
నో చాన్స్!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోకి హిందీ, సంస్కృతం అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానం విషయంలో తమ స్పష్టతను రాష్ట్ర పాఠశాల, ఉన్నత విద్యా శాఖల మంత్రులు బెంజిమిన్, అన్భళగన్‌లు తెలియ జేశారు. అసెంబ్లీ వేదికగా మంత్రులు హామీని డీఎంకే ఆహ్వానించింది. అదే సమయంలో ప్రత్యేక తీర్మానానికి పట్టుబడుతూ, డీఎంకే పంపిన విజ్ఞప్తిపై స్పీకర్ ధనపాల్ పరిశీలన జరుపుతున్నారు.
తమిళులకు భాషాభిమానం ఎక్కు వే అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక్కడ, హిందీ, సంస్కృతంకు చోటు లేదని చెప్పవచ్చు. ఆ రెండు భాషల్ని అనుమతించే ప్రసక్తే లేదని ఆది నుంచి ఇక్కడి రాజకీయ పక్షాలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానంకు సిద్ధం కావడంతో, బలవంతంగా హిందీ, సంస్కృతం రుద్దే ప్రయత్నం జరుగుతున్నదన్న ఆందోళనలు బయలు దేరాయి. దీనికి వ్యతిరేకంగా పోరు బాటు సైతం సాగుతూవస్తున్నది.
ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీలో ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖలకు కేటాయింపులపై జరిగిన చర్చలో కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానం ప్రస్తావనకు వచ్చింది. డీఎంకే సభ్యుడు తంగం తెన్నరసు రాష్ట్రంలోని విద్యా విధానాలు, కేటాయింపుల గురించి ప్రసంగాల్ని హోరెత్తిస్తూ, కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వ స్పష్టతను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన కమిటీలో అధికారులే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్భళగన్ స్పందించారు.
కొత్త విద్యావిధానానికి సంబంధించిన కొన్ని అం శాలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఉన్నాయని వివరించారు. వీటిని పరిశీలించి, అందుకు తగ్గ సమాధానా లు, అభిప్రాయాలను అమ్మ జయలలిత సకాలంలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. తమిళనాడు సంక్షేమం, తమిళ భాషాభ్యున్నతి, సంస్కృతి సంప్రదాయాల ప రిరక్షణ దిశగా తమ ప్రభుత్వం ముందు కు సాగుతుందే గానీ, వాటిని కాలరాసే ప్రయత్నాలను అనుమతించ బోదని స్పష్టం చేశారు. తమిళనాడులోకి హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దేందు కు తగ్గ అవకాశాలను తాము ఇచ్చే ప్ర సక్తే లేదన్నారు. తమిళనాడులోని విద్యా విధానం, ఇక్కడ అవకాశాలు తదితర అంశాలను కేంద్రం దృష్టికి తమ అభిప్రాయాల ద్వారా తీసుకెళ్తామన్నారు.
ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హిందీ, సంస్కృతంలకు ఇక్కడ అవకాశాలు కల్పించబోమని మరో మారు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పాఠశాల విద్యా శాఖ మంత్రి బెంజిమిన్ పేర్కొంటూ, ఆ రెండింటికి అనుమతి లేదని వ్యాఖ్యానించారు. ఇక, అన్భళగన్ తన ప్రసంగంలో మదురై, చెన్నై , అన్నావర్సిటీలకు వీసీల నియా మకంకుగాను ఎంపిక కమిటీ నియమించామని ప్రకటించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికను గవర్నర్‌కు పంపించడం జరుగుతుందని, ఆ తర్వాతే వీసీల నియామకం ఉంటుందని వివరించారు. ఇక, హిందీ, సంస్కృతాన్ని రాష్ట్రంలోకి అనుమతించేందుకు అవకాశాలు ఇవ్వం అని అసెంబ్లీ వేదికగా మంత్రులు స్పష్టం చేయడాన్ని ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.
అదే సమయంలో తాము ఇచ్చిన ప్రత్యేక తీర్మానం అంశాన్ని పరిగణించాలని స్పీకర్‌ను కోరారు. ఈ విజ్ఞప్తి పరిశీలనలతో ఉన్నట్టు ఈసందర్భంగా స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఎడపాడి పళని స్వామి ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాగపట్నం జిల్లాలోని వెట్టారులో చెక్ డ్యాంల నిర్మాణానికి పరిశీలన జరుపుతున్నామని ప్రకటించారు. ఇక, పంచాయతీ యూనియన్‌ల విభజన ప్రక్రియ గురించి మరో మంత్రి ఎస్‌పీ వేలుమణి ప్రసంగిస్తూ, జిల్లాల కలెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా నియమ నిబంధనల మేరకు విభజన పర్వం సాగుతుందన్నారు.
ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ ప్రసంగిస్తూ, ప్రస్తుతానికి అలాంటి యోచన లేదు అని స్పష్టం చేశారు. సభలో ఒకరు ప్రసంగిస్తున్న సమయంలో మరొకరు అడ్డు పడే విధంగా సాగుతున్న వ్యవహారంపై సీఎం జయలలిత స్నేహ పూర్వక సూచనను సభలో చేయడం విశేషం. ప్రతి పక్ష సభ్యులు ఏదేని అంశాలపై చర్చ సాగిస్తున్నప్పుడు, ఆ చర్చ ముగిసే వరకు మధ్య మధ్యలో ప్రశ్నలు వేయడం మానుకుంటే మంచిదని, ప్రభుత్వం చేసిందా.చేస్తుందా..? సమాధానం ఎవరు ఇస్తారు..? ఇలా మధ్య మధ్యలో ప్రశ్నలను సంధించడం వలను సమాధానాలు ఇచ్చేందుకు అప్పటికప్పుడే మంత్రులు సిద్ధం అవుతున్నారని సూచించారు.