ఒక దేశ సర్వతోముఖ అభివృద్ధిలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను మన దేశ నాయకులు బహుధా గుర్తిం చారు. నూతన విద్యా విధానం– 2020 మొట్టమొదటి ప్రాధాన్యత ఏమిటంటే 2030 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం పిల్లలను బడిలో చేరుస్తూ, మాధ్యమిక స్థాయి వరకు విద్యను సార్వజనీనం చేయడం. నూతన విద్యా విధానానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం సాధించాలంటే, పాఠశాల విద్య స్థితి ప్రస్తుతం ఎలా ఉన్నది, గత కొన్ని ఏళ్లుగా ఎలా ప్రగతి సాధిస్తున్నది అనే విషయాన్ని తెలుసుకోవాలి. వివిధ రంగాలపరంగా దేశంలో అనేక అసమానతలు ఉన్నట్లు ఎన్నో అధ్యయనాలు వెల్లడిం చాయి. మాధ్యమిక విద్యను సార్వజనీనం చేయడం అనే లక్ష్యాన్ని 2060 సంవత్సరం నాటికి భారత్ చేరుకునే అవకాశం ఉందని యునెస్కో నివేదిక బహిర్గతం చేస్తోంది. ఒకవిధంగా చూస్తే ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నిర్దేశించుకున్న 2030 కాలావధికి బహుదూరం.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి యంగ్ లైవ్స్ అధ్యయనం, ఇండియా స్పెండ్ నివేదిక, ఏఎస్‌ఈఆర్ (ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎజుకేషన్ రిపోర్ట్) నివేదిక వంటివి కొన్ని నిష్టుర సత్యాలను వెల్లడించాయి. చదవడం, లెక్కలు చేయడం లాంటి ప్రాథమిక సామర్థ్యాలను సైతం తెలుగు సమాజంలోని పిల్లలు అందుకోవడంలో చాలా అసమానతలు ఉన్నాయని; నేర్చుకోవడం అనే ప్రక్రియ వీరిలో క్రమంగా క్షీణిస్తూ వచ్చిందని ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత శాతం (68) జాతీయ సగటు (74) కంటే ఎప్పుడూ తక్కువగానే ఉంటూవచ్చింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ (83), రంగారెడ్డి (76), పశ్చిమ గోదావరి (75), కృష్ణ (74) జిల్లాలు మాత్రమే జాతీయ సగటుకు దగ్గరగా ఉన్నాయి. అదే సమయంలో కర్నూలు, మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలు అత్యధిక లింగ వివక్షతో పాటు, అత్యల్ప అక్షరాస్యత శాతాన్ని నమోదు చేశాయి. నికర నమోదు శాతం (నెట్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) 14–15 ఏళ్ల వయసు పిల్లల్లో 1993–94లో ఉన్న 32.2 శాతం నుంచి 2011–12 వరకు 51.7 శాతానికి పెరిగింది. గణనీయమైన 2.7 వృద్ధిరేటు సాధించినప్పటికీ 2020 నాటికి 62.1 శాతం పిల్లల నమోదు మాత్రమే సాధ్యమవుతుందని ఒక అంచనా. కాకపోతే అగ్రకులాల పిల్లలు, ఇతర ఉపాంతీకరించబడిన పిల్లల్లో భేదాలు తగ్గుముఖం పడుతుండటం విశేషం. అయినా నూరు శాతం నమోదు లక్ష్యం 2038 సంవత్సరం నాటికి మాత్రమే సాధ్యపడుతుంది. అదే 16–17 వయసు పిల్లల్లో నికర నమోదు నూరు శాతం సాధించాలంటే మరో 25 ఏళ్లు ఆగక తప్పదు.
2020 నాటికి 14–15 వయసు పిల్లల్లో 2.2 శాతం ఎప్పటికీ నమోదు కారు. పైగా పదింట ఒక వంతు మంది పిల్లలు బడి మానేసే అవకాశం ఉంది. అలాగే 16–17 వయసు వారిలో పావువంతు పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. 17 ఏళ్ల వయసులో మాధ్యమిక స్థాయి ముగింపు రేటు 1993–94లో ఉన్న 40 నుంచి 2011–12 వరకు 63.1కి పెరిగింది. ఈ లెక్కన 72.5 శాతం మంది మాత్రమే 2020 నాటికి మాధ్యమిక స్థాయి పూర్తి చేయనున్నారు. తల్లిదండ్రుల చదువు, ఇంటి కోసం ఖర్చు పెట్టగలిగే స్థాయి లాంటివి దీనిమీద గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని ఎకనామెట్రిక్ విశ్లేషణ తెలియజేస్తోంది. ఎయిడెడ్ కాని ప్రైవేట్ పాఠశాలల్లో కన్నా, ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో మాధ్యమిక ముగింపు రేటు అత్యధికంగా ఉండటం గమనార్హం.
తెలంగాణ రాష్టం విషయానికి వస్తే 6–14 వయసు పిల్లల్లో నూరు శాతం నమోదు లక్ష్యాన్ని 2020 నాటికి చేరుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ లక్ష్యాన్ని 2023 నాటికి చేరుకోనుంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని జిల్లాలు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అవరోధం కానున్నాయి. 2016–17లో మేము చేసిన ఒక అధ్యయనంలో 6–16 ఏళ్ల వయసు వారిలో 14 శాతం పిల్లలు బడి మానేసినవారు కాగా, మూడు శాతం పిల్లలు ఎన్నడూ బడి ముఖం చూడని వాళ్ళు. బడి మానేస్తున్న పిల్లల్లో సగటున ఆరో తరగతి వరకు చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్రమైన సంకల్పంతో ముందుకు సాగితే తప్ప మాధ్యమిక విద్యను సార్వజనీనం చేయడం అనేది సుదూర కలగానే మిగిలిపోనుంది.
మహబూబ్‌నగర్, కరీంనగర్, కర్నూల్, విశాఖపట్నం లాంటి తక్కువ అక్షరాస్యత గల జిల్లాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయడం; ఉచిత బస్సు పాసులు, పుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ చేయడం; మధ్యాహ్న భోజనం ఏర్పాటు; నగదు బదిలీ చేయడానికి బాలికల వివాహాన్ని ఆలస్యం చేయడం ఒక షరతుగా పెట్టడం; బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేయడం లాంటి మెరుగైన మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇవన్నీ పిల్లలను బడిలో చేర్చడం, వారిని కొనసాగించడంలో విశేషమైన సానుకూల పాత్రను పోషించాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో గురుకుల పాఠశాలల్ని ఎక్కడా లేని విధంగా అధిక సంఖ్యలో స్థాపించడం, మాధ్యమిక విద్యను పూర్తి చేయడాన్ని బాలికలకు అందించే నగదు ప్రేరేపకాలతో ముడిపెట్టడం లాంటివి సంపూర్ణ అక్షరాస్యతా లక్ష్యసాధనలో గణనీయమైన ఫలితాలు తేనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బడి మానేసిన పిల్లల్ని గుర్తించడం, వారిని వెనక్కి తేవడంలో గ్రామ సచివాలయాలు విశేష పాత్ర పోషిస్తున్నాయి. అమ్మ ఒడి, జగనన్న దీవెన, నాడు– నేడు, జగనన్న వసతి దీవెన లాంటి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంలో కూడా ఇవి ముందున్నాయి. క్షేత్రస్థాయిలో 50 ఇళ్లకు ఒక కార్యకర్త చొప్పున ఉండటం ఏపీని సమీప భవిష్యత్తులో మెరుగైన స్థితిలో ఉంచనుంది. మార్పు కోసం ఉద్దేశించిన నాలుగు మూల స్తంభాలు– ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, దీనికిగాను ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వడం; పాఠ్యాంశాలను మెరుగుపరిచి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడం; పాఠశాల మౌలిక వసతులను గణనీయంగా పునరుద్ధరించడం, మరింత పోషకాహారం అందించడం, పిల్లలకు కావాల్సిన పాఠశాల అవసరాలను ఉచితంగా అందించడం వంటి విశిష్టమైన చర్యలు ప్రభుత్వ పాఠశాల విద్య నాణ్యతను విప్లవాత్మకంగా మార్చే వీలుంది. ఇప్పటికే బడి పుస్తకాలను మిర్రర్ ఇమేజ్ బుక్స్ పేరిట ఇంగ్లిష్, తెలుగు భాషల్లో పక్కపక్కన ముద్రించడం జరి గింది. వీటన్నింటి ఫలితంగా నూతన విద్యా విధాన లక్ష్యాలను చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ సరైన దారిలో ఉంది.
పృథ్వీకర్ రెడ్డి
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సెస్
మొబైల్ : 94408 90508
Comments
Please login to add a commentAdd a comment