‌ బోర్డులు.. ముక్కు మూసుకోకుండా లోపలికి వెళ్లలేని మరుగుదొడ్లు.. ప్రాంగణంలో తిష్ట వేసిన పందులు, గేదెలు, కోళ్లు, కుక్కలు.. ఇదీ సగటు సర్కారు బడి ముఖచిత్రం.  

ఇకపై ఇలా..
నాణ్యమైన టైల్స్‌తో మంచి ఫ్లోరింగ్, మినరల్‌ వాటర్, రన్నింగ్‌ వాటర్‌తో కూడిన మరుగుదొడ్లు, విద్యార్థులు కూర్చోడానికి డ్యూయెల్‌ డెస్కు బల్లలు, టీచర్లకు కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు, గోడలకు పెయింటింగ్, తళతళలాడుతున్న బోర్డులు, అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్‌లు, కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు చకచకా రూపురేఖలు మారిపోతున్నాయి. 

పనులు సాగుతున్న తీరు ఇలా..
► అన్ని స్కూళ్ల పేరెంట్సు కమిటీలు అన్ని పనుల్లో ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ప్లానింగ్, డిజైన్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణం, నిధుల యాజమాన్యం, తదితర అన్ని పనులను వారే పర్యవేక్షిస్తున్నారు.
► ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, టేబుళ్లు, తలుపులు, కిటీకీలు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, మంచినీటి పైపులు, ఇలా ప్రతి వస్తువును కూడా నాణ్యమైన బ్రాండెడ్‌వి వాడుతున్నారు. ఫ్లోరింగ్‌కు గ్రానైట్, బ్రాండెడ్‌ టైల్స్, మరుగుదొడ్లు, కుండీలు ఇలా అన్నింటికి అత్యంత నాణ్యమైన వాటిని వినియోగిస్తున్నారు.
► కమ్యూనిటీ ఓనరషిప్‌ వల్ల ప్రభుత్వ బడులు తమ సొంత ఇళ్ల మాదిరిగా భావిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అత్యంత నాణ్యతతో పనులు పూర్తి చేయిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement