Kasturi Rangan report
-
ఆచరణే గీటురాయి
ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకూ అన్ని స్థాయిల్లోనూ విస్తృతమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం ముసాయిదాపై కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. సమకాలీనత సమృద్ధిగా, నైపుణ్యమే ఇరుసుగా వుంటుందని చెబుతున్న ఈ విద్యావిధానం ప్రధాన లక్ష్యాలు– స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్)ని ఇప్పుడున్న 26 శాతం నుంచి 50 శాతానికి తీసుకెళ్లడం, జీడీపీలో ఇప్పుడు 4 శాతంగా వున్న విద్యారంగ కేటాయింపుల్ని 6 శాతానికి పెంచడం. 2030 కల్లా జిల్లాకొకటి చొప్పున బహుళ శాస్త్రాల విద్యా సంస్థ నెలకొల్పాలన్నది కూడా ఈ ముసాయిదా ధ్యేయం. తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ దేశంలో విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలన్న సంకల్పం వుంది. ఇందుకోసం టీఎస్ఆర్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలో 2015లో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ 2016లో నివేదిక సమర్పించాక ఆ మరుసటి ఏడాది ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ సారథ్యంలో 8మందితో కమిటీ ఏర్పాటైంది. అది 2018 డిసెంబర్లో 484 పేజీల నివేదికను సమర్పించింది. దానిపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం అందరినీ కోరింది. ఆనాటినుంచీ నూతన విద్యావిధానం ముసాయిదాపై అనేకానేక చర్చలు జరిగాయి. మొత్తంగా కేంద్రానికి 2 లక్షల సూచనలు అందాయంటున్నారు. వాటి ఆధారంగా తుది ముసాయిదాను రూపొందించారు. కస్తూరి రంగన్ నివేదిక త్రిభాషా సూత్రంకింద హిందీ బోధనను తప్పనిసరి చేయాలన్న సిఫార్సు చేయడంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అయితే తాజా ముసాయిదాలో వివాదాస్పదమైన ఈ నిబంధనను తొలగించారు. ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దేదిలేదని తుది ముసాయిదా చెబుతోంది. అలాగే ప్రాథమిక విద్య మాతృభాషలోనే వుండాలని కూడా ఈ విధానం శాసించలేదు. ‘కుదిరినమేర కనీసం అయిదో తరగతి వరకూ...సాధ్యమైతే ఎనిమిదో తరగతి వరకూ లేదా అంతకుమించి మాతృభాషలో బోధన వుండాలని సూచించింది. ఈ నిబంధన ప్రభుత్వ పాఠశాలలకూ, ప్రైవేటు పాఠశాలలకూ సమంగా వర్తిస్తుందని తెలిపింది. అలావుండేట్టయితే బోధనా మాధ్యమంపై ఎవరికీ అభ్యంతరం వుండదు. ప్రస్తుతం వున్న 10+2+3 విధానానికి బదులు 5+3+3+4 విధానం అమల్లోకొస్తుంది. పిల్లలకు భిన్న భాషలు నేర్చుకునే సౌలభ్యం కల్పించడం కూడా ఈ విధానంలో మెచ్చదగ్గ అంశం. విద్యావిధానం అనేది ఎప్పుడూ సున్నితమైన అంశమే. ఆ విధానం చెబుతున్నదేమిటన్న చర్చతోపాటు అది చెప్పకుండా వదిలేసిందేమిటో కూడా చర్చకొస్తుంది. సెకండరీ స్థాయి వరకూ సార్వత్రిక విద్య వుండాలని తాజా ముసాయిదా నిర్దేశిస్తున్నది. కనుక ఆ తర్వాత ఉన్నత స్థాయి విద్యను సార్వత్రికం చేయడం ప్రభుత్వ ఎజెండాలో లేదని అర్ధమవుతుంది. 