ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ఎప్పటినుంచీ అంటే.. | Summer holidays from May 25th for inter colleges | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ఎప్పటినుంచీ అంటే..

Published Sun, Apr 24 2022 3:19 AM | Last Updated on Sun, Apr 24 2022 3:25 PM

Summer holidays from May 25th for inter colleges - Sakshi

సాక్షి, అమరావతి: జూనియర్‌ కళాశాలలు, కాంపోజిట్‌ డిగ్రీ కళాశాలలకు 2021–22 విద్యా సంవత్సరానికి వేసవి సెలవులు మే 25వ తేదీ నుంచి అమలవుతాయని ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్‌ 19 వరకు ఈ సెలవులు ఉంటాయి. వేసవి సెలవుల తర్వాత జూన్‌ 20 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీలు ప్రారంభం అవుతాయి. కొన్ని కళాశాలలు వేసవి సెలవుల్లో కూడా పనిచేస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.

అన్ని యాజమాన్యాలు ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలకు 2021–22 వార్షిక క్యాలెండర్‌ ప్రకారం మే 25 నుంచి జూన్‌ 19 వరకు వేసవి సెలవుల కోసం జూనియర్‌ కాలేజీలు మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిన అడ్మిషన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలన్నారు. విద్యార్థులను బలవంతం చేయడానికి/ఒప్పించడానికి /ఆకర్షించడానికి ఏ కళాశాల కూడా అనవసరమైన ప్రచారాల్లో పాల్గొనకూడదని తెలిపారు.

కాలేజీల మధ్య అనారోగ్యకరమైన పోటీని కలిగించే హోర్డింగ్‌లు, కరపత్రాలు, వాల్‌ రైటింగ్‌లు, ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా మొదలైన వాటి ద్వారా ఎలాంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అన్‌ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ అందరూ పబ్లిక్‌ పరీక్షలో పనితీరు లేదా విజయానికి ఎలాంటి హామీని ఇవ్వకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరించారు. 

హాల్‌ టికెట్లు సిద్ధం 
రాష్ట్రంలో మార్చి 2022 ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు (థియరీ) హాజరు కానున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల హాల్‌ టికెట్లు (జనరల్, ఒకేషనల్‌) ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ (జ్ఞాన భూమి) లాగిన్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి తమ హాల్‌ టికెట్లు పొందాలన్నారు. అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు ఈ విషయాన్ని వారి జిల్లాల్లోని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు తెలియజేయాలని ఆదేశించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement