సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది.
అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా, 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పాఠశాల, కళాశాల విద్యను 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. జీడీపీలో విద్యారంగ కేటాయింపులు కనీసం ఆరు శాతానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాల విద్యకు ప్రమాణాలు:
ళి విద్యా సంబంధ, విధాన నిర్ణయాలకు సంబంధించి స్పష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఈ విధానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠశాల ప్రమాణాల రాష్ట్ర అథారిటీ(ఎస్‌ఎస్‌ఎస్‌ఏ)ని ఏర్పాటు చేసుకుంటాయి.
2035 నాటికి 50 శాతానికి జీఈఆర్:
ళి ఉన్నత విద్యలో దేశంలో స్థూల ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి (జీఈఆర్)ని 26.3 శాతం( 2018) నుంచి 2035 నాటికి 50 శాతానికి చేర్చాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొత్తగా 3.5 కోట్ల సీట్లను జత చేయనున్నారు. ఎంఫిల్ కోర్సులను తొలగించాలని నిర్ణయించారు.
హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్
► ఉన్నత విద్యా వ్యవస్థ పాలన అవసరాల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య, న్యాయ విద్యకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీనికి నాలుగు స్వతంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (జిఇసి), హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్.
► ఉపాధ్యాయ విద్యకు సంబంధించి, సమగ్రమైన నూతన జాతీయ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌ను 2021 నాటికి రూపొందించనున్నారు. 2030 నాటికి బోధనకు నాలుగు సంవత్సరాల బీఈడీ డిగ్రీ కనీస అర్హత అవుతుంది. నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలుంటాయి.
► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్దులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌ను విస్తరింపచేసి స్కాలర్‌షిప్ పొందిన విద్యార్ధుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కువ ఫ్రీషిప్, స్కాలర్‌షిప్‌లను తమ విద్యార్థులకు అందించేలా చూస్తారు.
ముఖ్యాంశాలు..
► ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలి. వినూత్న విద్యా కేంద్రాలు, మౌలికసదుపాయాల మద్దతుతో మధ్యలోనే బడి మానేసిన దాదాపు 2 కోట్లమందిని మళ్లీ బడిబాట పట్టించాలి.
► పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. 3–8, 8–11, 11–14, 14–18 సంవత్సరాల విద్యార్ధులు దీనిపరిధిలోకి వస్తారు.
► పిల్లల మానసిక వికాసానికి అనువైన దశగా అంతర్జాతీయంగా గుర్తించిన నేపథ్యంలో ఇకపై 3–6 సంవత్సరాల వయసుగల వారు పాఠశాల విద్యా ప్రణాళిక కిందికి వస్తారు. ఈ విధానంలో మూడు సంవత్సరాలు అంగన్ వాడీ లేదా ప్రీ స్కూల్‌తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుంది.
► పాఠశాల స్థాయిలో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని 21 వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలక అంశాలను నేర్చుకునేందుకు పాఠ్యాంశాలను తగ్గిస్తారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి దానిపై దృష్టిపెడతారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్ధులకు స్వేచ్చ ఉంటుంది. ఆర్ట్స్, సైన్సు మధ్య కఠిన విభజన ఏదీ ఉండదు. వృత్తి విద్యను 6 వ గ్రేడ్ నుంచే ఇంటర్న్‌షిప్‌తో పాటు ప్రారంభిస్తారు.
► కొత్త సమగ్రమైన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఎఫ్‌ఎస్‌ఈ– 2020–21)ను ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేయనుంది. ళీ మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా కనీసం 5వ తరగతి వరకు ఉంచాలని, 8వ తరగతి, ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించారు. సంస్కృతాన్ని పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు ఐచ్ఛికంగా మూడు భాషల విధానంలో భాగంగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది.
► ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. 6–8 గ్రేడ్ ల మధ్య ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చు. ళీ వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్‌లను, జెండర్ ఇంక్లూజన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులైన పిల్లలు రెగ్యులర్ పాఠశాల ప్రక్రియలో ఫౌండేషన్ స్థాయి నుంచి ఉన్నత విద్యవరకు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు.
హెచ్చార్డీ కాదు.. విద్యా శాఖ
మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ పేరును మళ్లీ విద్యా శాఖగా మారనుంది. సంబంధిత ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన విద్యా విధానం సిఫారసుల్లో మంత్రిత్వ శాఖ పేరు మార్పు కూడా ఒకటి. 1985లో రాజీవ్ గాంధీ హయాంలో విద్యా శాఖ పేరును హెచ్చార్డీ శాఖగా మార్చరు.
Comments
Please login to add a commentAdd a comment