2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విదేశీ విద్యాసంస్థల బిల్లు తీసుకొచ్చినప్పుడు విపక్షంలో వుండి బీజేపీ దాన్ని గట్టిగా వ్యతిరేకించింది. అవి వసూలు చేసే భారీ ఫీజుల వల్ల విద్యకయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుందని, జనాభాలో చాలా తక్కువమందికి మాత్రమే అది లభ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా మన విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు అత్యధిక వేతనాల ఆశ చూపి తన్నుకుపోతే అక్కడి విద్య దెబ్బతింటుందని హెచ్చరించింది. కానీ తాజా ముసాయిదా విదేశీ విశ్వవిద్యాలయాలకు దారులు పరుస్తోంది. వీటికి వర్తించబోయే నియమనిబంధనలేమిటో చూడాలి. ఈ ముసాయిదాలో మెచ్చదగ్గ అంశాలున్నాయి. డిగ్రీ స్థాయి విద్యను నాలుగు సంవత్సరాలకు మార్చారు. ఒకసారంటూ చేరాక జైలు శిక్ష అనుభవించినట్టు అందులోనే వుండిపోనవసరం లేకుండా ఎప్పుడైనా నిష్క్రమించే అవకాశం కల్పించారు. ఒక సంవత్సరం మాత్రమే చదివి నిష్క్రమించేవారికి సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత నిష్క్రమించదల్చుకున్నవారికి డిప్లొమా, మూడేళ్ల చదువు పూర్తి చేసి ఉద్యోగంవైపు వెళ్లదల్చుకున్నవారికి బ్యాచులర్ పట్టా ఇస్తారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో పరిశోధన చేయదల్చుకున్నవారు నాలుగో సంవత్సరం కొనసాగించవచ్చు. అయిదేళ్ల తర్వాత అయితే మాస్టర్స్‌తో కలిపి ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అందజేస్తారు. ఇప్పుడున్నట్టుగాకాక అభిరుచినిబట్టి సబ్జెక్టులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. అకౌంట్స్‌తో పాటు కెమిస్ట్రీ లేదా చరిత్రతోపాటు గణితం...ఇలా వేర్వేరు కాంబినేషన్లతో డిగ్రీ చేయొచ్చు. పరిశోధనా రంగానికి ప్రాముఖ్యతనీయడం, అందుకోసం అమెరికాలోవలే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం హర్షించదగ్గది. ప్రస్తుత విధానం బట్టీ పట్టడాన్నే ప్రోత్సహిస్తోంది. విద్యార్థి తెలివితేటల్ని, అవగాహన శక్తిని కాక జ్ఞాపకశక్తిని ప్రమాణంగా తీసుకుంటోంది. కింది స్థాయినుంచీ విద్యార్థుల్లో పరిశీలనా సామర్థ్యాన్ని పెంపొందిస్తే ఉన్నతస్థాయికి చేరేసరికి వారి దృష్టి పరిశోధనల వైపు మళ్లుతుంది. వినూత్న ఆవిష్కరణలకు దారులు పరుస్తుంది. అయితే ఆదర్శాలు ఎంత బలమైనవైనా వాటికి దీటైన ఆచరణ వుండాలి. మన దేశంలో పరిశోధనలకు ప్రధాన ఆటంకంగా వుంటున్నది నిధులే. వాటిని అందుబాటులో వుంచగలిగితేనే పరిశోధనలు విస్తృతమవుతాయి. అసలు మన విద్యారంగానికి ఏటా బడ్జెట్లో చేసే కేటాయింపులే అరకొరగా వుంటున్నాయి. జీడీపీలో మరో 2 శాతం మొత్తాన్ని అదనంగా పెంచుతామనడం ఏమూలకూ చాలదు. అలాగే యూజీసీకి బదులుగా ఏర్పడే వ్యవస్థనుంచి విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు ఎలావుంటుందో చూడాలి. కొత్త విధానం మన ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా వుండటం, సామాజిక న్యాయం అమలుకావడం, అట్టడుగు కులాల ప్రయోజనాలు పరిరక్షించడం అత్యవసరం. గాంధీజీ చెప్పినట్టు వ్యక్తిత్వాన్ని పెంపొందించే విద్య, విలువలను నేర్పించే విద్య ఏ తరానికైనా అవసరం. అది నూతన విద్యావిధానం సాకారం చేయాలి. -
పాఠశాల విద్యలోనూ సెమిస్టర్లు!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలంటూ నూతన విద్యా విధానం–2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ సారథ్యంలోని కమిటీ... పాఠశాల విద్యలోనూ సెమిస్టర్ విధానం తీసుకురావాలని ప్రతిపాదించింది. సెకండరీ విద్య పరిధిలోకి 8వ తరగతి నుంచి 12వ తరగతిని తీసుకొచ్చి ఏటా రెండు సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లను అమలు చేయాలని పేర్కొంది. అలాగే వృత్తివిద్యను కూడా పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లతో అనుసంధానించాలని, వీలైతే ఆ రెండింటినీ ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తెచ్చి స్కూల్ కాంప్లెక్స్ పేరుతో నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌తోపాటు క్లాస్రూమ్ డెమో అమలును తప్పనిసరి చేయాలని సూచించింది. మరోవైపు త్రిభాషా విధానాన్ని ఆరో తరగతి నుంచి అమలు చేయాలని పేర్కొంది. ఈ విషయంలో కమిటీ సిఫార్సులపై తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అన్ని భాషలకు సమ ప్రాధాన్యం ఉంటుందని, ఏ భాషపైనా వివక్ష చూపబోమని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కమిటీ సిఫారసులపై ఈ నెల 30 వరకు అభిప్రాయాలను సేకరిస్తున్నామని, ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. కమిటీ సిఫారసుల్లో మరికొన్ని ప్రధానాంశాలు... సెకండరీ విద్యగానే కొనసాగింపు.. ►హయ్యర్ సెకండరీ విద్యను, సెకండరీ విద్యను కలిపి సెకండరీ విద్యగానే కొనసాగించాలి. అందులో సెమిస్టర్ విధానం అమలు చేయాలి. 9, 10, 11, 12 తరగతుల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలి. ఏటా రెండు సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లు అమలు చేయాలి. ►హయ్యర్ సెకండరీ లేదా జూనియర్ కాలేజీ విధానం తొలగించాలి. 11వ తరగతి, 12వ తరగతి విధానం అమలు చేయాలి. దాన్నీ సెకండరీ విద్య పరిధిలోకి తేవాలి. ►కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన కొనసాగించాలి. వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషనే అమలు చేయాలి. వృత్తి విద్యను పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలి. ►అంగన్వాడీ కేంద్రాలను ప్రీస్కూళ్లతో విలీనం చేయాలి. అవకాశం ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాలు, ప్రీ స్కూళ్లను, ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తేవాలి. స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి నిర్వహించాలి. – ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌ను మానవ వనరుల అభివృద్ధిశాఖ పరిధిలోనే కొనసాగించాలి. ►ఉపాధ్యాయ నియామకాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షతోపాటు 5–7 నిమిషాల క్లాస్రూమ్ డెమోను కచ్చితంగా అమలు చేయాలి. ►ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:30గా కొనసాగించాలి. ఎన్నికల విధులకు టీచర్లను దూరం చేయాల్సిందే... ►ప్రతిభావంతులైన వారు ఉపాధ్యాయ విద్యలోకి వచ్చేలా ప్రోత్సాహించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో ఎక్కడైనా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చదివేలా ప్రోత్సహించాలి. ►టీచర్లకు బోధనతో సంబంధంలేని ప్రభుత్వ పనులను తగ్గించాలి. ప్రస్తుతం టీచర్లు ఆ పనులతో బిజీగా ఉంటున్నారు. వాటిని నుంచి దూరం చేయాలి. ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయవద్దు. పాలన పనులను అప్పగించవద్దు. వారు పూర్తిగా బోధన, అభ్యసన పనుల్లోనే నిమగ్నం అయ్యేలా చేయాలి. ►ప్రతి టీచర్ తన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కనీసం 50 గంటలు కేటాయించేలా చూడాలి. ►ప్రైవేటు పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ అనే పదాన్ని వినియోగించకూడదు. ఆ పదం కేవలం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకే ఉండాలి. ►ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. యూజీసీ స్థానంలో ఎన్హెచ్ఈఆర్ఏ... ►యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థానంలో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. దీని ఆధ్వర్యంలోనే మొత్తం ఉన్నత విద్యతోపాటు వృత్తి విద్యా కోర్సులను కూడా పర్యవేక్షించాలి. ►ఏఐసీటీఈ, ఎన్సీటీఈ తదితర సంస్థలన్నింటినీ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ సెట్టింగ్ బాడీస్‌గా మార్పు చేయాలి. ► ఆన్లైన్లో నిర్వహించే కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ►దూరవిద్యను కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) పరిధిలోకి తీసుకురావాలి. దూరవిద్య అధ్యయన కేంద్రాలుగా నాణ్యతా ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలనే ఎంపిక చేయాలి. ►న్యాక్ గ్రేడింగ్ విధానాన్ని సమూలంగా మార్చేయాలి. గ్రేడింగ్ విధానం ఉండొద్దు. న్యాక్ గుర్తింపు ఉందా లేదా అనే విధానమే తీసుకురావాలి. ►ఉన్నత విద్యాసంస్థలకు అనుబంధ గుర్తింపు విధానం తొలగించాలి. అవన్నీ బోధన కాలేజీలుగా కొనసాగేలా చర్యలు చేపట్టాలి. ప్రైవేటు విద్యాసంస్థలకు పరిశోధన నిధులు... ►ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ప్రాజెక్టుల కోసం నిధులు పొందేలా చర్యలు చేపట్టాలి. ►ప్రభుత్వ విద్యాసంస్థలతో సమానంగా ప్రైవేటు విద్యాసంస్థలకు ఎన్ఆర్ఎఫ్ ఫండింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. ►పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చేలా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంతోపాటు దానికి అదనంగా ప్రస్తుతం ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐసీఎస్ఎస్ఆర్ సంస్థలను కొనసాగించాలి. ►నీట్ తరహాలో ఎంబీబీఎస్ పూర్తయ్యే సమయంలో ఎగ్జిట్ పరీక్షగా కామన్ పరీక్షను ప్రవేశపెట్టాలి. ► అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ కేడర్ల మధ్యలో స్థాయిలను కొనసాగించాలి. ►ఎంఫిల్ విద్యా విధానాన్ని తొలగించాలి. -
ముం'చెత్త'తోంది
⇒ ఇంట్లో చెత్త బయట పడేస్తున్నాం.. ఇల్లు శుభ్రమైందని చేతులు దులిపేసుకుంటున్నాం.. ⇒ ట్రక్కుల కొద్దీ చెత్తను ఊరి శివార్లలో పడేస్తున్న అధికారులూ.. ఓ పనైపోయిందని అంటున్నారు.. ⇒ అంతా బాగానే ఉంది.. కానీ పీల్చే గాలి.. తాగే నీరు.. తినే తిండి.. అన్నీ ఇప్పుడు కాలుష్య కాసారాలే.. ⇒ డెంగీ, చికున్ గున్యా ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.. అసలు ఎక్కడుంది సమస్య? పరిష్కారం ఏమిటి? సాక్షి నాలెడ్జ్ సెంటర్ : నిజం ఏమిటంటే.. దేశంలో ఎంత చెత్త ఉత్పత్తి అవుతోందో ప్రభుత్వానికీ స్పష్టంగా తెలియదు. తెలిసిందల్లా.. ఒక్కో మనిషి రోజుకు కనిష్టంగా 300 గ్రాములు.. గరిష్టంగా 600 గ్రాములు చెత్త ఉత్పత్తి చేస్తాడని.. దీన్ని జనాభా సంఖ్యతో హెచ్చవేసి.. ఫలానా నగరంలో రోజుకు ఇంత చెత్త ఏర్పడుతోందన్న అంచనాలే! 2012 నాటి కస్తూరి రంగన్ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 5.2 కోట్ల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. అంటే.. ప్రతి రోజూ దాదాపు 1.5 లక్షల టన్నుల చెత్తన్నమాట. దక్షిణాదిని మాత్రమే తీసుకుంటే రోజుకు 36,400 టన్నులు. ప్రభుత్వ యంత్రాంగం ఇందులో మూడో వంతును మాత్రమే డంపింగ్ యార్డ్‌లకు చేరుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో ముప్ఫై ఏళ్లలో చెత్త పారబోసేందుకే దాదాపు నాలుగు లక్షల ఎకరాల స్థలం కావాలి! ఇది ముంబై, చెన్నై, హైదరాబాద్ మూడింటినీ కలిపితే వచ్చేంత భూ భాగం! అంతా కలగాపులగం.. రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఈ ‘చెత్త’సమస్యపై ఒక అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో చెత్త సేకరణ ఎలా జరుగుతోంది? నిర్వహణ ఎలా ఉంది? అన్న అంశాలపై జరిగిన ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నాట్ ఇన్ మై బ్యాక్‌యార్డ్ పేరుతో విడుదలైన పుస్తకంలో భారతదేశంలోని నగరాల్లో చెత్త సమస్యను సవివరంగా ప్రస్తావించింది. వంటింటి వ్యర్థాలు, ప్లాస్టిక్, లోహపు వస్తువులు, కాగితం, రబ్బర్ వంటి వాటన్నింటినీ కలగలిపి పారబోస్తూండటం.. చెత్తను సమర్థంగా నిర్వహించడంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. కాలుష్యాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన 3ఆర్ సూత్రాల (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్)ను పాటించకపోవడం కూడా సమస్య తీవ్ర రూపం దాల్చేందుకు ఇంకో కారణం. అంతేకాక చెత్తనంతా ఒకేదగ్గరకు చేర్చి భారీ యంత్రాలు, టెక్నాలజీల సాయంతో సమస్యను అధిగమించాలన్న ఆలోచన కూడా సరికాదని అంటున్నారు సీఎస్ఈ డైరెక్టర్ సునీతా నారాయణ్. వెలుగు దివ్వెలు ఇవిగో.. చెత్త సమస్యను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేరళలోని అలెప్పీ, గోవా రాజధాని పణజి, బెంగళూరు, మైసూరు, ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి వంటివి ఆశాకిరణాలుగా కనిపిస్తున్నాయి. అలెప్పీ విషయాన్నే తీసుకుంటే.. ప్రతి ఇంట్లోనూ తడి, పొడి చెత్తలు వేర్వేరు చేయాల్సిందేనని.. లేదంటే ఇళ్ల నుంచి చెత్త సేకరించమని స్పష్టం చేసింది. ప్రజలు కొంత కాలం అసంతృప్తి వ్యక్తం చేసినా.. నెమ్మదిగా దీని ప్రాముఖ్యతను గుర్తించారు. ఫలితంగా ప్రస్తుతం అలెప్పీ స్వచ్ఛమైన పట్టణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సేకరించిన తడి చెత్తను వివిధ పద్ధతుల ద్వారా కుళ్లబెట్టి ఎరువుగా మార్చి రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. పొడిచెత్తను కూడా ఇదే రకంగా నిర్దిష్ట కేంద్రాల్లో వర్గీకరించి.. ఏవిధంగానూ రీసైకిల్ చేయలేమనుకున్న చెత్తను మాత్రమే డంపింగ్ యార్డ్‌కు పంపుతున్నారు. పణజి, మైసూరుల్లోనూ ఇదే పరిస్థితి. బెంగళూరులో మాత్రం ‘హసిరుదళ’అనే స్వచ్ఛంద సంస్థ నగరంలో చెత్త ఏరుకునే వారిని ఒక ఛత్రం కిందకు తీసుకువచ్చింది. చెత్త సేకరణ వర్గీకరణల ద్వారా వారు నెలకు దాదాపు రూ.15 వేల వరకూ ఆర్జించేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి గుర్తింపు కార్డులు లభించేలా చేయడంతో పోలీసుల వేధింపులు తగ్గి వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని అంటున్నారు హసిరుదళ డైరెక్టర్ నళినీ శేఖర్. అక్కడకక్కడా చెదురుమదురుగా జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ప్రతిచోటా ఆచరణలోకి వచ్చినప్పుడే చెత్త సమస్యను అధిగమించవచ్చు. ఇందుకు కావాల్సింది మన ఆలోచనల్లో కొంచెం మార్పు.. రాజకీయ నాయకులు, అధికారుల చిత్తశుద్ధి మాత్రమే.