సర్కారీ బడులపై నమ్మకం కలిగించాలి
‘నూతన విద్యా విధానం’పై సదస్సులో కడియం
* అది లేదు గనుకే ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలు
* ప్రభుత్వ విద్యావ్యవస్థను కాపాడాలని టీచర్లకు హితవు
* పలు సలహాలిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే, మెరుగైన విద్య కోసం అప్పు లు చేసైనా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ‘‘రాష్ట్రంలో 60 లక్షల మంది పాఠశాల విద్యార్థుల్లో 29 లక్షలు ప్రభుత్వ, 31 లక్షలు ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉం డాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారం 21 మందికి ఒకరున్నారు. ఉన్నత పాఠశాలల్లో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాల్సి ఉంటే 19 మందికి ఒకరున్నారు. అయినా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంటే ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు.
‘నూతన విద్యా విధానం’పై గురువారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన అతిథిగా పాల్గొని, 48 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు.
అందరికీ విద్య-అందరి బాధ్యత
రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొటోందని, ప్రభుత్వ విద్యావ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత టీచర్లతో పాటు అందరిపైనా ఉందని కడియం అన్నారు. కేంద్రం సంకల్పించిన నూతన విద్యా విధానానికి రాష్ట్రం తరఫున నివేదిక పంపాల్సి ఉందని గుర్తు చేశారు. నిపుణులు, మేధావుల నుంచి సూచనలు స్వీకరించేందుకు త్వరలో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు.
కార్యక్రమంలో పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సంఘాలు ఏమన్నాయంటే..
టోల్‌ఫ్రీతో అవమానించొద్దు: సరోత్తమ్
అన్ని వ్యవస్థల మాదిరిగానే విద్యావ్యవస్థ కూడా కలుషితమైందని పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. పాఠశాలలపై పర్యవేక్షణకు కాదని పోలీసు అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తుం డడం సరికాదన్నారు. టీచర్లపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు ఇవ్వడం అవమానించడమేనన్నారు. పోలీసులను నియమించే యోచన లేదని కడియం స్పష్టం చేశారు.
‘‘సమాచార సేకరణ నిమిత్తమే టోల్ ఫ్రీ నంబరి చ్చాం’’అని అన్నారు. కంప్యూట ర్ విద్య అటకెక్కింది: మోహన్‌రెడ్డి
సర్కారీ స్కూళ్లలో కంప్యూటర్ విద్య అటకెక్కిందని పీఆర్‌టీయూ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్, స్కూళ్లలో సదుపాయాలు కల్పించాలన్నారు. వీటిపై మార్చిలో ఉపాధ్యాయ సంఘాలతో మళ్లీ భేటీ అవుతామని కడియం చెప్పారు.
వృత్తి విద్యకు ప్రాధాన్యం: హర్షవర్ధన్
వృత్తి విద్యపై ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఆసక్తిని పెంపొదిస్తే మేలని, నూతన విద్యా విధానంలో దీనికి ప్రాధాన్యమివ్వాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.
విధానపత్రం సరిగా లేదు: నర్సిరెడ్డి
కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధాన పత్రం సరిగా లేదని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు.
హెచ్‌ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు: శర్మ
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరిగినందున కాంప్లెక్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు తమ పరిధిలోని స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని హెడ్‌మాస్టర్ల సంఘం అధ్యక్షుడు మల్లిఖార్జున శర్మ సూచించారు.
పాఠశాల మాదనే భావన: రాజిరెడ్డి
ప్రభుత్వ పాఠశాల తమదనే భావన సమాజంలో వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎస్టీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి సూచించారు. పనిచేసే టీచర్లను ప్రోత్సహించాలని.. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
బాలికలకు రెసిడెన్షియల్ విద్య:కొండల్‌రెడ్డి
బాలికలకు రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని తప్పనిసరి చేయాలని టీపీటీఎఫ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి అన్నారు.