ఈఏపీసెట్‌లో ‘ఇంటర్‌’కు వెయిటేజీ | Weightage for Intermediate Marks in EAPCET-2023 | Sakshi
Sakshi News home page

ఈఏపీసెట్‌లో ‘ఇంటర్‌’కు వెయిటేజీ

Published Tue, Apr 4 2023 3:54 AM | Last Updated on Tue, Apr 4 2023 3:54 AM

Weightage for Intermediate Marks in EAPCET-2023 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రి­కల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌–2023లో ఇంటర్మీడియెట్‌ మార్కు­లకు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్‌ మార్కులకు 25 శాతం మేర వెయిటేజీ ఇచ్చి ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులను ప్రక­టించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన ఇంటర్‌ మార్కుల వెయిటేజీ విధా­నాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌లో కూడా పొందుపరిచింది. కాగా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేయడానికి ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది. సెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు.

ఆలస్య రుసుములతో మే 14 వరకు స్వీకరిస్తారు. ఇందులో భాగంగా మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం, మే 22, 23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహిస్తారు. కాగా ఈఏపీసెట్‌ దరఖాస్తు, ఇతర అంశాల్లో విద్యార్థులకు సహకారం అందించడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ రీజినల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 

ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనల మేరకు..
కరోనాకు ముందు వరకు ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగా ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. అయితే కరోనా వల్ల 2020, 2021 విద్యా సంవత్సరాల పరీక్షలు జరగలేదు. దీంతో ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం ఎత్తేసింది.

ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈఏపీసెట్‌లోని మార్కులనే పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించింది. 2022 నుంచి పరిస్థితులు సద్దుమణిగి ఇంటర్‌ తరగతులు సజావుగా సాగుతుండడంతో ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల మేరకు ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ రాసిన విద్యార్థులు 2022లో ఫస్టియర్‌ పరీక్షలు రాశారు.

ఫస్టియర్, సెకండియర్‌ పరీక్షలను విద్యార్థులంతా పూర్తిస్థాయిలో రాయడంతో ఇంటర్‌ మార్కులకు ఈఏపీసెట్‌–2023లో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం, ఈఏపీసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించనున్నారు. 

సిలబస్‌పైనా స్పష్టత
కాగా ఈఏపీసెట్‌–2023 సిలబస్‌పైనా ఉన్నత విద్యామండలి స్పష్టతనిచ్చింది. కరోనా సమయంలో తరగతులు, పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడ్డారు. దీంతో ఇంటర్‌ బోర్డు 30 శాతం మేర సిలబస్‌ను కుదించింది. అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు కుదించిన సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈఏపీసెట్‌ పరీక్షల్లోనూ ఉన్నత విద్యామండలి.. బోర్డు నిర్ణయించిన విధానాన్నే అనుసరించాల్సి వచ్చింది.

బోర్డు తీసేసిన అంశాలను సిలబస్‌ నుంచి మినహాయించి ఈఏపీసెట్‌ను నిర్వహించింది. 2022లో కూడా 30 శాతం సిలబస్‌ కుదింపు అంశాన్నే కొనసాగించింది. అప్పట్లో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆ 30 శాతం సిలబస్‌పై బోధన జరగలేదు. ఆ విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు రాశారు.

వీరు ఇంటర్‌ ఫస్టియర్‌లో బోర్డు మినహాయించిన 30 శాతం అంశాలను అధ్యయనం చేయలేదు. దీంతో ఈసారి కూడా ఈఏపీసెట్‌ సిలబస్‌లో ఇంటర్‌ సెకండియర్‌ సిలబస్‌ను పూర్తిగా, ఫస్టియర్‌ సిలబస్‌ను 30 శాతం మేర కుదించి పరీక్ష నిర్వహించనున్నారు.

ఈఏపీసెట్‌ ర్యాంకుల ఆధారంగానే నర్సింగ్‌ సీట్లు
కాగా ఈసారి కొత్తగా నర్సింగ్‌ సీట్లనూ ఈఏపీసెట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అనుబంధ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు ఏపీ ఈఏపీసెట్‌–2023 ర్యాంకుల ఆధారంగానే ఉంటాయని తెలిపింది. డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని వెల్లడించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement