
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో పాఠ్యాంశంగా హిందీని కూడా చేర్చాలని కేంద్ర మానవ వనరుల అభివృధి శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడానికి వీళ్లేదని తేల్చిచెప్పారు. తమపై ఏ భాషను బలవంతంగా రుద్దాలని చూసినా ప్రతిఘటన తప్పదని ఆయా ప్రాంతాల విద్యావేత్తలు, రచయితలు హెచ్చరిస్తున్నారు.
దీంతో తాజా నిర్ణయంపై కేంద్రం పునారాలోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖమంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని.. వారి అభిప్రాయం మేరకు సవరణ చేస్తామని స్పష్టం చేశారు. తాము అన్ని భాషలను గౌరవిస్తామని.. బలవంతంగా హిందీని అమలుచేయలేమని తెలిపారు. కాగా దేశంలో సరికొత్త విద్యావిధానాన్ని అమలుచేస్తామని 2014 నాటి ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరీ రంగన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది.
ఈ కమిటీ తన నివేదికను కేంద్ర మంత్రి రమేష్ పోకిరియాల్ నిషాకు శుక్రవారం సమర్పించింది. కొత్త జాతీయ విద్యాపథకం లక్ష్యాలను అందులో పొందుపరిచింది. ఆరోతరగతి నుంచి నిర్బంధ హిందీ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. సరికొత్త జాతీయ విద్యావిధానంపై ప్రజలు తమ అభిప్రాయాలను ఈనెల 30లోగా వెబ్‌సైట్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. అయితే ఏ భాషపైనా నిర్బంధం విధించాలని ఆ కమిటీ సిఫార్సు చేయలేదని కేంద్రం చెబుతోంది. దీంతో పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అది మా రక్తంలోనే లేదు: స్టాలిన్