సంక్రాంతి సెలవులపై ఏపీ ప్ర‌భుత్వం క్లారిటీ.. ఆ వార్త‌ల్లో నిజం లేదు | Sankranti 2025 holiday dates announced for Andhra Pradesh schools | Sakshi
Sakshi News home page

ఏపీలో పాఠశాలలకు జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు

Published Thu, Dec 26 2024 2:49 PM | Last Updated on Thu, Dec 26 2024 3:06 PM

Sankranti 2025 holiday dates announced for Andhra Pradesh schools

సాక్షి, అమరావతి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు (Sankranti holidays) ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్‌ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్‌ మీడియాలో (Social Media) జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.  

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ జారీ 
2025–26 విద్యా సంవత్సరానికిగాను ఆలిండియా సైనిక్‌ స్కూల్‌ (Sanik School) ప్రవేశ పరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు జనవరి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి పాస్‌ అయి, 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారు 9వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://exams.nta.ac.in/AISSEE/చూడొచ్చు.

స్టీల్‌ప్లాంట్‌లో అప్రెంటీస్‌కు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖ‌పట్నం స్టీల్‌ప్లాంట్‌లో (Vizag Steelplant) గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌ ట్రైనీ (గాట్‌), టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ ట్రైనీ (టాట్‌)కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గాట్‌కు రూ.9 వేలు, టాట్‌కు రూ.8 వేలు స్టైఫండ్‌ చెల్లించనున్నారు. 2022 తర్వాత గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులు నాట్స్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది. గూగుల్‌ ఫారం నింపేందుకు జనవరి 9 వరకు గడువు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

చ‌ద‌వండి: ఇంటర్‌ ఫీజు చెల్లింపునకు తత్కాల్‌ అవకాశం

చైల్డ్‌ కేర్‌ లీవ్‌ షరతులతో ఇబ్బందులు
న్యాయం చేయాలని ఏపీటీఎఫ్‌ అమరావతి డిమాండ్‌
సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్‌ కేర్‌ లీవ్‌లను 10 విడతల్లోనే వినియోగించుకోవాలన్న షరతుతో వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ షరతును రద్దు చేసి ఉద్యోగినులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. షరతులతో సెలవు లక్ష్యం దుర్వినియోగమవుతోందన్నారు. అవసరం మేరకు మాత్రమే సెలవు ఉపయోగించుకునేలా, అపరిమిత విడతలతో చైల్డ్‌ కేర్‌ లీవ్‌ పొందేలా 199,36 జీవోలను సవరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement