అన్ని సెంట్రల్‌ వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష! | Same Entrance Test For All Central Varsities | Sakshi
Sakshi News home page

అన్ని సెంట్రల్‌ వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష!

Published Mon, Dec 14 2020 5:53 AM | Last Updated on Mon, Dec 14 2020 5:53 AM

Same Entrance Test For All Central Varsities - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యా శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ శాఖ కార్యదర్శి అమిత్‌ఖరే ఇటీవల మీడియాకు వెల్లడించారు. కేంద్రం గతేడాది నూతన విద్యావిధానం–2020ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వేర్వేరుగా ఉన్న ఉన్నత విద్యా విభాగాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రతిపాదించింది. ఈ క్రమంలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ)ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేశంలో వివిధ ఉన్నత విద్యాకోర్సులకు జాతీయ స్థాయిలో కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు 54 ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో ప్రవేశాలకు వేటికవే ఎంట్రెన్స్‌ టెస్టులు నిర్వహించుకుంటున్నాయి. ఇకపై జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా వీటిలో ప్రవేశాలు కల్పిస్తారు.  

ఇంజనీరింగ్‌ తదితర కోర్సులకూ ప్రతిపాదన
మెడికల్‌ కోర్సులకు నీట్‌ను నిర్వహిస్తున్నట్టు.. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, తదితర సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతంలో కేంద్రం ప్రతిపాదించింది. ఇదే ప్రతిపాదనను ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) కూడా చేసినా చాలా రాష్ట్రాలు అంగీకరించలేదు. ప్రస్తుతం ఉన్నత విద్య కమిషన్‌ ఏర్పాటుతో మళ్లీ ఆ ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), ఏఐసీటీఈ, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) తదితర సంస్థలను కమిషన్‌లో విలీనం చేస్తున్నారు. దీంతో ఆయా కోర్సులకు దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష పెడతామని నూతన విద్యావిధానంలో కేంద్రం ప్రతిపాదించింది. అయితే రాష్ట్రాల నుంచి ఏ మేరకు సానుకూలత ఉంటుందనేది అనుమానమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

అన్ని విద్యా సంస్థల సీట్ల భర్తీ కష్టమే.. 
జాతీయస్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష వల్ల ఇక ఎంసెట్‌ వంటివి ఉండవు. కేవలం జాతీయస్థాయి పరీక్షల్లో వచ్చే మెరిట్‌ ఆధారంగానే రాష్ట్రాల్లోని కాలేజీల్లో సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు చాలా రాష్ట్రాలు ముందుకు రావడం లేదు. మెడికల్‌ కాలేజీల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల నీట్‌ ద్వారా సీట్ల భర్తీ సాధ్యమవుతోంది. అయితే వందల సంఖ్యలో కాలేజీలు ఉండే సాంకేతిక వృత్తి విద్యాకోర్సులకు ఇది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్‌ వర్సిటీలు, మైనార్టీ కాలేజీలు తమ ప్రవేశ పరీక్షలను తామే నిర్వహించుకుంటున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి రకరకాల నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల స్థాయిలోనే ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోనివ్వాలని చెబుతున్నారు. ఇలా అయితేనే సీట్ల భర్తీకి వీలుంటుందని, జాతీయస్థాయి ప్రవేశ పరీక్షతో సా«ధ్యం కాదని పేర్కొంటున్నారు. 

విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడి 
ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులు వేర్వేరు ప్రవేశ పరీక్షలను రాయాల్సి వస్తోంది. వీటికి సన్నద్ధమవ్వడం, దరఖాస్తు చేసేందుకు రుసుములు చెల్లించడం వారిని వ్యయప్రయాసలకు గురిచేస్తోంది. దీనివల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడితోపాటు ఆర్ధికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి జాతీయస్థాయిలో ఒకే ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించడమే దీనికి పరిష్కారమని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు రాస్తున్న ప్రవేశపరీక్షలు ఇవీ..
ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలు 
► జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, గేట్, ఐఐటీ జామ్, యూపీఎస్‌ఈఈ, బీసీఈసీఈ, ఏసీఈఈ, కేఈఏఎమ్, డబ్ల్యూబీజేఈఈ, సీవోఎంఈడీకే యూజీఈటీ, టీఎస్‌ఎంసెట్, సీయూసెట్, ఏపీఎంసెట్, ఓజేఈఈ, ఎల్‌పీయూఎన్‌ఈఎస్‌టీ 
► కేసీఈటీ, జేకేసీఈటీ, సీజీపీఈటీ, సీయూఎస్‌ఏటీ, జీయూజేసీఈటీ, జీసీఈటీ, యూకేఎస్‌ఈఈ, ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌టీ, ఐఐఎస్‌ఈఆర్, టీఏఎన్‌సీఈటీ, టీఎన్‌ఈఏ, ఏపీఈసెట్, టీఎస్‌ఈసెట్‌. 

మెడికల్‌ ప్రవేశ పరీక్షలు.. 
► నీట్, ఎయిమ్స్, జిప్‌మర్‌ ఎంబీఏ ప్రవేశపరీక్షలు.. 
► క్యాట్, మ్యాట్, గ్జాట్, సీమ్యాట్, జీఎంఏటీ, ఎన్‌ఎంఏటీ, ఆత్మ, ఐబీశాట్, స్నాప్, ఐఐఎఫ్‌టీ, కేఎంఏటీ (కేరళ), కేఎంఏటీ (కర్ణాటక), ఏపీ ఐసెట్, టీఎస్‌ ఐసెట్‌. 

లా ప్రవేశపరీక్షలు.. 
► లా, క్లాట్, ఏఐఎల్‌ఈటీ, ఏఐబీఈ, ఎల్‌శాట్, ఏపీలాసెట్, టీఎస్‌లాసెట్, ఎంహెచ్‌సెట్‌లా 

వర్సిటీ ప్రవేశపరీక్షలు.. 
► బిట్‌శాట్, ఎస్‌ఆర్‌ఎంజేఈఈ, యూపీఈఎస్‌ఈఏటీ, వీఐటీఈఈఈ, ఎంయూసెట్, పీటీయూసెట్, బీవీపీసెట్, సింబయాసిస్‌ సెట్, ఎస్‌ఏఏటీ, కేఐఐటీఈఈ, ఏఎంయూ, పీఈఎస్‌ఎస్‌ఏటీ, ఐపీయూసెట్, జేఎన్‌యూఈఈ, బీహెచ్‌యూ సెట్, అలహాబాద్‌ వర్సిటీ సెట్, ఢిల్లీ యూనివర్సిటీ సెట్, ఏయూసెట్‌ 

ఫార్మసీ ప్రవేశపరీక్షలు..
► జీప్యాట్, ఎంహెచ్‌సీఈటీ, పీయూసీఈటీ అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలు..
► ఐసీఏఆర్‌ ఏఐఈఈఏ, ఓయూఏటీ, ఎంపీపీఏటీ, జేఈటీ అగ్రికల్చర్, జేసీఈసీఈ  

ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మంచిది..  
జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మంచిది. కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ పాయింట్ల ఎంపికలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. దీంతో మెరిట్‌ విద్యార్థులతో రిజర్వేషన్‌ విద్యార్థులకు ఇబ్బందే. కేవలం ప్రవేశ పరీక్ష నిర్వహించి కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు రాష్ట్రాల పరిధిలోకి తీసుకువస్తే ఇబ్బంది ఉండదు.    
– డాక్టర్‌ డి.మురళీధర్‌రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, బయోటెక్నాలజీ, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ

ఫీజుల భారం తగ్గుతుంది.. 
ఇంజనీరింగ్‌ కోర్సులకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఫీజుల భారం తగ్గుతుంది. నాణ్యత కలిగిన కళాశాలలే మనగలుగుతాయి. విద్యార్థులకు ఎక్స్‌పోజర్‌ పెరుగుతుంది. ఇతర ప్రాంతాల్లోని మంచి కళాశాలల్లో చేరే అవకాశం వస్తుంది. ఇది మంచి నిర్ణయమే. అయితే.. విద్యార్థులకు తలెత్తే ఇబ్బందులపై ముందుగా అధ్యయనం చేయాలి. 
– ప్రొఫెసర్‌ జీఎన్‌ ప్రదీప్‌కుమార్,సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement