కేంద్రీయ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు ఇస్తున్నట్లుగానే రాష్ట్ర యూనివర్సిటీలకు కూడా కేంద్రప్రభుత్వం నిధులివ్వాలని
కావాలని వైస్ చాన్సలర్‌లు, ప్రొఫెసర్ల డిమాండ్
నూతన విద్యా విధానంపై
కేంద్రానికి సిఫార్సు చేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు ఇస్తున్నట్లుగానే రాష్ట్ర యూనివర్సిటీలకు కూడా కేంద్రప్రభుత్వం నిధులివ్వాలని పలు వర్సిటీల ప్రొఫెసర్లు, మాజీ వీసీలు, రిటైర్డ్ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలని, నూతన విద్యా విధానంలోనూ వీటికి చోటు కల్పించాలని సూచించారు. నూతన విధానంలో ఉన్నత విద్య ఎలా ఉండాలన్న అంశంపై క్షేత్రస్థాయి నుంచి కేంద్రం అభిప్రాయ సేకరణ చేపట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశ్‌ల నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు వర్సిటీల రిటైర్డ్, ప్రస్తుత వైస్ చాన్సలర్లు, ప్రొఫెసర్లు పి.పద్మావతి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, అల్తాఫ్ హుస్సేన్, వినయ్‌బాబు తదితరులు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. వాటిలో ప్రధానాంశాలు...
► వసతుల కల్పన, ఆర్థికాంశాలు తదితరాల్లో కేంద్రీయ, రాష్ట్ర వర్సిటీల మధ్య చాలా వ్యత్యాసముంది. రాష్ట్ర వర్సిటీలకు రాష్ట్రాలిచ్చే మొత్తం చాలడం లేదు. దాన్ని పెంచాలి. కేంద్రం వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు, పరిశోధనలకు నిధులను భారీగా ఇవ్వాలి.
► కేంద్రీయ వర్సిటీలతోపాటు రాష్ట్ర వర్సిటీల్లోనూ నియామకాలకు కేంద్రమే విధానపరమైన నిర్ణయం చేయాలి.
► కాలేజీలకు అటానమస్ హోదా కల్పించాలి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీలు ఆ హోదా పొందేందుకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాల కల్పన, నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తద్వారా నేరుగా ఆయా కాలేజీలకు యూజీసీ నిధులు వస్తాయి.
► వర్సిటీలకు ఆర్థిక, పాలన, విద్యాపరమైన స్వేచ్చ కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే నిధులివ్వాలి. అవసరమైన వాటిపై ఖర్చుచేసుకునే అవకాశమివ్వాలి.
► విద్యా నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు అధ్యాపకుల నియామకాలు చేపట్టాలి. చాయిస్ బేస్డ్ క్రెడిట్, సెమిస్టర్ విధానాలను అమల్లోకి తేవాలి.
► విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే, ఉపాధి కల్పించే కోర్సులను ప్రభుత్వ కాలేజీలన్నింట్లోనూ ప్రవేశపెట్టాలి.
► వెనకబడిన వర్గాలు ఆర్థిక వెనకబాటుతనం వల్లే ఇంకా ఉన్నత విద్యకు నోచుకోవడం లేదు. వారికి ప్రభుత్వం భారీగా ఆర్థిక సహకారం అందించాలి. ప్రతి పట్టణ కేంద్రంలో వారికి హాస్టల్ సదుపాయం కల్పించాలి. టెక్నాలజీ, సబ్జెక్టుపరమైన విజ్ఞానం అందించే ప్రత్యేక బోధన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రభుత్వ విద్యా సంస్థలే అమల్లోకి తేవాలి. వాటి వ్యయాన్ని ఆయా పరిశ్రమలే ప్రభుత్వానికి, విద్యా సంస్థలకు అందించాలి. అంతేతప్ప, ప్రైవేటు సంస్థలే విద్యా సంస్థలను కొనసాగించడం వల్ల లాభముండదు.
► పరీక్షల విధానాన్ని పూర్తిగా సంస్కరించి పేపర్‌లెస్ పద్ధతిని తేవాలి. బహుళ ప్రయోజనకర కోర్సులను ప్రవేశపెట్టాలి.