వైఎస్‌ జగన్‌: నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలు | YS Jagan Speech at Mana Badi Nadu-Nedu Program in Ongole - Sakshi
Sakshi News home page

‘నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలు’

Published Thu, Nov 14 2019 12:54 PM | Last Updated on Thu, Nov 14 2019 6:52 PM

CM YS Jagan Speech At Nadu Nedu Launch Programme At Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు: ‘మన బడి నాడు-నేడు’కార్యక్రమంతో చరిత్రను మార్చబోయే తొలి అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర పాఠశాలలో ‘నాడు-నేడు’కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో​ ప్రజలు, విద్యార్థులనుద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. రాబోయే పదేళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించాలని, ఇప్పటికీ స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చాయని, పదేళ్ల తర్వాత రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని అన్నారు. మన పిల్లలకు ఇంగ్లీష​ చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఆలోచించండని కోరారు. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాలి
‘ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దాల్సి ఉంది. ప్రభుత్వాలు వాళ్లకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలి. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలను చదువుల దేవాలయాలుగా మారుస్తాం. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ నటులు ఎవరు కూడా వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించడం లేదు. సంస్కృతి పేరుతో పిల్లల భవిష్యత్‌ను పట్టించుకోకపోతే భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.

దానికి చదువు ఒక్కటే ఏకైక మార్గం
పిల్లలకోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే.. రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసేవారు హిపోక్రసీని వదిలి డెమొక్రసీకి విలువ ఇవ్వాలి. కేవలం కొందరు బాగుపడితే సమాజం బాగుపడదు. అందరూ బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గం. చరిత్రను మార్చే తొలి అడుగులు ఇవాళ వేస్తున్నాం. పాదయాత్రలో నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నానని చెబుతూ అడుగులు వేస్తున్నాం. నాడు-నేడుతో ప్రతీ పాఠశాలలో  తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదిలో ట్యూబ్‌లైట్లు, ఫర్నీచర్‌, స్కూల్‌కు కాంపౌండ్‌ వాల్‌, ల్యాబ్స్‌ వంటి సకల సౌకర్యాలను కల్పిస్తాం. అదేవిధంగా ప్రతీ స్కూళ్లో 1 నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుంది. ప్రతీ స్కూళ్లో పేరెంట్స్‌ కమిటీలను ఏర్పాటు చేశాం. 

సమస్యలు వస్తాయని తెలుసు
అయితే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే కొన్ని సమస్యలు వస్తాయన్న విషయం తెలుసు. వాటిని అధిగమించేందుకు బ్రిడ్జ్‌ కోర్సులు ఏర్పాటు చేస్తాం. టీచర్లకు శిక్షణ ఇస్తాం. ఒకట్రెండు సంవత్సరాలు కష్టపడ్డా.. ఆ తర్వాత పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో ముందుకెళ్లారు. ప్రతీ ఏడాది స్కూళ్ల కోసం రూ.3500 కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే కాలంలో రాష్ట్రంలోని 45 వేల స్కూళ్ల రూపురేఖలను మారుస్తాం. తొలి విడతలో భాగంగా దాదాపు 15,700 పాఠశాలల్లో నాడు-నేడు ప్రారంభిస్తాం. జూన్‌, 2020 నాటికి పాఠశాలల్లో అన్ని వసతులు తీసుకొస్తాం. జనవరి 9న అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇస్తాం. అదేవిధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా తీసుకొస్తున్నాం. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం.

బాట కష్టమైనదే.. శత్రువులు ఎక్కువయ్యారు
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకొచ్చాం.పేదవాడికి మేలు చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. దేశంలో జీడీపీ దెబ్బతింటుందని అందరూ చెబుతున్నారు. రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఊరిలో పది మందికి ఉద్యోగాలు ఇచ్చామని గర్వంగా చెబుతున్నాను. ప్రతి కార్యక్రమంలోను సవాళ్లు ఉన్నాయి. అయినా అడుగులు ముందుకు వేస్తున్నాను. బాట కష్టమైనదే. శత్రువులు కూడా ఎక్కువగా ఉన్నారు’అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement